కుంభమేళా భక్తులకు మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2021-01-25T00:39:09+05:30 IST

ఉత్తరాఖండ్‌లో జరిగే కుంభమేళా నిర్వహణకు మార్గదర్శకాలు

కుంభమేళా భక్తులకు మార్గదర్శకాలు

హరిద్వార్ : ఉత్తరాఖండ్‌లో జరిగే కుంభమేళా నిర్వహణకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. హరిద్వార్‌లో 48 రోజులపాటు జరిగే కుంభమేళాకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలాఖరులో విడుదల చేస్తుంది. దీనిలో పాల్గొనాలనుకునే భక్తులు ముందుగా ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి. భక్తులు తమ స్వరాష్ట్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం/జిల్లా ఆసుపత్రి/వైద్య కళాశాల నుంచి మెడికల్ సర్టిఫికేట్‌ను పొందాలి. 


ఉత్తరాఖండ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మదన్ కౌశిక్ మాట్లాడుతూ, గతంలో కుంభ మేళాను మూడున్నర నెలలపాటు నిర్వహించేవారమని, ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో 48 రోజులకు కుదించామని చెప్పారు. భక్తులు కోవిడ్-19 నిరోధక మార్గదర్శకాలను పాటించాలని చెప్పారు. భక్తులు ముందుగా ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలని, తమ స్వరాష్ట్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం/జిల్లా ఆసుపత్రి/వైద్య కళాశాల నుంచి మెడికల్ సర్టిఫికేట్‌ను పొందాలని తెలిపారు. 


నిధుల మంజూరు, ప్రత్యేక రైళ్లు

కుంభమేళాకు ఏర్పాట్లు ప్రారంభం కాలేదని అఖిల భారతీయ అఖాడా పరిషత్ ఆరోపించిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ వివిధ ప్రాజెక్టులకు నిధులను మంజూరు చేశారు. హరిద్వార్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. వివిధ మార్గాల్లో హరిద్వార్ చేరుకునేందుకు రైళ్ళను ఏర్పాటు చేశారు. హౌరా-డెహ్రాడూన్-హౌరా వయా హరిద్వార్, హౌరా-యోగనగరి హృషీకేశ్-హౌరా, పాట్నా-కోట-పాట్నా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతారు. 


కట్టుదిట్టమైన భద్రత

భక్తుల భద్రత కోసం 40 కంపెనీల పారామిలిటరీ దళాలను మోహరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సశస్త్ర సీమాబల్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్), ఐటీబీపీ, బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్ దళాలు భద్రత కల్పిస్తాయి. ఎన్ఎస్‌జీ కమాండోలు, జాగిలాలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్, యాంటీ సెబొటేజ్ స్నైపర్ డాగ్స్ అణువణువూ పరిశీలిస్తాయి. 


Updated Date - 2021-01-25T00:39:09+05:30 IST