ltrScrptTheme3

Navratri: ‘గర్బా’ ఈవెంట్లకు గుజరాత్ గ్రీన్ సిగ్నల్

Sep 25 2021 @ 07:41AM

అహ్మదాబాద్ (గుజరాత్): కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వచ్చే నెలలో 9రోజులపాటు జరగనున్న నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హౌసింగ్ సొసైటీలు, వీధుల్లో గర్బా ఈవెంట్లకు గుజరాత్ రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా గుజరాత్ రాష్ట్రంలోని 8 నగరాల్లో అమలులో ఉన్న కర్ఫ్యూను గంటపాటు సడలించింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 400మంది ఒకచోట గుమిగూడేందుకు సర్కారు అనుమతించింది. నవరాత్రి ఈవెంట్లలో పాల్గొనేవారికి కరోనావైరస్ నుంచి పూర్తి రక్షణ కోసం టీకాలు తీసుకోవడం అత్యవసరం అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని నవరాత్రి కార్యక్రమాల నిర్వహణను నిషేధించింది.

ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధ్యక్షతన హోం శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, జామ్‌నగర్, భావ్‌నగర్, జునాగడ్, గాంధీనగర్ అనే ఎనిమిది నగరాల్లో రాత్రి కర్ఫ్యూ సమయాన్ని సడలించాలని నిర్ణయించారు. ఇంతకు ముందు కర్ఫ్యూ వ్యవధి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉండేది, కానీ ఇప్పుడు ఈ ఎనిమిది నగరాల్లో అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.


కొత్త రాత్రి కర్ఫ్యూ సమయం సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 10 వరకు అమలులో ఉంటుందని సర్కారు తెలిపింది.అయితే క్లబ్ లలో వాణిజ్య గర్బా నృత్య కార్యక్రమాలను అనుమతించరాదని సర్కారు నిర్ణయించింది.దుర్గా పూజ, విజయదశమి, శరద్ పూర్ణిమ పండుగలను 400మంది పరిమితితో నిర్వహించుకునేందుకు సర్కారు అనుమతించింది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.