మోదీపై గుజరాత్ పత్రిక విమర్శలు.. నెట్టింట్లో హల్‌చల్

ABN , First Publish Date - 2021-05-09T22:06:31+05:30 IST

ఇప్పుడు ఇదే విషయమై నెటిజెన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ‘గుజరాత్ సమాచార్’ అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ఇండియా ట్రెండింగ్‌లో ఉంది. కొంత మంది గుజరాత్ సమాచార్ బాగా ప్రశ్నించిందని ప్రశంసలు కురిపిస్తుండగా, మరికొందరు

మోదీపై గుజరాత్ పత్రిక విమర్శలు.. నెట్టింట్లో హల్‌చల్

న్యూఢిల్లీ: దేశం కరోనా గుప్పిట్లో కకావికలం అవుతుంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రం 22 వేల కోట్ల రూపాయల సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నారంటూ గుజరాత్‌లో ఎక్కువ ప్రజాదరణ ఉన్న ‘గుజరాత్ సమాచార్’ అనే పత్రిక తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. గుజరాత్ సమాచార్ పత్రిక ఆదివారం నాటి సంచిక మొదటి పేజీలో ఈ విషయమై ఓ ప్రధాన కథనం రాసుకొచ్చింది. ఢిల్లీలోని ఇండియాగేట్ సమీపంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులకు సంబంధించిన ఫొటోలను ప్రచురించి ‘‘పీఎం రూ.22,000 కోట్ల సెంట్రల్ విస్టా ప్రజెక్టులో బిజీ’’ అనే శీర్షికతో వెలువడిని కథనం ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపివేస్తుంది. ఈ కథనాన్ని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి కూడా షేర్ చేయడం గమనార్హం.


‘‘కరోనా మహమ్మారి వల్ల ప్రజలు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ప్రజా సేవకుడు నియంతలా మారిపోతున్నాడు’’ అనే అర్థంలో కథనాన్ని రాసుకొచ్చారు. ఈ వార్తా కథనాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన బీజేపీ ఎంసీ సుబ్రమణ్యస్వామి ‘‘గుజరాత్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన పత్రిక మోదీపై దాడి చేయడం ఆసక్తికరం’’ అంటూ రాసుకొచ్చారు. అయితే సుబ్రమణ్యస్వామి ట్వీట్‌పై ఓ నెటిజెన్ స్పందిస్తూ ‘‘సర్ 2014లో మోదీని ప్రధానిగా ప్రమోట్ చేసినందుకు చింతిస్తున్నారా?’’ అని ప్రశ్నించగా.. ‘‘నేను ఇప్పటికీ ఆయనకు వ్యతిరేకంగా లేను. ఆయన అభ్యర్థన మేరకే 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో, 2014 వారణాసిలో ప్రచారానికి వెళ్లాను. చాలా మంది ప్రధానులతో వ్యవహరించాను. మోదీతో కూడా వ్యవహరించాను. అయితే మోదీ నా మాట వింటారని అనుకుంటాను. కానీ ఆయన వినడం లేదని ప్రజల వద్దకు వెళ్తున్నాను’’ అని సుబ్రమణ్యస్వామి ప్రతిస్పందించారు.


ఇప్పుడు ఇదే విషయమై నెటిజెన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ‘గుజరాత్ సమాచార్’ అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ఇండియా ట్రెండింగ్‌లో ఉంది. కొంత మంది గుజరాత్ సమాచార్ బాగా ప్రశ్నించిందని ప్రశంసలు కురిపిస్తుండగా, మరికొందరు గత 20 ఏళ్లుగా బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పత్రికలో ఇలాంటి కథనం రావడం ఆశ్చర్యమేమీ కాదని విమర్శలు గుప్పిస్తున్నారు.









Updated Date - 2021-05-09T22:06:31+05:30 IST