వేరుశనగ వర్షార్పణం..!

ABN , First Publish Date - 2021-11-16T02:55:45+05:30 IST

ఆరుగాలం కష్టించి పండించిన పంట వర్షార్పణమైంది.

వేరుశనగ వర్షార్పణం..!
మొలకలొచ్చిన వేరుశనగ కాయలు

మొలకెత్తిన కాయలు

ఉదయగిరి రూరల్‌, నవంబరు 15: ఆరుగాలం కష్టించి పండించిన పంట వర్షార్పణమైంది. పంట దిగుబడి ఇంటికి చేరే సమయంలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఆ రైతు గుండె చెరువైంది. పంట పూర్తిగా దెబ్బతినడంతో పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఏలా తీర్చాలని కర్షకుడు కన్నీటి పర్యాంతమవుతున్నాడు. మండలంలోని జీ.చెరువుపల్లి గ్రామానికి చెందిన నరసింహులు అనే రైతు గత ఖరీఫ్‌ సీజన్‌లో 4.30 ఎకరాల్లో రూ.3.15 లక్షలు ఖర్చు చేసి కదిరి రకం వేరుశనగ పంట సాగు చేశాడు. కోత సమయంలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ముందస్తుగానే కూలీలను పెట్టి పంటను పీకి నూర్పిడికి సిద్ధమయ్యాడు. ఈ తరుణంలో ఎడతెరిపిలేని వర్షం కురవడంతో నూర్పిడి చేయలేక పంట చేలోనే ఉండడం, వర్షాలకు కాయలు మొలకలు రావడంతో ఎందుకు పనికిరాకుండాపోయింది. వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని ఆ రైతన్న చేతులు జోడించి వేడుకొంటున్నాడు. 

వీడని వాన...

తుపాను ప్రభావంతో మెట్ట ప్రాంతమైన ఉదయగిరిలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఆదివారం ఉదయం 8 నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 36.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటల వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈ వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దున్నపోతుల, పిల్లాపరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సీతారామపురం మండలంలోని మర్రివూట రిజర్వాయర్‌ జోరుగా అలుగు పారుతోంది. దీంతో గండిపాళెం జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయ నీటిమట్టం 19.5 అడుగులకు చేరింది. అలాగే మండలంలోని లింగంనేనిపల్లి, నేలటూరు, తిరుమలాపురం తదితర చెరువులకు జలకళ సంతరించుకొని అలుగులు పారుతున్నాయి. పలు గ్రామాల్లో రహదారులు కోతకు గురై రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. 

వరికి తెగుళ్ల బెడద

ఎడతెరిపిలేని వర్షాలు, వాతావరణంలో ఏర్పడ్డ మార్పుల కారణంగా వరి పంటకు తెగుళ్లు విజృంభించాయి. ఉదయగిరి సబ్‌ డివిజన్‌లోని సీతారామపురం, ఉదయగిరి, మర్రిపాడు, వరికుంటపాడు మండలాల్లో గత ఖరీఫ్‌ సీజన్‌లో 1372.5 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో పంట కోత దశలో ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో కంకి దశలో ఉంది. ఈ సమయంలో పంటకు రసం పీల్చేపురుగు, దోమపోటు, ఉల్లికోడు, వైరస్‌ తెగుళ్లు సోకడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రసంపీల్చే పురుగు కారణంగా వరి కంకులు నేలరాలుతున్నాయి. ఈ తెగుళ్ల వల్ల దిగుబడి పూర్తిస్థాయిలో తగ్గి నష్టాలు చవిచూడాల్సి వస్తుందని వాపోతున్నారు. 





Updated Date - 2021-11-16T02:55:45+05:30 IST