గుండెపగిలిన గుడ్డంపల్లి

ABN , First Publish Date - 2022-07-01T05:57:02+05:30 IST

చిల్లకొండయ్యపల్లి వద్ద విద్యుత ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులందరూ వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు. ఉన్న కాస్త భూమిని సాగు చేసుకుంటూ మిగిలిన సమయాల్లో కూలి పనులకు వెళ్లి పొట్టపోసుకుంటున్నవారే.

గుండెపగిలిన గుడ్డంపల్లి
ఊరంతా శ్మశానవాటిక వద్దే ఉన్న దృశ్యం

ఒకేచోట ఐదుగురు మహిళలకు అంత్యక్రియలు 

ఊరంతా శ్మశానం దగ్గరే 

మిన్నంటిన రోదనలు

మృతులంతా కూలీలు, గొర్రెల కాపరులు


తాడిమర్రి, జూన్‌ 30: చిల్లకొండయ్యపల్లి వద్ద విద్యుత ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులందరూ వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు. ఉన్న కాస్త భూమిని సాగు చేసుకుంటూ మిగిలిన సమయాల్లో కూలి పనులకు వెళ్లి పొట్టపోసుకుంటున్నవారే. ఇంటి యజమానికి చేదోడుగా ఉంటున్న మహిళలు చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.   పిల్లల ఆలన పాలన చూసే మహిళలు మృత్యుఒడికి చేరడంతో ఆ ఐదు కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. 


ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ

 విద్యుత ప్రమాదంలో  మృతి చెందిన కొంకా రామలక్ష్మికి భర్త మల్లికార్జున,  కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. భర్త మల్లికార్జున ఇటీవల  గుండెపోటుకు గురై శస్త్ర చికిత్సలు చేయించుకుని మంచానపడ్డాడు. అయన పూర్తిగా కోలుకునేలోపు రామలక్ష్మి మృత్యువాత పడింది. వీరి పిల్లల ఆలనా పాలన చూసుకునేవారు కరువయ్యారు.

 కొంకారత్నమ్మకు భర్త కిష్టయ్యతో పాటు ఆరోగ్యం సరిగా లేని ఇద్దరు కుమారులున్నారు. కిష్టయ్య పరిస్థితి కూడా సరిగా లేకపోవడంతో  అప్పుడప్పుడు గొర్రెల కాపరిగా కూలి పనులకు వెళ్లివచ్చేవాడు. రత్నమ్మ కూలిపనులకు పోతూ ఇంకో వైపు ఆరోగ్యం సరిగాలేని ఒకకుమారుడు మధు, మతిస్థిమితం లేని మరో కుమారుడు మదనమోహనల ఆలనపాలన చూసేదే. అన్ని తానై కుటుంబాన్ని చూసుకునే ఈమె మృత చెందడంతో ఆ తండ్రి, బిడ్డల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

 లక్ష్మదేవికి భర్త ఈశ్వరయ్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో ఒక కుమార్తెకు వివాహం కాగా, మరో కుమార్తెకు వివాహం చేయాల్సి ఉంది. కుమారుడు  డిగ్రీ చదువుతూ తండ్రికి తోడుగా  అప్పుడప్పుడుగొర్రెల కాపరిగా వెళ్లాడు.

 మల్లయ్య భార్య కొంకా కాంతమ్మ. ఈమెకు భర్తతో పాటు ఇద్దరు కుమారులున్నారు.. భార్యభర్తలు ఇద్దరు కష్టపడి కుమారులిద్దరిని ఉన్నతచదువులు చదివించారు. పెద్ద కుమారుడు సచివాలయంలో ఉద్యోగం సాధించగా చిన్నకుమారుడు బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. 

 ప్రమాదంలో మృతిచెందిన కుమారికి భర్త రాజా,  కుమారుడు(6), కుమార్తె(4) పిల్లలు ఉన్నారు. ఈమె భర్త రాజా మెకానిక్‌ వృత్తిని కొనసాగిస్తున్నారు. సొంత ఊళ్లో ఉన్న వ్యవసాయ పొలంలో పనులు చేయించడం కోసం కూలీలతో వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. లోకం పోకడ తెలియని ఆ చిన్నారులు తల్లి లేని సమాజంలో ఎలా బతుకుతారోనంటూ పలువురు ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. 


Updated Date - 2022-07-01T05:57:02+05:30 IST