Gujarat: కాంగ్రెస్‌కు గట్టిదెబ్బ.. బీజేపీలోకి ఇద్దరు రాష్ట్ర నేతలు..?

ABN , First Publish Date - 2022-08-03T21:03:19+05:30 IST

ఈ ఏడాది ద్వితీయార్థంలో గుజరాత్ అసెంబ్లీ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ..

Gujarat: కాంగ్రెస్‌కు గట్టిదెబ్బ.. బీజేపీలోకి ఇద్దరు రాష్ట్ర నేతలు..?

గాంధీనగర్: ఈ ఏడాది ద్వితీయార్థంలో గుజరాత్ అసెంబ్లీ జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ నాయకత్వంతో అసంతృప్తితో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి పనులు తమకెంతో నచ్చాయని, వచ్చేనెలలో బీజేపీలో చేరుతామని తెలిపారు.


మెహ్‌సనా జిల్లా విజపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ హోం శాఖ మంత్రి నరేష్ రావల్ తన రాజీనామా నిర్ణయాన్ని తెలియజేస్తూ, పార్టీతో అనేక విషయాల్లో తనకు అభిప్రాయభేదాలున్నాయని, అయితే ఆ అంశాలు ఇప్పుడు ప్రస్తావించాలనుకోవడం లేదని చెప్పారు. అయితే, పార్టీకి 'జైహింద్' (గుడ్‌బై) చెప్పాలనుకుంటున్నట్టు తెలిపారు. త్వరలోనే బీజేపీలో చేరుతానని, ఆ పార్టీ నాయకత్వం ఏ పని అప్పగించినా పనిచేయడానికి సిద్ధమేనని చెప్పారు.


కాంగ్రెస్ మరోనేత, రాజ్యసభ మాజీ ఎంపీ రాజు పర్మర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతో తనకు 35 ఏళ్లుగా అనుబంధం ఉందని, పార్టీపై ఎలాంటి ఫిర్యాదులు చేయదలచుకోలేదని అన్నారు. అయితే, పార్టీ నాయకత్వం కొత్త వారికి ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టిందని, పార్టీ నుంచి ఎలాంటి పదవులు, ఫేవర్స్ ఆశించనప్పటికీ పార్టీకి సేవలందించే అవకాశం తనకు ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. మరింత మంది సీనియర్ నేతలు కూడా త్వరలో పార్టీని వీడనున్నట్టు ఆయన చెప్పారు.


పార్టీ చాలనే అవకాశాలిచ్చింది..

కాగా, పార్టీకి నరేష్ రావల్, రాజు పర్మర్ రాజీనామా ప్రకటనలపై కాంగ్రెస్ సీనియర్ నేత అర్జున్ మోద్వాడియా మాట్లాడూతూ, ఇద్దరు నేతలకు పార్టీ చాలనే అవకాశాలు ఇచ్చిందని చెప్పారు. నరేష్ రావల్‌కు రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చిందని, కొద్దికాలం అసెంబ్లీలో విపక్ష నేతగా పనిచేశారని అన్నారు. ఐదుసార్లు అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెట్టగా మూడుసార్లు ఆయన గెలిచారని అన్నారు. రాజు పర్మర్‌ను సైతం పార్టీ మూడుసార్లు రాజ్యసభకు పంపిందని, షెడ్యూల్డ్ కులాల కమిషన్‌కు చైర్మన్‌ను చేసిందని అన్నారు. వారికేమైనా ఇబ్బందులు ఉంటే పార్టీతో మాట్లాడి పరిష్కరించుకోవాలని, ఇలా పార్టీని వీడటం వల్ల పార్టీ ఇమేజ్‌‌పై ప్రభావం చూపడంతో పాటు పార్టీ వ్యతిరేక ఆలోచనకు తావిస్తుందని అన్నారు.

Updated Date - 2022-08-03T21:03:19+05:30 IST