వైద్యులేరి?

ABN , First Publish Date - 2020-08-09T09:52:34+05:30 IST

గుడివాడ ఏరియా ఆసుపత్రిలో వైద్యం అందడం గగనమవుతోంది. సిబ్బంది కొరత వేధిస్తోంది.

వైద్యులేరి?

గుడివాడ,  ఆగస్టు 8: గుడివాడ ఏరియా ఆసుపత్రిలో వైద్యం అందడం గగనమవుతోంది. సిబ్బంది కొరత వేధిస్తోంది. రోగులు ప్రయివేటు వైద్యులను ఆశ్రయించాల్సొస్తోంది. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ కూడా నడవకపోవడంతో బాధితులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఏరియా ఆసుపత్రిలో మొత్తం 11 మంది వైద్యులున్నారు. వారిలో ఉన్న ఇద్దరు గైనకాలజిస్టులు కిరణ్మయి, లీనాతో పాటు మరో ఇద్దరు సెలవులో ఉన్నారు. ఇంకో నలుగురు డిప్యూటేషన్‌పై వేరే ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ముగ్గురు వైద్యులు మాత్రమే విధుల్లో ఉంటున్నారు. వీరిలో ఒకరు సూపరింటెండెంట్‌. డాక్టర్లు ఇద్దరేనన ్నమాట.


వీరు సాధారణ జలుబు, జ్వరం కేసులు సైతం రిఫర్‌ చేస్తుండటంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు ఆశ్రయించాల్సి వస్తోంది. గుడివాడ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ట్రూనాట్‌ కొవిడ్‌ టెస్ట్‌ కిట్‌లతో పరీక్షలు చేయడానికి సరైన సిబ్బంది లేకపోవడంతో ఆ పరీక్షలూ నిలిచిపోయాయి. స్వాబ్‌ కలెక్షన్‌ ద్వారా తీసిన 144 శాంపిళ్లకు పరీక్షల ఫలితాలు ఇంకా అందాల్సి ఉంది. ఆసుపత్రిలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు హెచ్‌సీఎల్‌ కంపెనీ రూ.50 లక్షలతో అందించిన ఉపకరణాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. 


 గుడివాడ రైలుపేటకు చెందిన గొడవర్తి ఉమాశంకరి తన రెండో కాన్పుకు గుడివాడ ఏరియా ఆసుపత్రికి శనివారం ఉదయం వచ్చింది. వైద్యులు పరిశీలించి ఇక్కడ గైనకాలజిస్ట్‌లు లేరని బందరు, విజయవాడలకు రిఫర్‌ చేశారు. కొవిడ్‌ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లడానికి భయపడిన ఆమె సాయంత్రం వరకూ ఆసుపత్రి ముందే పడిగాపులు కాస్తోంది. తనను గుడివాడలోనే చేర్చుకోవాలని వేడుకుంటోంది. 


        ఈమె ఒక్కరే కాదు. కాన్పుల కోసం నెల రోజులుగా గుడివాడ ఏరియా ఆసుపత్రికి వచ్చే ప్రతి గర్భిణీ ఆవేదన ఇది.  కారణం వైద్యుల లేమి. ఉన్న ఇద్దరు గైనకాలజి్‌స్టలు సెలవు పెట్టి ప్రైవేటు వైద్యం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే కేసులను అక్కడకు తీసుకుపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిజేరియన్లకు కీలకమైన మత్తు వైద్యుడికి కరోనా సోకడంతో ఆయన అందుబాటులో లేరు. 11 మందికిగాను సూపరింటెండెంట్‌ సహా ముగ్గురే ఉండటం సమస్య తీవ్రతకు నిదర్శనం. సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా స్థానిక మంత్రి కొడాలి నాని పట్టించుకోకపోవడం గమనార్హం.


ఓపీల కోసమే కరోనా వార్డు మూత.. ఎం.వి.నారాయణరెడ్డి, ఛైర్మన్‌, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ

ఓపీ సేవలకు ఇబ్బంది కలుగుతుందనే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ మొదలు పెట్టలేదు. వేరే ప్రాంతంలో వంద పడకలు సిద్ధం చేసి కొవిడ్‌ వైద్య సేవలు ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నాం. గైనకాలజిస్టుల విషయంలో మంత్రి కొడాలి నాని దృష్టికి తీసుకెళ్లాం. 


వైద్యులను నియమించాలి ..ఎస్‌.ఇందిరాదేవి, సూపరింటెండెంట్‌, ఏరియా ఆసుపత్రి, గుడివాడ 

కరోనా భయంతో పరీక్షలు చేయడానికి వైద్యులు ముందుకురావడం లేదు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో సెలవు పెట్టకూడదన్న నిబంధన ఉన్నా  గైనకాలజిస్టులు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఆన్‌లైన్‌లో సెలవు చీటీ పంపారు. కొత్త వైద్యుల నియామకాలు చేయాలని ఉన్నతాధికారులను కోరాం. గర్భిణులకు వైద్య సేవల లోపాలపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. కేవలం ఒక్క వైద్యుడు మాత్రమే కరోనా టెస్ట్‌లు చేస్తున్నారు. రోజుకు యాభై కరోనా పరీక్షలు చేస్తున్నాం.

Updated Date - 2020-08-09T09:52:34+05:30 IST