అనుత్పాదక వ్యయాలు తగ్గితేనే వృద్ధి

ABN , First Publish Date - 2021-04-13T06:44:43+05:30 IST

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల ప్రకటించిన ద్రవ్యవిధానంలో తక్కువ వడ్డీరేట్ల ప్రక్రియను కొనసాగించింది. వడ్డీరేట్లు తక్కువగా ఉంటే...

అనుత్పాదక వ్యయాలు తగ్గితేనే వృద్ధి

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల ప్రకటించిన ద్రవ్యవిధానంలో తక్కువ వడ్డీరేట్ల ప్రక్రియను కొనసాగించింది. వడ్డీరేట్లు తక్కువగా ఉంటే వినియోగదారులు తమ వ్యక్తిగత వినియోగానికి బ్యాంకు రుణాలు తీసుకుంటారని, కొత్త మదుపులు చేయడం కోసం వ్యాపారస్థులు తప్పక రుణాలు తీసుకుంటారనేది ఆర్బీఐ విధాన నిర్ణేతల ఆలోచన. ఉదాహరణకు ఒక వినియోగదారుడు ఒక బైక్‌ను కొనుగోలు చేసుకునేందుకు రుణం తీసుకుంటాడు; ఒక వ్యాపారస్తుడు బైక్‌ను ఉత్పత్తి చేసేందుకు రుణం తీకుంటాడు. అయితే వాస్తవ పరిస్థితులు ఇంత ప్రోత్సాహకరంగా లేవు. రెపో రేటును ఆర్బీఐ తగ్గిస్తూనే ఉంది. 2014లో 8 శాతం నుంచి ఇప్పుడు 4 శాతానికి తగ్గిస్తూ వచ్చింది. అయితే వినియోగదారులు బ్యాంకు రుణాలు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. మార్కెట్లో డిమాండ్ లేదు. అదే సమయంలో వృద్ధిరేటు అంతకంతకూ పడిపోతోంది. 


సత్వర అభివృద్ధి సాధనకు కోశవిధానాన్ని ఉపయోగించుకోవడమే ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయం. ప్రభుత్వ ఆర్థిక విధానాలలో కోశ విధానమనేది ఒక భాగం. దీనిలో పన్నుల విధానం, ప్రభుత్వ రుణాలు-ఖర్చులు మొదలైనవి ఉంటాయి. ఆర్థికవ్యవస్థలోని చక్రీయ ఒడుదుడుకులు–ద్రవ్యోల్బణం, మాంద్యం–ను తటస్థీకరించేందుకు ఈ విధానాలను ప్రపంచంలోని అనేక దేశాలు ఆచరిస్తూ, ఆర్థికాభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి బాట వేసుకుంటున్నాయి. ఈ విధానాన్ని ఉపయోగించడం కోసం ప్రభుత్వం ‘అనుత్పాదక’ వ్యయాలను తగ్గించుకోవాలి. ప్రభుత్వోద్యోగులకు పెంచిన వేతన భత్యాల చెల్లింపును నిలిపివేయడం, కొత్త పార్లమెంటు భవన నిర్మాణాన్ని నిలిపివేయడం మొదలైన చర్యలు చేపట్టాలి. ఈ వ్యయాలు ‘అను త్పాదకాలు’ అని నేను భావిస్తున్నాను. ప్రభుత్వం ఈ వ్యయాలను చేయకపోయినా ఆర్థిక వ్యవస్థ తన గమనాన్ని యథావిధిగా కొనసాగిస్తుంది. పెరిగిన డిఏ (కరువు భత్యం) చెల్లించని పక్షంలో ప్రభుత్వోద్యోగులు మూకుమ్మడిగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేయరు కదా. కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించకపోతే పార్లమెంటు సమావేశాలు ఆగవు కదా. ప్రభుత్వం ఆ వ్యయాలను నిలిపివేసి, ప్రభుత్వ నిధులను ఆదా చేసి ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేయాలి. లేదా చెక్‌డ్యాంలు, ఇతర జలసంరక్షణ పథకాల నిర్మాణానికి వినియోగించాలి. ప్రత్యక్ష నగదు బదిలీ, నిర్మాణాత్మక వ్యయాలతో మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్‌ను పరిపూర్తి చేసేందుకై వడ్డీరేట్లు ఎక్కువగా ఉన్నా కొత్త పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారస్థులు సంసిద్ధమవుతారు. 2014కి పూర్వం వడ్డీరేటు 8 శాతంగా ఉన్నప్పటికీ వ్యాపారస్థులు బ్యాంకురుణాలు తీసుకుని దండిగా పెట్టుబడులు పెట్టారు.


ద్రవ్యవిధానం (ప్రభుత్వ ఆర్థికవిధాన ఆశయాలను సాధించడం కోసం ద్రవ్య సరఫరా, ద్రవ్యవ్యయం–వడ్డీరేటు–పై ఆర్బీఐ అజమాయిషీనే ద్రవ్యవిధానమని స్థూలంగా చెప్పవచ్చు), కోశ విధానాలు సంయుక్తంగా డిమాండ్, మదుపుల చక్రీయాన్ని నెలకొల్పుతాయి. వినియోగం కోసం రుణాలు తీసుకునేందుకు వినియోగదారులను, కొత్త మదుపుల కోసం రుణాలు తీసుకునేందుకు వ్యాపారస్థులను ప్రోత్సహించడం ద్వారా ఆ చక్రీయానికి ద్రవ్యవిధానం దోహదం చేస్తుంది. వినియోగదారుల కొనుగోలు సామర్థ్యాన్ని నేరుగా పెంపొందించడంతో పాటు వ్యాపారస్థులు కొత్త మదుపులు చేసేందుకు సానుకూల పరిస్థితులు సృష్టించడం ద్వారా ఆ చక్రీయానికి కోశ విధానం తోడ్పడుతుంది. 


సరే, కోవిడ్ సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా కన్పించడం లేదు. టీకాల కారణంగా మరణాల రేటు తగ్గుతున్నప్పటికీ మహమ్మారి తీవ్రత పెరుగుతోందే గానీ తగ్గడం లేదు. కరోనా వైరస్ ఉత్పరివర్తనాలు అనిశ్చిత పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కొత్త బైక్ కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపరు. వ్యాపారస్థులు బైక్ ఫ్యాక్టరీని నెలకొల్పే ఆలోచనే చేయరు. ఆర్బీఐ కొనసాగిస్తున్న వడ్డీరేట్ల తగ్గింపు విధానం, కరువుకాటకాల కాలంలో ఒక ట్రాక్టర్ కొనుగోలు కోసం రైతుకు తక్కువ వడ్డీరేటుపై రుణం ఇవ్వజూపినట్లుగా ఉంది! జపాన్ తదితర దేశాలలో వడ్డీలేకుండానే భారీ రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సంసిద్ధంగా ఉన్నప్పటికీ వ్యాపారస్థులు రుణాలు తీసుకోవడం లేదు. మార్కెట్‌లో డిమాండ్ లేకపోవడమే అందుకు కారణమని చెప్పనవసరం లేదు. ప్రస్తుత వడ్డీరేట్ల తగ్గింపు విధానం తప్పక విఫలమవుతుంది. గత ఆరు సంవత్సరాలుగా నిరంతరం వడ్డీరేటు తగ్గిస్తున్నప్పటికీ ప్రయోజనమేమీ కన్పించకపోవడమే ఇందుకు నిదర్శనం. 


అభివృద్ధిని శీఘ్రతరం చేసేందుకు వ్యయాల తగ్గింపు వంటి చర్యలను ప్రభుత్వం తప్పక చేపట్టాలి. ముఖ్యంగా అనుత్పాదక వ్యయాలను తగ్గించి తీరాలి. ప్రభుత్వ వేతన భత్యాల తగ్గుదల మార్కెట్‌లో డిమాండ్ తగ్గుదలకు దారితీయదు. ప్రభుత్వోద్యోగులు సాధారణంగా తమ ఆదాయాన్ని బంగారం కొనుగోలు, ఇతర అనుత్పాదక వ్యయాలకే వెచ్చించడం కద్దు. జలసంరక్షణ కట్టడాల నిర్మాణం మొదలైన ఉత్పాదక వ్యయాలకే ప్రభుత్వ ఆదాయాన్ని ఎక్కువగా వెచ్చించి తీరాలి. అలాగే దిగుమతి చేసుకుంటున్న సరుకులపై సుంకాలు గణనీయంగా పెంచాలి. దీనివల్ల సరుకుల ఉత్పత్తి దేశంలోనే జరుగుతుంది. తద్వారా ఉద్యోగాల సృష్టి కూడ జరుగుతుంది. ప్రజలకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వారి కొనుగోలు సామర్థ్యాన్ని పెంపొందించాలి. ఇది మార్కెట్‌లో డిమాండ్ పెరుగుదలకు దోహదం చేస్తుంది. సామాన్య ప్రజలు వినియోగానికి ఆరాటపడతారు. అయితే డబ్బు లేకపోవడం వారికి పెద్ద అవరోధమవుతుంది. నగదు బదిలీ ద్వారా వారికి డబ్బు సమకూరి కొనుగోలు సామర్థ్యం పెరుగుతుంది. బైక్‌లకు డిమాండ్ పెరిగితే వ్యాపారస్థులు అధిక వడ్డీరేటుపై అయినా సరే రుణాలు తీసుకుని బైక్ ఫ్యాక్టరీని నెలకొల్పుతారు. 


మన వర్తమానం ఒక సంక్షోభ కాలం. కొవిడ్ విలయం ఏ విధంగా పరిణమించనున్నదో మనకు తెలియదు. కనుక ముందు వెనుకలు ఆలోచించకుండా ఆదాయాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయడం శ్రేయస్కరం కాదు. ఈ కష్టకాలాన్ని అధిగమించాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ అనుత్పాదక వ్యయాలను తగ్గించి తీరాలి. పెట్రోలియం ఉత్పత్తులతో సహా అన్నిరకాల సరుకులపై దిగమతి సుంకాలు భారీగా పెంచాలి.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2021-04-13T06:44:43+05:30 IST