Gujarat riots: గరళకంఠుడిలా 19 ఏళ్ల పాటు Modi బాధను భరించాను: Amit Sha

ABN , First Publish Date - 2022-06-25T18:31:56+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధను తాను దగ్గరుండి మరీ చూశానని, శివుడు తన గొంతులో గరళాన్ని నింపుకొన్నట్టుగా..

Gujarat riots: గరళకంఠుడిలా 19 ఏళ్ల పాటు Modi బాధను భరించాను: Amit Sha

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధను తాను దగ్గరుండి మరీ చూశానని, శివుడు తన గొంతులో గరళాన్ని నింపుకొన్నట్టుగా మోదీ 19 ఏళ్లపాటు వేదనను అనుభవించారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. 2002 గుజరాత్ అల్లర్ల కేసులో అప్పటి సీఎంగా ఉన్న మోదీ‌పై ఎలాంటి ఆధారాలు లేవంటూ సిట్ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సుప్రీంకోర్టు తాజాగా సమర్ధించింది. దీనిపై తొలిసారి మోదీ ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.


''మోదీ తనపై వచ్చిన ఆరోపణలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. శివుడు తన గొంతులో విషాన్ని నింపుకొన్నట్టుగా భరిస్తూ వచ్చారు. ఇదంతా నేను దగ్గరుండి మరీ చూశాను. న్యాయస్థానం పరిధిలో కేసు ఉండటంతో ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎంతో దృఢ సంకల్పం ఉన్నవాళ్లకు మాత్రమే అలా మౌనంగా ఉండటం సాధ్యమవుతుంది'' అని మోదీని అమిత్‌షా ప్రశంసించారు. గుజరాత్ అల్లర్లపై మోదీపై కావాలనే కొందరు విమర్శలు చేశారని, ఆ ఆరోపణల నుంచి ఆయన బయటపడటం, ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడం శుభపరిణామని అమిత్‌షా అన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరిగిందన్నారు. ఈ కేసు బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసినా ఇప్పుడదంతా తొలగిపోయిందని చెప్పారు.


గుజరాత్‌ ప్రభుత్వ పరంగా చూసినప్పుడు కూడా అప్పటి మోదీ ప్రభుత్వం ఎలాంటి జాప్యం చేయలేదని, గుజరాత్ బంద్‌కు పిలుపు ఇచ్చిన రోజున మధ్యాహ్నానికి మధ్యాహ్నమే ఆర్మీని పిలిపించిందని, ఆర్మీ వచ్చేసరికి కొంత సమయం పట్టిందని అమిత్‌షా చెప్పారు. ఆర్మీ సైతం ఒక్కరోజు కూడా ఆలస్యం చేయలేదని, కోర్టు కూడా అభినందించిందని తెలిపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నామని, గిల్ సాహెబ్ (పంజాబ్ మాజీ డీజీపీ, దివంగత కేపీఎస్ గిల్) సైతం తన జీవితంలో ఎన్నడూ ఇలాంటి తటస్థ, సరైన సమయంలో తీసుకున్న చర్యను చూడలేదని ప్రశంసించారని అన్నారు. గోద్రా బర్నింగ్ విక్టిమ్స్‌తో ఎలాంటి పరేడ్ జరగలేదని, అదంతా అబద్ధమని షా చెప్పారు. బాధితులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, మృతదేహాలను అంబులెన్స్‌లలో వారి కుటుంబాలకు చేర్చామని తెలిపారు.

Updated Date - 2022-06-25T18:31:56+05:30 IST