త్రిశంకు సత్యాలు, గరళ కంఠాలు!

ABN , First Publish Date - 2022-06-30T06:33:04+05:30 IST

విష్ణువు కానివాడు రాజు కాలేడు- అన్న వారే రాజుగారికి చివరాఖరికి నరకం తప్పదు అనికూడా అన్నారు.

త్రిశంకు సత్యాలు, గరళ కంఠాలు!

విష్ణువు కానివాడు రాజు కాలేడు- అన్న వారే రాజుగారికి చివరాఖరికి నరకం తప్పదు అనికూడా అన్నారు. తన అహంకారంతోనో దుర్మార్గంతోనో చేసే అఘాయిత్యాలు మాత్రమే కాదు, పాలకుడు తన పాలనను కొనసాగించే సుస్థిరపరచే క్రమంలో చేసే పనులు కూడా అనివార్యంగా పాపాలూ నేరాలూ అయి ఉంటాయి. కౌటిల్యుని అర్థశాస్త్రం చదివితే, రాజనీతి పేరిట చరిత్రలో ఎటువంటి కుతంత్రాలకు, ఘోరాలకు ఆమోదం ఉండేదో తెలుస్తుంది. ప్రస్తుత ఆదర్శాలను గతానికి కూడా అన్వయించి రాజధర్మం ఉదాత్తమైనదని, నిష్పాక్షికమైనదని అనుకుంటుంటాము. ఇరవైఏళ్ళ కిందట గుజరాత్‌లో జరిగిన హింసాకాండ సందర్భంగా, అప్పటి ప్రధాన మంత్రి రాజధర్మం గురించి నరేంద్ర మోదీకి హితవు చెప్పారు.


చేసిన తప్పులకు కుమిలిపోయే రాజులను చరిత్రలో పెద్దగా చదవము. దుర్భిక్షం వల్ల సంభవించిన మానవీయ విషాదాలను ఆపలేకపోయానని బాధపడి రాజ్యం వదిలి పెట్టి వెళ్లాడని మౌర్య చంద్రగుప్తుని గురించి చెబుతారు. అతని మనవడే అయిన అశోకుడు యుద్ధంలో తనవల్ల కలిగిన ప్రాణనష్టానికి పశ్చాత్తాపం పొంది బౌద్ధం స్వీకరించాడని చదివాము. జరగబోయే బీభత్సాన్ని ముందే ఊహించి, ఆప్తులను కూడా చంపవలసి వస్తుందని సంకోచించి అర్జునుడు యుద్ధానికి వెనుకాడి, తగిన కౌన్సిలింగ్ తరువాత విషాద యోగాన్ని విరమించుకుంటాడు. పార్థుడికి లభించిన ఉపదేశం ప్రాచీన క్షాత్ర ధర్మాన్నే కాక, ఆధునిక రాజధర్మాన్ని కూడా నడిపిస్తున్నది.


గుజరాత్ హింసాకాండలో తన ప్రమేయం ఉన్నదని ఆరోపణలు రావడం, రెండు దశాబ్దాలు గడచినా, తానూ ప్రధానమంత్రి స్థానానికి ఎదిగినా ఇంకా కోర్టు వ్యాజ్యాలు రావడం, కొనసాగడం నరేంద్రమోదీని కలత పరచిందని, గరళకంఠుని మాదిరిగా ఇంతటి చెడుని ఆయన భరిస్తూ వచ్చారని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మోదీ మీద కేసుని తిరగదోడాలని కోరిన గుజరాత్ హింస హతుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు ఎహసాన్ జాఫ్రి భార్య వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిరాకరించినప్పుడు షా స్పందన అది. మోదీ ఇంతటి వేదనని మౌనంగా భరిస్తున్నారని ఇంతకాలం ఎవ్వరికీ స్ఫురించనే లేదు. ఇప్పుడు కూడా ఆయన బయటపడలేదు కానీ, అమిత్ షా ఆపుకోలేకపోయారు. దేశానికి, మోదీ కంఠ గరళం గురించి వెల్లడి చేయడమే కాకుండా, తీవ్రమైన ఆవేదనతో కేసులో సహ వ్యాజ్యందారు అయిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్ నిర్బంధానికి అనుమతించారు. పరిపాలనా ధర్మం కఠినమైనది మరి. తప్పలేదు.


అయినా మోదీ మీద నిందలు వేసేవారు సంఘ సేవకులు ఎట్లా అవుతారు? ఆమె దగ్గర వందల కోట్ల ఆస్తి ఉన్నది కదా, అది చాలక మోదీని అంతం చేయడానికి సుపారీ తీసుకున్నదని కదా వాట్సాప్ కార్యకర్తలు చెబుతున్నది!


అసలు ఒక ఉత్పాతం జరిగినప్పుడు, ఒక ప్రకృతి వైపరీత్యమో సామాజిక ఉపద్రవమో ఎదురైనప్పుడు దాన్ని నిరోధించడంలో, నియంత్రించడంలో పాలకుల బాధ్యత ఎంత? ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తిని ఇంకా తప్పు పడుతూనే ఉన్నాము. మరి, నీరో వంటి నిర్లక్ష్యం కాక, జరిగిన కల్లోలంలో పాలకుడికే ప్రమేయం ఉన్నదేమో అన్న అభిప్రాయం ఏర్పడినప్పుడో? ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు, హంతకులు సిక్కు మతానికి చెందినవారు కాబట్టి, ఢిల్లీలోను ఇతర చోట్లా ఆ మతస్థుల మీద దారుణమైన దాడులు జరిగాయి. ప్రజలలో, ప్రతీకార న్యాయ స్పందనలు ఆ పద్ధతిలో ఉండడం సమాజం నాగరికతా స్థాయిని తెలియజేస్తాయి. గాంధీజీ హత్య జరిగినప్పుడు, హంతకుడు ముస్లిం కానందుకు ఆనాటి ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నదట. కొన్ని సందర్భాలలో ప్రజలలో తక్షణ స్పందన కింద ప్రతీకార చర్యలు మొదలు కావచ్చు. అటువంటి చర్యలను పాలకులు తలచుకుంటే అదుపు చేయగలరు. పైగా, పాలకులు సమర్థులనుకున్నప్పుడు వారు అదుపు చేయలేని హింస ఉంటుందా? అదుపు చేయాలనే ఉద్దేశమే పాలకులకు లేదని, పైగా అగ్నికి ఆజ్యం అందించారని ఆధారాలు దొరికితే? 1984 ఢిల్లీ హింసకు సంబంధించి అటువంటి వాచ్య ఆధారాలు ఉన్నాయి. మహా వృక్షం కూలినప్పుడు చుట్టుపక్కల ప్రకంపనలు సహజమని సాక్షాత్తూ రాజీవ్ గాంధీ అన్న మాటల వాస్తవ అర్థం ఎవరు గ్రహించలేదు? ఇందిర భౌతిక కాయానికి శ్రద్ధాంజలుల ప్రత్యక్ష ప్రసారంలో ప్రతీకార నినాదాలను అనుమతించడం యాదృచ్ఛికమా? కానీ, ఢిల్లీ హింస మీద జరిగిన విచారణల్లో ఈ ప్రత్యక్ష ప్రోత్సాహాల మీద దృష్టి పెట్టారా?


రాజ్యం మీద ప్రజల నుంచి కానీ, ప్రజలలోని ఒక వర్గం నుంచి కానీ, ఏదైనా మిలిటెంట్, నాన్ మిలిటెంట్ సంస్థల నుంచి కానీ దాడి జరిగినప్పుడు, అధికార వర్గం నుంచి ఉండవలసిన స్పందన గురించి కొన్ని ఆనవాయితీలు ఉన్నాయి. ఒక రాజ్యం మీద మరొకరు ఆక్రమణ చేసినప్పుడు ప్రజలను లొంగదీసుకోవడానికి అనుసరించే పద్ధతులకు కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. ఒక పాలకుడు మరణించినప్పుడు వారసత్వంలో సమస్యలు రాకుండా ఉండడానికి ప్రజలలో కల్లోలాన్ని అనుమతించిన సందర్భాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య యుగంలో కూడా ప్రభుత్వాలు, పాలకులు స్వయంగా కల్లోలాలను సృష్టించి తమకు అనుకూలమైన ఫలితాలను రాబట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ను 1984లో అక్రమంగా గద్దెదించిన కాలంలో, ఒక పక్క అసెంబ్లీ జరుగుతుండగా మరోపక్క మతకలహాలు చెలరేగాయి. చెన్నారెడ్డిని దించాలని ఆయన పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నప్పుడు అందుకు అనుగుణంగా 1990లో హైదరాబాద్‌లో నెత్తురు పారింది. ఆయా సందర్భాలలో ఆరోపణలు ఎదుర్కొన్న వారు, తరువాత రాజకీయాలలో కొనసాగారు, పాలకులూ అయ్యారు. అయ్యో, మమ్మల్ని నిందించారే అని మనసు కష్టపెట్టుకోలేదు. ఆధారాలూ కేసులూ అక్కరలేకుండానే జనానికి ఎవరు ఏమి చేయగలరో ఏమి చేశారో ఒక అంచనా ఉంటుంది.


గోధ్రాలో కరసేవకుల రైలు బోగీ దగ్ధం అయిన తరువాత, ప్రజలలో ఆగ్రహావేశాలు వెంటనే ఉవ్వెత్తున లేవలేదు. ఆ షాక్ సమాజాన్ని స్తంభింప చేసింది. ఆ సంఘటన తరువాత ప్రభుత్వ యంత్రాంగం తీరు ప్రజాగ్రహాన్ని నిరోధించడానికి కాక, ప్రజ్వలింప జేయడానికి ఉపకరించిందని, హింసాకాండ ప్రారంభ దశలో ఉద్దేశపూర్వకంగానే ఉదాసీనంగా వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. ఇందులో వాస్తవాలను తెలుసుకోవడానికి రానా అయ్యూబ్ అనే జర్నలిస్ట్ సుదీర్ఘమైన స్టింగ్ ఆపరేషన్ చేశారు. అందులోని అంశాలన్నిటినీ ఆమె పనిచేసిన మీడియా సంస్థ వెల్లడి చేయడానికి అనుమతించలేదు. ‘గుజరాత్ ఫైల్స్’ పేరుతో ఆమె ప్రచురించిన పుస్తకంలో అనేక తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. హింస మొదలైన తరువాత, వెంటనే గట్టిగా కల్పించుకోవలసిన అవసరం లేదన్నట్టుగా ప్రభుత్వం నుంచి సందేశం వెళ్లినట్టు ప్రచారంలో ఉన్న ఆరోపణలకు పూర్తి ఆధారాలు బయటపడలేదు. కానీ, ఆనాటి పరిణామాలు అటువంటి అభిప్రాయాన్ని బలపరిచేట్టే ఉన్నాయి. లేకపోతే, నాటి ప్రధాని రాజధర్మం గురించి ఎందుకు మాట్లాడతారు?- అన్నది ఆసక్తికరమైన ప్రశ్న.


ప్రజల మీద జరిగిన నేరాలకు, దారుణాలకు బాధ్యులను గుర్తించడం ప్రజా రంగంలో పనిచేసేవారి కర్తవ్యం కాబట్టి, అనివార్యంగా కేసులు విచారణలు జరుగుతాయి కానీ, ఇందులో కేవలం వ్యక్తిగతమైన బాధ్యతలు మాత్రమే ఉండవు. కానీ, ఒక పెద్ద వెల్లువలో జరిగిన నేరాలకు కూడా దోషులను వ్యక్తిగతంగానే గుర్తించవలసి ఉంటుంది. ఒక్కోసారి, సాంకేతిక ఆధారాలు కాక, జరిగిన నేరాల ప్రయోజనం ఎవరికి సిద్ధించింది అన్న నిర్ధారణ ద్వారా కూడా దోషులెవరో తెలుస్తుంది.


ఆశ్చర్యం ఏమిటంటే, బహిరంగంగా నేరాపాదనను నిరాకరించేవారు, ఆ నేరానికి తానే కర్తను అని లోకం గుర్తించాలని కూడా కోరుకుంటారు. పోలీసులు ఎన్‌కౌంటర్లను కప్పిపుచ్చుకోవడానికి ఏదో కట్టు కథ చెప్పినప్పటికీ, తాము యథేచ్ఛగా కాల్చివేశామని జనం గుర్తించాలనే అనుకుంటారు. ఇక్కడ వాస్తవం రెండంచెలలో ఉంటుంది. ఒకటి బహిరంగ కథనంలో, మరొకటి వాస్తవ కథనంలో. అట్లాగే, ఢిల్లీ హత్యాకాండ అయినా, గుజరాత్ హింసాకాండ అయినా బహిరంగ కథనం వేరు, వాస్తవ కథనం వేరు.


అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వంలోని ఇతరులు కానీ, తమ ఉదాసీనతతో లేదా అసమర్థతతో లేదా సంకల్పితంగా ఎన్ని మరణాలకు కారకులయ్యారు అన్నది ఒక ప్రశ్న. బహిరంగ, వాస్తవ కథనాలలో ఒకదానినే నమ్మారా, లేదా రెంటిని జనం విశ్వసించారా అన్నది మరొక ప్రశ్న. గుజరాత్‌లో హింసాకాండ వాంఛనీయమే, ఆవశ్యకమే అన్న మనోగతం ఉన్నవారు, నాటి గుజరాత్ ప్రభుత్వాన్ని మనసులో మెచ్చుకున్నారు. అది ఒక బాహాటపు అంగీకారం కావడానికి కొద్దికాలంలోనే గుజరాత్ అభివృద్ధి నమూనా అన్న ఆలంబన దొరికింది. దేశంలో క్రమంగా బలపడుతూ వచ్చిన భావ వాతావరణంలో జనం కోరుకుంటున్న, కఠినమైన సమర్థుడైన నాయకుడు మోదీలో ఆవిష్కృతం అయ్యాడు.


గుజరాత్‌లో జరిగినదానికి మోదీ బాధ్యత లేదని సుప్రీంకోర్టు భావించినప్పుడు, ఇక దానికి అప్పీల్ లేదు. కానీ, గుజరాత్ పరిణామాల లబ్ధిదారులు మోదీ, షా లే అని చరిత్రక్రమం చెబుతోంది. 2014కు 2002 దారులు వేసింది. పార్టీ అగ్రనాయకత్వాన్ని అంతటిని అధిగమించి అధినాయకుడయ్యే క్రమంలో గుజరాత్ నమూనా పాత్ర ఉన్నది. ఉన్నత న్యాయస్థానం భావించినట్టు మోదీ వాస్తవంగా అమాయకుడు అయి ఉండవచ్చు కానీ జన మనోగతంలో కాదు. కంటికి కన్ను తీయగలిగే యోధుడిగా కొందరికి ఆయన ఆరాధ్యుడు. మరికొందరి దృష్టిలో ఆయనే హింసాకాండకు ప్రేరేపకుడు, వ్యూహకర్త.

తీస్తా సెతల్వాద్‌కు సంబంధించిన తక్కిన విషయాలు పక్కన పెడితే సర్వశక్తి సంపన్నులైన ప్రభుత్వాధినేతల మీద కూడా న్యాయ పోరాటం చేయగలిగే ధైర్యసాహసాలు ప్రజాస్వామ్యానికి విలువైనవి. తమ పార్టీకి చెందిన మాజీ ఎంపీ గుజరాత్ హింసలో దారుణ హత్యకు గురి అయినా అతని విషయంలో న్యాయ పోరాటానికి కాంగ్రెస్ సిద్ధంగా లేని సమయంలో ఆయన భార్యకు అండగా నిలిచి సుప్రీంకోర్టును ఆశ్రయించింది తీస్తా. ఆమె మీద ప్రతీకార చర్యలు అవసరమా?


కె. శ్రీనివాస్

Updated Date - 2022-06-30T06:33:04+05:30 IST