IPL 2022: సాహా సూపర్ ఇన్నింగ్స్.. చిత్తుగా ఓడిన చెన్నై

ABN , First Publish Date - 2022-05-16T00:57:26+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడి వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల

IPL 2022: సాహా సూపర్ ఇన్నింగ్స్.. చిత్తుగా ఓడిన చెన్నై

ముంబై: ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడి వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన గుజరాత్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో గుజరాత్ 20  పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఓడిన చెన్నై ఖాతాలో 9వ పరాజయం వచ్చి చేరింది. 


చెన్నై నిర్దేశించిన 134 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ తొలి ఓవర్ నుంచి బ్యాట్ ఝళిపించింది. వృద్ధిమాన్ సాహా-శుభమన్ గిల్ జోడీ తొలి వికెట్‌కు 59 పరుగులు చేసి సగం పని పూర్తిచేసింది. గిల్ (18) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మాథ్యూ వేడ్(20) క్రీజులో ఎక్కువ సేపు కుదురుకోలేకపోయాడు. అనంతరం వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (7) మరోమారు నిరాశపరిచాడు. అయితే, క్రీజులో పాతుకుపోయిన సాహా చెన్నై బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారాడు. యథేచ్ఛగా షాట్లు కొడుతూ జట్టును విజయం దిశగా నడిపించాడు. డేవిడ్ మిల్లర్ (15) సాయంతో జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. 57 బంతులు ఎదుర్కొన్న సాహా 8 ఫోర్లు, సిక్సర్‌తో 67 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో మథీషా పథిరణకు రెండు వికెట్లు దక్కాయి.


అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై బ్యాట్ ఝళిపించడంలో విఫలమైంది. చేతిలో కావాల్సినన్ని వికెట్లు ఉన్నప్పటికీ పరుగులు రాబట్టడంలో విఫలమైంది. ఫలితంగా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 53 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, మొయిన్ 21, జగదీశన్ 39 పరుగులు చేశారు. 67 పరుగులతో అజేయంగా నిలిచిన జట్టుకు విజయాన్ని అందించిన వృద్ధిమాన్ సాహాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Updated Date - 2022-05-16T00:57:26+05:30 IST