మధురైలో మార్గదర్శక న్యాయం

ABN , First Publish Date - 2022-03-16T05:49:49+05:30 IST

తమిళనాడులో యువ దళిత ఇంజనీరింగ్ విద్యార్థి గోకుల్‌రాజ్ హత్య కేసులో దోషులుగా నిర్ధారితమైన పది మందికి యావజ్జీవ శిక్ష విధించారు. మధురైలోని ఒక ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 8న ఆ నేరస్థులకు...

మధురైలో మార్గదర్శక న్యాయం

తమిళనాడులో యువ దళిత ఇంజనీరింగ్ విద్యార్థి గోకుల్‌రాజ్ హత్య కేసులో దోషులుగా నిర్ధారితమైన పది మందికి యావజ్జీవ శిక్ష విధించారు. మధురైలోని ఒక ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 8న ఆ నేరస్థులకు జీవిత శిక్షను ఖరారు చేసింది. 2015లో హత్యకు గురైన గోకుల్‌రాజ్ కేసులో మౌఖిక వాదనలకు అదనంగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ లిఖితపూర్వక వాంగ్మూలాన్ని సమర్పించారు. ఈ వాంగ్మూలం చదవడానికి ఒక క్రైమ్ థిల్లర్‌గా ఉంది. అయితే నేరం ఎంత భయానకమైనదంటే ‘థ్రిల్లర్’ అనే పదం స్థానంలో ‘హర్రర్’ అనే మాటనే విధిగా వాడి తీరాలి. 


ప్రాసిక్యూటర్ వాదనలకు సంబంధించి మూడు ముఖ్య అంశాలు: నేర చర్యకు ప్రేరణ లేదా హత్య వెనుక ఉద్దేశం. నిందితులు, హతుడు పరస్పరం అపరిచితులు. కుల పవిత్రత (బ్లడ్ ప్యూరిటీ)ని విశ్వసించే కులోన్మాద మనస్తత్వం నుంచి మొదలైన కుట్ర ఫలితమే గోకుల్‌రాజ్ హత్య. స్థానిక పోలీసులు తొలుత గోకుల్‌రాజ్ హత్య ఘటనను ఆత్మహత్యగా పరిగణించారు. అయితే ఎస్సీ–ఎస్టీ చట్టం–1989 (షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల వారిపై దురాగతాల నిరోధక చట్టం–1989) కింద ఆ కేసును నమోదు చేయడం వారికి అనివార్యమయింది. గోకుల్‌రాజ్ భౌతిక కాయానికి పోస్ట్‌మోర్టమ్ (శవ పరీక్ష) నిర్వహించాలని డిమాండ్ చేస్తూ స్థానిక అడ్వొకేట్ ఒకరు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రసిద్ధ పౌరహక్కుల న్యాయవాది శంకర్ సుబ్బు పిటిషనర్ తరఫున వాదించారు. పోస్ట్‌మోర్టమ్ నివేదిక నేర తీవ్రతను నిర్దారించింది. ఆత్మహత్య అనే వాదన నిరాధారమైనదని స్పష్టం చేసింది. గోకుల్‌రాజ్ జేబులో లభించిన ఒక ‘నోట్’ ఆధారంగా అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అభిప్రాయపడడం సమర్థనీయంకాదని హైకోర్టు స్పష్టం చేసింది.


కులాంతర వివాహాలు చేసుకున్న యువతీ–యుకులు హత్యకు గురికావడం మన సమాజంలో తరచు సంభవిస్తోంది. అయితే ఈ కేసులో దళిత యువకుడు ఒకరు ఒక అగ్రకుల (గౌండర్) యువతితో మాట్లాడినందుకు హత్యకు గురయ్యాడు! అంతేకాదు, హతుడు, అతడి స్నేహితురాలు హంతకులకు వ్యక్తిగతంగా అపరిచితులు. అయితే వారికి ఆ యువతి కుటుంబం బంధు మిత్రులు, కుల సంఘాల ద్వారా తెలిసి వుండవచ్చు. ఆ యువతి తనకు సాధ్యమైనంతవరకు కేసు దర్యాప్తునకు సహకరించింది. వివాహం, మాతృత్వం కారణంగా కుటుంబ బాధ్యతలకు పరిమితమవ్వాల్సిన అగత్యం ఆమెకు ఏర్పడింది. కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో ప్రతికూల సాక్షిగా ఆమె మారిపోయింది. వాస్తవమేమిటంటే గోకుల్‌రాజ్‌ను ఒక కుల సంఘంవారు హత్య చేశారు. వారిలో పలువురు ‘ధీరన్ చిన్నామలై పెరవాయి’ అనే కుల సంఘం సభ్యులు. ఈ కుల సంఘమే ప్రముఖ రచయిత పెరుమాల్ మురుగన్ నవల ‘మధోరు భాగన్’పై కోర్టుకు వెళ్లింది.


ఎస్సీ–ఎస్టీ చట్టం–1989 కింద ప్రాసిక్యూషన్‌కు గోకుల్‌రాజ్ కేసు ఒక ప్రామాణిక కేసు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిబి మోహన్ ఆ చట్టంతో పనిచేసిన తీరు న్యాయశాస్త్రంలో నేర్చుకోవల్సిన ఒక పాఠం. నేర ఉద్దేశం కుల చరిత్ర, సామాజిక చింతనారీతులు లేదా వర్ణ వ్యవస్థ నిర్దేశాలు నిత్య జీవితంలో అమలవుతున్న తీరుతెన్నులతో ముడివడి ఉన్నదే కాని చెప్పుకోదగిన నేరాలతో గానీ లేదా తక్షణ, స్థానిక కుల శత్రుత్వాలతో ప్రమేయమున్నది కాదని ప్రాసిక్యూటర్ మోహన్ పేర్కొన్నారు. ఈ కారణంగా నేర స్వభావానికి అనుగుణంగా అదనపు సాక్ష్యాధారాలను సమర్పించవలసిన అవసరమున్నదని తెలిపారు. ప్రధాన నిందితుడు, హత్యకు సూత్రధారి అయిన యువరాజ్ కుల పవిత్రత భావజాలంలో ప్రగాఢ విశ్వాసి అని మోహన్ అన్నారు. గౌండర్ మహిళల గౌరవాన్ని దళితుడైన గోకుల్‌రాజ్ కళంకపరుస్తున్నాడని ప్రధాన నిందితుడు అభిప్రాయపడ్డాడు. ఈ కారణంగా ఆ దళిత యువకుడిని హత్య చేసేందుకు యువరాజ్ పూనుకున్నాడని, తద్వారా తన ‘కుల పవిత్రత’ విశ్వాసాలను అమల్లో పెట్టాడని ప్రాసిక్యూటర్ వాదించాడు. 


ప్రాసిక్యూషన్ తరఫు సాక్షుల (క్రిమినల్ కేసులలో పోలీసు వారి తరఫున సాక్ష్యం ఇచ్చేవారు)లో అత్యధికులు ప్రతికూలంగా మారడంతో ప్రాసంగిక సాక్ష్యాలపై ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆధారపడవలసి వచ్చింది. పోస్ట్ మోర్టమ్ నివేదిక, సిసిటీవీ ఫూటేజీ, సెల్‌ఫోన్ సంభాషణలు మొదలైన సాక్ష్యాలపై ఆయన ఆధారపడ్డారు. గోకుల్‌రాజ్ హత్యకు కుట్ర జరిగిందని నిరూపించడానికి కూడా ఆయన ప్రయత్నించారు. కుల సంబంధిత నేరాల విషయంలో వివిధ నిర్దిష్ట సందర్భాలలో ఉద్దేశపూర్వకంగా హత్యా చర్యలకు పాల్పడిన వైనాలను ఆయన ప్రస్తావించారు. ఒక వ్యవసాయ క్షేత్రంపై హక్కులు తనకే ఉన్నాయనో లేక ఒక అగ్రకులస్తుడు తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనో రచ్చకెక్కిన దళిత మహిళను హత్య చేయడం; స్థానిక ప్రాబల్య కులాలవారు దళితుల గృహాలకు నిప్పుపెట్టడం, వారి భూములను దురాక్రమించుకోవడం మొదలైన సందర్భాలలో ఉద్దేశపూర్వకంగా వ్యవహరించడమనేది కుట్రపూరితంగా జరగడం సాధారణమని ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. గమనార్హమైన విషయమమేమిటంటే యువరాజ్, అతడి తోటి నిందితులు ఆవేశపూరిత కుల మనస్తత్వంతోనే ఉద్దేశపూర్వకంగా గోకుల్‌రాజ్ హత్యకు పాల్పడ్డారని నిరూపించేందుకు ఆ నేర చర్యకు కుట్ర జరిగిందని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఏమిటి దీనర్థం? హత్య జరిగింది. అయితే ఆ హత్య ఏదో ఒక నిర్దిష్ట లక్ష్య పరిపూర్తికి కాకుండా అస్పృశ్యతను, కుల పవిత్రతను సమర్థించేందుకే జరిగిందని ఆయన గట్టిగా అభిప్రాయపడ్డారు. ఈ దృష్ట్యా గోకుల్‌రాజ్ హత్య ఒక విలువల వ్యవస్థను కాపాడేందుకు జరిగిందని, కనుక దాన్ని అడ్డూ అదుపులేని కులతత్వ చర్యగాను, రాజ్యాంగ అధికరణ 17 (అంటరానితనం నిషేధం), అధికరణ 14 ( చట్టం ముందు అందరూ సమానులే), అధికరణ 15 (కుల, మత, జెండర్ వివక్షలకు తావులేదు) ఉల్లంఘనగాను చూడాలని ప్రాసిక్యూటర్ వాదించారు.


గోకుల్‌రాజ్ హత్యకు ప్రేరణ కుల పవిత్రత విశ్వాసాల నుంచి పొందడం జరిగిందని నిరూపించేందుకు కుట్ర భావనను ఉపయోగించుకోవడంలో ఆ భావనను సంప్రదాయకంగా ఉపయోగించుకునే పద్ధతులను ప్రాసిక్యూటర్ పెకలించివేశారు. ప్రభుత్వాన్ని కూలద్రోసేందుకు లేదా పాలనా వ్యవస్థలో అస్థిరత్వం పాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని తమ వ్యతిరేకులు, ప్రత్యర్థులపై పాలకులు అభియోగాలు మోపడం పరిపాటి కదా. రాజ్యం సాధారణంగా అనుసరించే ఆ పద్ధతికికి భిన్నంగా, నిర్దిష్టంగాను, నిర్ణాయకంగాను ప్రాసిక్యూటర్ మోహన్ దాన్ని ప్రతిభావంతంగా ఉపయోగించుకుని గోకుల్‌రాజ్ హత్య చాలా జాగ్రత్తగా, ఉద్దేశపూర్వకంగా అమలుపరచిన రాజ్యంగ విరుద్ధ వివక్షాపూరిత చర్య, హింసాత్మక కిరాతకమని విన్నవించారు. 


ప్రత్యేక న్యాయస్థానం వెలువరించిన తీర్పు ప్రాసిక్యూటర్ మోహన్ వాదించిన తీరు తెన్నులను పూర్తిగా ప్రతిబింబించింది. గోకుల్‌రాజ్ హత్యకు కుట్ర జరిగిందన్న అభియోగానికి వ్యతిరేకంగా ముద్దాయిల తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించేందుకు తీర్పు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆ వాదనలలో అత్యధిక భాగం కేస్ లా (న్యాయ దృష్టాంతాలు) ఆధారితంగా చేసినవేనని పేర్కొంటూ గోకుల్‌రాజ్ కేసును పౌరుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అపాయంలో పడిన మిగతా కేసులతో పోల్చడానికి వీలులేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. గోకుల్‌రాజ్ హత్య కుల వ్యవస్థను యథాతథంగా కాపాడేందుకు జరిగిన రాజ్యాంగ విరుద్ధ చర్య అని తీర్పు స్పష్టం చేసింది.

వి.గీత

వ్యాసకర్త చెన్నైకు చెందిన స్త్రీ వాద చరిత్రకారిణి, ప్రచురణ కర్త

Updated Date - 2022-03-16T05:49:49+05:30 IST