త్వరలో.. గ్రూప్‌-4 నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2022-07-07T05:37:09+05:30 IST

త్వరలోనే గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ రాబోతోందని, విద్యార్థులు సిద్ధంగా ఉండాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. కేసీఆర్‌ కోచింగ్‌ సెంటర్‌లో కోచింగ్‌ తీసుకుని టెట్‌కు అర్హత సాధించిన విద్యార్థులతో బుధవారం ఆయన ముఖాముఖి నిర్వహించారు. పొన్నాలలోని తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టెట్‌ పరీక్షలో 32 శాతం ఉత్తీర్ణత నమోదైతే.. సిద్దిపేట కేసీఆర్‌ ఉచిత శిక్షణ కేంద్రంలో మాత్రం 82 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. 618 మంది అభ్యర్థులకు 517 టెట్‌లో పాసై రికార్డు సృష్టించారని పేర్కొన్నారు.

త్వరలో..  గ్రూప్‌-4 నోటిఫికేషన్‌

డీఎస్సీకి లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ ప్రారంభిస్తాం

ఉద్యోగ సాధనే లక్ష్యంగా అభ్యర్థులు సన్నద్ధం కావాలి

టెట్‌కు అర్హత సాధించిన విద్యార్థులతో ముఖాముఖిలో మంత్రి హరీశ్‌రావు వెల్లడి


సిద్దిపేట అర్బన్‌, జూలై 6 :  గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ త్వరలోనే రాబోతోందని, విద్యార్థులు సిద్ధంగా ఉండాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. కేసీఆర్‌ కోచింగ్‌ సెంటర్‌లో కోచింగ్‌ తీసుకుని టెట్‌కు అర్హత సాధించిన విద్యార్థులతో బుధవారం ఆయన ముఖాముఖి నిర్వహించారు. పొన్నాలలోని తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టెట్‌ పరీక్షలో 32 శాతం ఉత్తీర్ణత నమోదైతే.. సిద్దిపేట కేసీఆర్‌ ఉచిత శిక్షణ కేంద్రంలో మాత్రం 82 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. 618 మంది అభ్యర్థులకు 517 టెట్‌లో పాసై రికార్డు సృష్టించారని పేర్కొన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ రాకముందే అభ్యర్థులకు లాంగ్‌టర్మ్‌ శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. ఇక్కడ శిక్షణ తీసుకున్నవారందరూ ఉద్యోగాలు సాధించినప్పుడే కేసీఆర్‌ కోచింగ్‌ సెంటర్‌కు సార్థకత లభిస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే గ్రూప్‌-4కు కూడా ఉచిత కోచింగ్‌ కూడా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈసారి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు చాలా అదృష్టవంతులన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చి స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా కృషి చేశారని మంత్రి తెలిపారు. 


ప్రతిపక్షాలవి అర్థంలేని ఆందోళనలు

జీవో నంబర్‌ 317 ఎందుకు తెచ్చారో తెలియకుండానే ప్రతిపక్షాలు జవోను రద్దు చేయాలని ఆందోళన చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో 16.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, బీజేపీకి దమ్ముంటే వాటిని భర్తీ చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. తెలంగాణలో 1.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే గత ఏడాది వరకు 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం మరో 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అగ్నిపథ్‌ తుమ్మితే ఊడిపోయే ఉద్యోగమని, యువతను మోసం చేయడానికే ఈ పథకాన్ని తెచ్చారని మంత్రి విమర్శించారు. బీజేపీకి ప్రభుత్వ ఆస్తులను అమ్మడం తప్ప కొత్తగా తేవడం చాతకాదని, ఏ రంగంలో చూసినా బీజేపీ చేసిన మేలు ఏదీ లేదని విమర్శించారు. రూపాయి విలువ పతనమవుతున్నదని, దేశంలో నిరుద్యోగిత పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే బీజేపీ ఫేక్‌ న్యూస్‌తో కాలం వెల్లదీస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌ రేణుకా శ్రీనివాస్‌, టెట్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు గోవర్ధన్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T05:37:09+05:30 IST