గుడివాడ గొడవ

ABN , First Publish Date - 2022-01-22T08:39:59+05:30 IST

గుడివాడలో కేసినో వ్యవహారంపై నిజ నిర్ధారణకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ నేతల పర్యటనను భగ్నం చేయడానికి అధికార పార్టీ నేతలు బరితెగించారు.

గుడివాడ గొడవ

  • కేసీనోపై నిజ నిర్ధారణకు టీడీపీ బృందం.. వైసీపీ రాళ్లదాడి
  • కొడాలి కన్వెన్షన్‌లో ముందే వేలాదిగా మోహరింపు
  • రోడ్లపైకి గుంపుగా వచ్చి కొన్నిగంటలపాటు బీభత్సం
  • టీడీపీ కార్యాలయంపైకి రాళ్లవర్షం 
  • బొండా ఉమా కారు ధ్వంసం..ఓ నేతకు తీవ్ర గాయాలు
  • ఇంత జరుగుతున్నా చోద్యంచూసిన పోలీసులు


గుడివాడ, జనవరి 21: గుడివాడలో కేసినో వ్యవహారంపై నిజ నిర్ధారణకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ నేతల పర్యటనను భగ్నం చేయడానికి అధికార పార్టీ నేతలు బరితెగించారు. పోలీసుల తీరు కూడా కలిసిరావడంతో చెలరేగిపోయారు. నిజ నిర్ధారణ కోసం శుక్రవారం గుడివాడ వచ్చిన టీడీపీ నాయకులే లక్ష్యంగా దౌర్జన్యకాండకు మంత్రి కొడాలి నాని అనుచరులు, వైసీపీ నాయకులు తెగబడ్డారు. గుడివాడను తమ గుప్పిట్లోకి తెచ్చుకుని ఎక్కడికక్కడ టీడీపీ కార్యకర్తలు, నాయకులపై భౌతిక దాడులు చేస్తూ.. రాళ్ల వర్షం కురిపించారు.


దాదాపు రెండు వేలమంది ఒకేసారి రోడ్లపైకి రావడంతో కొన్నిగంటలపాటు అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితి! నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టి ఏకపక్షంగా, యథేచ్ఛగా కొన్నిగంటలపాటు సాగిన ఈ దాడిలో టీడీపీ నేత బొండా ఉమా కారు ధ్వంసం కాగా, ఓ టీడీపీ నాయకుడు తీవ్రంగా గాయపడ్డారు. కొవిడ్‌ రూల్స్‌ చెప్పి టీడీపీ నేతల కదలికలను పోలీసులు బాగా నియంత్రించారు. చివరకు అరెస్టు కూడా చేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. అదే సమయంలో కేసినో అడ్డా అయిన కే కన్వెన్షన్‌లో గుమిగూడిన వేలాదిమందిపైగానీ, దాడికి సిద్ధమై రోడ్లపైకి వచ్చిన వైసీపీ నేతలనుగానీ ఎక్కడా అడ్డుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అసలేం జరిగిందంటే.. సంక్రాంతి పండగ రోజుల్లో మంత్రి కొనాలి నానికి చెందిన గుడివాడ కే కన్వెన్షన్‌లో కేబిరే డ్యాన్సులు, కేసినో పేకాట క్లబ్బులు నడిచిన వ్యవహారం, దానికి సంబంధించి బయటపడిన వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీనిపై నిజ నిర్ధారణ కోసం ఒక కమిటీని టీడీపీ ఏర్పాటుచేసింది. కే కన్వెన్షన్‌ ప్రాంగణాన్ని సందర్శించడానికి శుక్రవారం ఈ బృందం గుడివాడ చేరుకుంది. ఇదే సమయానికి కే కన్వెన్షన్‌ ప్రాంగణానికి వైసీపీ కార్యకర్తలు రెండువేల మంది చేరుకున్నారు. దీంతో గుడివాడలో ఒక్కసారిగా హైటెన్షన్‌ వాతావరణం నెలకుంది. 


మచిలీపట్నం పార్టమెంటరీ పార్టీ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ నేతృత్వంలో నిజనిర్ధారణ బృంద సభ్యులు వర్ల రామయ్య, మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు, తంగిరాల సౌమ్య, కాగిత కృష్ణప్రసాద్‌, వర్ల కుమార్‌రాజా, తెలుగు మహిళ నాయకురాలు ఆచంట సునీత తదితరులు తొలుత గుడివాడ టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. స్థానిక ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి కేసినో వివరాలు సేకరించారు. అనంతరం ఎన్టీఆర్‌ స్టేడియం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేయడానికి కార్యాలయం నుంచి బయటకు రావడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే పోలీసులు వారిని చుట్టుముట్టారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా ప్రదర్శనలను అనుమతించడం లేదని అడ్డుకున్నారు. దీనిపై పోలీసులకు వారు తమ అభ్యంతరం తెలియజేశారు. గుడివాడలో బైక్‌ ర్యాలీ నిర్వహించడానికి, కే కన్వెన్షన్‌లో వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడానికి అనుమతులు ఎలా ఇచ్చారని నిలదీశారు. ఇదే సమయంలో వైసీపీ రాష్ట్ర నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్‌ నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు ఎన్టీఆర్‌ స్టేడియం రహదారిలో మొహరించారు. అంతకుముందు వారంతా బైక్‌ర్యాలీ నిర్వహించారు. నాగవరప్పాడు వంతెన వద్ద, ముగ్గు బజారుల్లో టీడీపీ నిజ నిర్ధారణ బృందానికి వ్యతిరేకంగా భారీగా బైఠాయించారు.


ఇంతమంది అధికార పార్టీ కార్యకర్తలు అంత పెద్దఎత్తున మోహరిస్తున్నా పోలీసులు మిన్నకుండిపోయారు. ఆ సమయంలో కొవిడ్‌ నిబంధనలు వారికి గుర్తుకు రాలేదు. అదే సమయంలో అడుగు బయటపెట్టడానికి ప్రయత్నించిన నిజ నిర్ధారణ నేతలను మాత్రం టీడీపీ కార్యాలయం ఎదుటే అరెస్ట్‌ చేసి డీసీఎం వ్యాన్‌, బస్సుల్లో ఎక్కించుకుని పామర్రు పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఇంతలో వైసీపీ నాయకులు టీడీపీ కార్యాలయం వెనుకకు చేరుకుని అక్కడున్న దేశం కార్యకర్తలపై రాళ్లవర్షం కురిపించారు. అక్కడే నిలిపి ఉన్న బొండా ఉమామహేశ్వరరావు కారు అద్దాలను ధ్వంసం చేశారు. పోలీ్‌సస్టేషన్‌లో ఉంచిన నాయకులను పరామర్శించి వస్తున్న తెలుగురైతు మచిలీపట్నంఉపాధ్యక్షుడు ముళ్లపూడి రమేశ్‌ చౌదరిని గాయపరిచారు. 


సిగ్గు..సిగ్గు : నిజ నిర్ధారణ బృందం ఫైర్‌

కేసినోలు, జూదాలు నిర్వహించడం ద్వారా మంత్రి కొడాలి నాని సమాజానికి ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో చెప్పాలని కొనకళ్ల నారాయణ మండిపడ్డారు. తెలుగు సంప్రదాయాలను మట్టికలిపిన గుడివాడ ఘటనకు సీఎం జగన్‌ బాధ్యత వహించాలని కొల్లు రవీంద్ర డిమాండ్‌ చేశారు.  ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తామన్నా కూడా.. భయపడే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందనడానికి గుడివాడ సంఘటనలే నిదర్శనమని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు  మండిపడ్డారు. టీడీపీ నిజనిర్ధారణ బృందాన్ని అడ్డుకోవడం పోలీసుల చేతకానితనానికి నిదర్శనమని బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. డీజీపీ రాష్ట్రం కోసం ఉన్నారా లేక వైసీపీ కోసం ఉన్నారా అనేది గౌతమ్‌సవాంగ్‌ స్పష్టం చేయాలని వర్ల రామయ్య మండిపడ్డారు. కాసినోల వైపు కన్నెత్తి చూడని పోలీసులు నిజనిర్ధారణకు వచ్చిన తమను అడ్డుకోవడం సిగ్గుచేటని తంగిరాల సౌమ్య ఆగ్రహించారు. 


ఎస్పీ సారథ్యంలో దర్యాప్తు: డీఐజీ

గుడివాడ ఘటనలపై కృష్ణాజిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ సారథ్యంలో దర్యాప్తు జరుపుతామని ఏలూరు రేంజి డీఐజీ కేవీ మోహనరావు వెల్లడించారు. ఆరుగురు సభ్యులతో కూడిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అనుమతించగా.. వందలాదిగా తరలిరావడం ఏమిటన్నారు. దీని వెనుక కుట్ర కోణం దాగి ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు నిర్వహిస్తామని తెలిపారు. రెండు పార్టీల పట్ల పోలీసులు సమానంగా వ్యవహరించారని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారు ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామన్నారు. తమకు అందిన ఫిర్యాదుల మేరకు చట్టప్రకారం విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ చెప్పారు. 

Updated Date - 2022-01-22T08:39:59+05:30 IST