Arvind Kejriwal: దళిత పారిశుద్ధ్య కార్మికుడిని ఇంటికి పిలిచి కేజ్రీవాల్ విందు.. అటువైపు నుంచి నరుక్కొస్తున్న బీజేపీ!

ABN , First Publish Date - 2022-09-26T23:41:11+05:30 IST

అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal).. నిజం చెప్పాలంటే ఆయనో ట్రెండ్ సెట్టర్. సామాన్యుడు కూడా సీఎం గద్దెను

Arvind Kejriwal: దళిత పారిశుద్ధ్య కార్మికుడిని ఇంటికి పిలిచి కేజ్రీవాల్ విందు.. అటువైపు నుంచి నరుక్కొస్తున్న బీజేపీ!

న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal).. నిజం చెప్పాలంటే ఆయనో ట్రెండ్ సెట్టర్. సామాన్యుడు కూడా సీఎం గద్దెను ఎక్కగలడని నిరూపించిన అతి సామాన్యుడు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (AAP) పేరుతో పార్టీ స్థాపించి సామాన్యుల్లో అభిమానాన్ని చూరగొన్న కేజ్రీవాల్ పాలన మరీ అంత తీసి పారేసినట్టు లేకపోవడం ప్రజల్లో ఆయనపై క్రేజ్ పెరగడానికి కారణమైంది. ప్రజలకు ఏది అవసరమో దానిని పక్కన పెట్టిన మిగతా పార్టీలు అలవిగాని హామీలతో ప్రజలను మెస్మరైజ్ చేస్తున్న వేళ.. అత్యంత ఆవశ్యకమైన విద్య, వైద్యంపై దృష్టిసారించి ప్రజల మనసులు చూరగొన్న నాయకుడు కేజ్రీవాల్. ఢిల్లీలో జెండా పాతి అక్కడ కుదురుకున్నాక పక్క రాష్ట్రాలకూ విస్తరిస్తున్న కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల పంజాబ్‌లో సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతాకాదు. గోవాలో కాలుమోపేందుకు ప్రయత్నించి విఫలమైనప్పటికీ నిరాశ చెందని కేజ్రీవాల్ ఇప్పుడు గుజరాత్‌ను చేజిక్కించుకోవడంపై దృష్టిసారించారు. 


దళితుల ఓట్లపై గురి..

ఈ ఏడాది డిసెంబరులో అక్కడ ఎన్నికలు జరగనున్న వేళ ఇప్పటికే గుజరాత్‌లో ప్రచారాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్ అక్కడ పాతుకుపోయిన బీజేపీ (BJP)ని గద్దెదింపాలని కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని దళితులను ఆకట్టుకునే పనిలో పడ్డారు. దళితులను మచ్చిక చేసుకోవడం ద్వారా ఓట్ షేర్‌ను పెంచుకోవాలని యోచిస్తున్నారు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన టౌన్‌హాల్ సమావేశంలో ఓ పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబాన్ని ఢిల్లీలో తన ఇంటికి భోజనానికి రావాల్సిందిగా ఆహ్వానించి కేజ్రీవాల్ మరోమారు అందరి దృష్టిని ఆకర్షించారు. దళిత వర్గాలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులతో కేజ్రీవాల్ నిర్వహిస్తున్న టౌన్‌హాల్ సమావేశంలో పాల్గొన్న హర్ష్ సోలంకి (Harsh Solanki) మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ఇటీవల అహ్మదాబాద్‌లోని టౌన్‌హాల్ సమావేశంలో  ఆటోరిక్షా డ్రైవర్ నుంచి విందు ఆహ్వానాన్ని స్వీకరించడం తాను చూశానని గుర్తు చేసుకున్నాడు. మరి ఆయన తన ఇంటికి కూడా భోజనానికి వస్తారా? అని ప్రశ్నించాడు. కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఈసారి అహ్మదాబాద్ వచ్చినప్పుడు తాను భోజనానికి ఇంటికి వస్తానని సోలంకికి చెప్పిన కేజ్రీవాల్ అంతకంటే ముందే ఢిల్లీలో తన ఇంటికి భోజనానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. 


వారిదంతా షో

కేజ్రీవాల్ ఆహ్వానంతో హర్ష్ సోలంకి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ నేత కూడా ఇలాంటి పనిచేయలేదని ప్రశంసించాడు. ‘‘మిమ్మల్ని చూస్తుంటే మా కోసం ఒకరు ఉన్నారన్న ఆశ కలుగుతోంది సర్’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అందుకు కేజ్రీవాల్ స్పందిస్తూ.. చాలామంది నేతలు దళిత ఇంటికి భోజనానికి వెళ్లి షో చేయడాన్ని తాను చూశానని, ఇప్పటి వరకు ఒక్క నాయకుడు కూడా దళితుడిని తన ఇంటికి భోజనానికి పిలవలేదని అన్నారు. మీరు కనుక మా ఇంటికి వస్తే అందరం కలిసి భోజనం చేద్దామని అన్నారు. అందుకు సోలంకి అంగీకరించాడు. దీంతో ఎంతమంది వస్తారన్న ప్రశ్నకు.. తాను తన సోదరుడు, సోదరి, తల్లిదండ్రులతో ఉంటున్నట్టు చెప్పాడు. దీంతో కల్పించుకున్న కేజ్రీవాల్ తాను ఐదుగురికి విమాన టికెట్లు పంపిస్తానని చెప్పారు.


సోలంకి కుటుంబానికి సాదర స్వాగతం

సోమవారం ఢిల్లీ ముఖ్యమంత్రి ఇంట్లో మీరు, మీ కుటుంబ సబ్యులతో కలిసి భోజనం చేద్దామని, ఈసారి అహ్మదాబాద్ వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తానని కేజ్రీవాల్ చెప్పడంతో సోలంకి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఈ సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ.. ఢిల్లీ వచ్చే సోలంకి కుటుంబానికి పంజాబ్ భవన్‌లో ఆతిథ్యం ఇస్తామన్నారు. అలాగే, టౌన్‌హాల్ సమీపంలో దళిత విద్యార్థులు నిర్వహిస్తున్న లైబ్రరీకి పేరు పెట్టాలన్న ఆహ్వానానికి కూడా కేజ్రీవాల్ అంగీకారం తెలిపారు. అనుకున్నట్టే సోమవారం తన ఇంటికి భోజనానికి వచ్చిన సోలంకి కుటుంబానికి కేజ్రీవాల్ సాదర స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. అంతకుముందు సోలంకి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కేజ్రీవాల్ ఆయనను ఓదార్చి కుటుంబానికి జ్ఞాపిక అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


అంబేద్కర్ అడుగుజాడల్లో..

గుజరాత్ గత పర్యటనలో కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి అహ్మదాబాద్‌లో టౌన్‌హాల్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుజరాత్‌లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, సమాన పనికి సమావేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు, బీజేపీ, కాంగ్రెస్‌లపైనా విమర్శల దాడికి దిగారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఫొటోలు ఉంటాయని, బీజేపీ కార్యాలయాల్లో ప్రధాని మోదీ ఫొటోలు ఉంటాయని అన్నారు. కానీ, ఆప్ నేతల కార్యాలయాల్లో కేజ్రీవాల్, భగవంత్ మాన్ ఫొటోలు కనిపించవని, అంబేద్కర్ ఫొటోలు మాత్రమే ఉంటాయని అన్నారు. తమ పార్టీ మాత్రమే అంబేద్కర్ మార్గంలో నడుస్తోందని, గత 75 ఏళ్లలో అంబేద్కర్ కల సాకారం కాలేదని అన్నారు. దానిని తాను నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నట్టు చెప్పారు. కేజ్రీవాల్ అంబేద్కర్ ప్రస్తావన తీసుకురావడం ఇదే తొలిసారి కాదు. పంజాబ్ ఎన్నికలకు ముందు కూడా కేజ్రీవాల్.. అంబేద్కర్ జపం చేశారు. ఓటు వేసేముందు అంబేద్కర్‌ను గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. 


రైతులకు గాలం వేస్తున్న బీజేపీ

ఆమ్ ఆద్మీ పార్టీ బహుజనులకు గాలం వేస్తుంటే బీజేపీ మరో దారిలో వెళ్తోంది. సాగు చట్టాలను తీసుకొచ్చి రైతులకు ఎంతోకొంత దూరమైన బీజేపీ ఇప్పుడు వారిని దగ్గరికి తీసుకునే పనిలో పడింది. రైతుల ఆగ్రహంతో వెనక్కి తగ్గి సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోదీ క్షమాపణలు చెప్పి చట్టాలను వెనక్కి తీసుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో నష్టనివారణ చర్యలు ప్రారంభించిన కాషాయ పార్టీ.. రైతుల కరుణాకటాక్షాల కోసం ఎదురుచూస్తోంది. నేటి నుంచి రెండు రోజులపాటు గుజరాత్‌లో పర్యటించనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit shah).. అహ్మదాబాద్‌లో రైతుల కాన్ఫరెన్స్ సహా పలు కార్యక్రమాల్లో పాలుపంచుకోనున్నారు.  


అలాగే, అహ్మదాబాద్ జిల్లా సనంద్‌లో ఆసుపత్రి నిర్మాణానికి, అహ్మదాబాద్‌లో సరస్సు సుందరీకరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. అహ్మదాబాద్‌ జిల్లాలోని బావ్లాలో రైతుల కాన్ఫరెన్స్‌కు హాజరవుతారు. ఎస్పీ రింగ్ రోడ్డుమీది ఓవర్ బిడ్జ్‌ను, సనంద్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రా, అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అమిత్ షా పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన రైతులు ‘రిన్ స్వీకార్ సమ్మేళన్‘ (కృతజ్ఞతా అంగీకార సభ) నిర్వహిస్తున్నారు. 164 గ్రామాలకు నీటి పారుదల వసతి కల్పించినందుకు గాను ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ 164 గ్రామాలకు నీటి పారుదల సౌకర్యం కోసం  రైతులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అమిత్ షా జోక్యంతో ఇన్నాళ్లకు ఇది పరిష్కారం కావడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. 



Updated Date - 2022-09-26T23:41:11+05:30 IST