జీఎస్‌టీ వసూళ్ల జోరు

ABN , First Publish Date - 2020-07-01T05:30:00+05:30 IST

ఆర్థిక వ్యవస్థ అన్‌లాక్‌తో వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ ) వసూళ్లు గణనీయంగా పెరిగాయి. గతనెలకు జీఎ్‌సటీ ఆదాయం రూ.90,917 కోట్లకు చేరుకుంది.

జీఎస్‌టీ వసూళ్ల జోరు

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ అన్‌లాక్‌తో వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ ) వసూళ్లు గణనీయంగా పెరిగాయి. గతనెలకు జీఎ్‌సటీ ఆదాయం రూ.90,917 కోట్లకు చేరుకుంది. గత ఏడాది జూన్‌తో పోలిస్తే మాత్రం 9 శాతం తగ్గాయి. లాక్‌డౌన్‌ ఆంక్షల కారణం గా మే నెలలో రూ.62,009 కోట్లు, ఏప్రిల్‌లో రూ.32,294 కోట్లకు పరిమితమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (ఏప్రిల్‌-జూన్‌) జీఎ్‌సటీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 59 శాతం తగ్గింది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌, వ్యాపారులకు రిటర్నుల ఫైలింగ్‌, పన్ను చెల్లింపుల గడు వు పొడిగించడం కూడా వసూళ్లపై ప్రభావం చూపింది. అయినప్పటికీ పన్ను వసూళ్లు నెలనెలా మెరుగుపడుతూ వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్‌, ఛత్తీ్‌సగఢ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, అసోంలో జూన్‌ నెల జీఎస్‌టీ  వసూళ్లు వార్షిక ప్రాతిపదికన వృద్ధిని నమోదు చేసుకున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటన పేర్కొంది.  గతనెలకు మొత్తం వసూళ్లలో, సెంట్రల్‌ జీఎస్‌టీ రూ.18,980 కోట్లు, స్టేట్‌ జీఎస్‌టీ  రూ.23,970 కోట్లు, ఇంటిగ్రేడెట్‌ జీఎస్‌టీ  రూ.40,302 కోట్లుగా (దిగుమతి వస్తువులపై వసూలైన రూ.15,709 కోట్లు కలిపి) నమోదయ్యాయి. సుంకం రూపంలో మరో రూ.7,665 కోట్ల ఆదాయం సమకూరింది.  


వ్యాపారుల సమస్యలు పరిష్కరించండి : నిర్మల

దేశీయ వ్యాపారాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ముందుగానే అంచనా వేయాలని, వాటిని పరిష్కరించడంలో చొరవ చూపాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ జీఎస్‌టీ  అధికారులను కోరారు. అప్పుడే దేశీయ వ్యాపారులు అంతర్జాతీయంగా పోటీపడగలరని, స్వావలంబన భారత్‌ను నిర్మించగలరని మంత్రి పేర్కొన్నారు. జీఎ్‌సటీ మూడో వార్షికోత్సవం సందర్భంగా అధికారులకు మంత్రి సందేశం పంపారు. జీఎస్‌టీ  చెల్లింపుదారులు, ఎంఎ్‌సఎంఈలకు నిబంధనలను మరింత సరళీకరించేందుకు అవకాశం ఉందన్నారు. 2017 జూలై 1 నుంచి దేశంలో జీఎస్‌టీ  అమలులోకి వచ్చింది. 


ఎస్‌ఎంఎస్‌ ఆధారిత నిల్‌ ‘జీఎస్‌టీఆర్‌-1’ విడుదల 

జీఎస్‌టీ నెట్‌వర్క్‌ తాజాగా నిల్‌ రిటర్న్‌ ఫారం ‘జీఎస్‌టీఆర్‌-1’ను విడుదల చేసింది. పన్ను బకాయి లేని వ్యాపారులు నెల, త్రైమాసిక విక్రయాల రిటర్నులను ఎస్‌ఎంఎస్‌ ద్వారా ఫైల్‌ చేసేందుకు వీలుగా దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎలాంటి బకాయి లేని వారికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా ‘జీఎస్‌టీఆర్‌-3బీ’ ఫైలింగ్‌ను జీఎస్‌టీఆర్ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. తాజాగా వీరికి పెండింగ్‌ రిటర్నుల ఫైలింగ్‌పై ఆలస్య రుసుమును మాఫీ చేసింది. 


Updated Date - 2020-07-01T05:30:00+05:30 IST