Advertisement

‘గులాబీ’ల గురివెంద సుద్దులు!

Oct 20 2020 @ 03:37AM

దుబ్బాక ఉపఎన్నికల ఫలితం తెలంగాణ దిక్సూచి కాబోతున్నది. అక్కడ బీజేపీ గెలిస్తే అసెంబ్లీలో కేసీఆర్‌కు చుక్కలు కనిపిస్తాయి. రఘునందన్‌రావు లాంటి విద్యావంతుడు, వాదనాపటిమ గల నాయకుడు గెలిచి శాసనసభలో అడుగుపెడితే ప్రభుత్వం రోజూ ఆత్మహత్య చేసుకోవలసిందే. అందుకే టీఆర్‌ఎస్‌ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.


ఆంధ్రజ్యోతిలో ఈ నెల 17 తేదీన వేలేటి రోజాశర్మ ‘పడగ విప్పిన పురుషాహంకారం’ పేరుతో రాసిన వ్యాసంపై తప్పనిసరి పరిస్థితులలో స్పందించవలసి వస్తోంది. దివంగత సోలిపేట రామలింగారెడ్డి భార్య దుబ్బాక ఉపఎన్నికల్లో తెరా‍స అభ్యర్థిగా పోటీ చేస్తుంటే ఆమెను స్త్రీ అని కూడా చూడకుండా అవమానిస్తున్నామంటూ రోజాశర్మ ఆరోపించారు. ఇక ఓటమి ఖాయం అని శకునాలు కన్పించగానే టీఆర్‌ఎస్‌ పార్టీ వాళ్లకు ఆస్తిత్వాలు గుర్తొస్తున్నాయి. అందుకే సరికొత్త ‘బాధితురాలి పాచిక’ విసురుతున్నారు. మొదటి దఫా ప్రభుత్వంలో ఒక్కరు కూడా మహిళా మంత్రి లేకుండా పురుషాహంకారంతో పాలన సాగించినప్పుడు స్త్రీమూర్తుల మాట మర్చిపోయారా? హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ‘దిశ’ అత్యాచారం ఘోరాతిఘోరంగా జరిగినప్పుడు ఈ గులాబీ ముఖాలు ఎందుకు వాడిపోయాయి?


వాళ్లకు అవసరం వస్తే సభావివాహం, వామపక్ష ఉద్యమాలు గొప్పవవుతాయి. లేదంటే మా మీద హిందుత్వవాదులనే నిష్ఠురముద్ర వేస్తారు. వరకట్న దురాచారంపై ఉద్యమించి రైతుకూలీలు, బీడీకార్మిక ఉద్యమాల్లో సుజాత గొప్ప పాత్ర పోషించారని చెప్తున్నవాళ్లు గతంలో జరిగిన ఎన్నికల్లో రామలింగారెడ్డికి బదులు ఆమెనే ఎందుకు పోటీకి నిలబెట్ట లేదు? దీన్ని ఎవరి పురుషహంకారంగా చూడాలి? సుజాతకు ఎంతో కొంత రాజకీయ పరిజ్ఞానం ఉందని చెబుతున్న వ్యాసకర్త ఇటీవల హరీశ్‌రావు పక్కన నిలబడి చెప్తుంటే ఆమె అవే మాటల్ని అప్పచెప్పడాన్ని ప్రజలందరూ చూశారు. 


భర్తను కోల్పోయిన దుఃఖంలో ఉన్న సుజాతకు హరీశ్‌రావు ఉపఎన్నికల సందర్భంగా సహకారం అందిస్తున్నారని రోజాశర్మ పేర్కొన్నారు. అయితే 2016లో పాలేరులో రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మరణించినప్పుడు అక్కడ ఆయన భార్య ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ, కేసీఆర్‌ తన పాత మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావును పోటీకి నిలబెట్టి గెలిపించారు. ఆ సమయంలో వెంకటరెడ్డి భార్య కూడా మహిళేననే విషయం మరచిపోయారా? అదే విధంగా 2014లో నారాయణఖేడ్‌లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన పట్లోళ్ల కిష్టారెడ్డి మరణించడంతో జరిగిన ఉపఎన్నికల సందర్భంగా గులాబీ వారి స్త్రీవాదం ఏమైపోయింది?


తెలంగాణ కోసం తన కుటుంబం గురించి కూడా ఏమాత్రం ఆలోచించకుండా ప్రాణాలర్పించిన కాసోజు శ్రీకాంతాచారి విశ్వబ్రాహ్మణుడు, బిసి కులస్థుడు. అతడి మాతృమూర్తి కాసోజు శంకరమ్మను కదిపితే కేసీఆర్‌కు, గులాబీ పార్టీకి మహిళలపై ఉన్న గౌరవమేమిటో బట్టబయలవుతుంది. ఆమె లాంటి వారితో మాట్లాడితే గులాబీల గురివెందనీతిపై పెద్ద పుస్తకమే రాయొచ్చు. తన కుమార్తె కవిత ఓడిపోయి ఒక సంవత్సరం పాటు ఇంట్లో ఖాళీగా ఉంటేనే తట్టుకోలేకపోయిన కేసీఆర్‌ వెంటనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారు. మరి, ఈ రాష్ట్రంలో డిఎస్సీ లేక ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్‌ రాక లక్షలాది మంది యువతులు తమ జీవితాలను భారంగా ఈడుస్తున్న సంగతి గులాబీ నేతలకు తెలియదా, పట్టదా? రాష్ట్రంలో రోజుకొక చోట అత్యాచారం జరుగుతున్నా ఏనాడైనా ఒక్క బాధితురాలిని గానీ, ఆమె కుటుంబాన్ని గానీ కేసీఆర్ వెళ్లి పరామర్శించారా? దిశ అత్యాచారం జరిగినప్పుడు రాష్ట్రమంతా ఆగ్రహజ్వాలలు, ఆవేదన పెల్లుబికినప్పటికీ ఆ కుటుంబాన్ని ఓదార్చకుండా ఇతర రాష్ట్రాల్లో రిసెప్షన్‌లకు వెళ్లిన ముఖ్యమంత్రిని ఈ స్త్రీవాద నాయకులు ఏనాడైనా నిలదీసి ప్రశ్నించారా? 


కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఏ సర్టిఫికెట్‌ లేదని ఆరోపించిన రోజాశర్మ ఒక్కసారి ఆమె పార్లమెంటులో చేసిన ప్రసంగాలు వినడం మంచిది. రోజాశర్మ పేర్కొనట్లు గానే రాజ్యంగంలో ఎక్కడా విద్యార్హతలు గురించి చెప్పలేదు. అయినా కానీ, స్మృతి ఇరానీ పరిజ్ఞానాన్ని సర్టిఫికేట్‌లతో కొలవగలరా? ఆమె కేంద్ర మానవవనరుల మంత్రిగా ఉండగా హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా శవరాజకీయాలు చేయడం కోసం నిధలు సమకూర్చింది గులాబీ పార్టీ పెద్దక్క కాదా? సర్టిఫికెట్‌ లేదంటూ అందరూ ఎద్దేవా చేసిన స్మృతి ఇరానీ, ఆ తర్వాత పార్లమెంట్‌లో, కుహన లౌకికవాద పార్టీలను చీల్చి చెండాడినప్పుడు వెనుక వరుసలో కూర్చున్న గులాబీ పురుషపుంగవులను అడిగితే ఆమె ఎంత గొప్పగా మాట్లాడారో చెబుతారు. ఇతర పార్టీల నేతలు దుర్మార్గులని, పురుషాహంకారులని ఆరోపిస్తున్న రోజాశర్మ టీఆర్‌ఎస్‌ మిత్రపక్షనాయకుడు చాదర్‌ఘాట్‌లో ఓ దళిత బాలికపై అత్యాచారం చేసినప్పుడు ఇదే రీతిలో ఆవేదనగా స్పందించి రాసి ఉంటే బాగుండేది. టీఆర్‌ఎస్‌ నాయకులు మాత్రమే విజ్ఞులని, సంస్కారవంతులని ప్రబోధించే ఆ పార్టీ చేదు వాస్తవాన్ని దిగమింగక తప్పని పరిస్థితి ఎదురుకాబోతోంది. అందువల్లే ఆ పార్టీ నేతలకు ఇప్పుడు గురివెంద సామెతలన్నీ గుర్తొస్తున్నాయి. వసూళ్ల గురించి వాళ్లు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుంది. ఇక ప్రాయశ్చితం, పశ్చాత్తాపం లాంటి పడికట్టు పదాలకు ఇప్పడు కాలం చెల్లింది. తలనరుక్కోవడం, ముక్కు భూమికి రాయడం గురించి ప్రస్తావిస్తే, టీఆర్‌ఎస్‌ నాయకులు చేసిన తప్పులన్నిటికీ ప్రాయశ్చితంగా ఆ పనులు చేయడానికి ఎన్ని తలలైనా సరిపోవు.


ఇప్పుడు దుబ్బాక ఉపఎన్నికల ఫలితం తెలంగాణ దిక్సూచి కాబోతున్నది. అక్కడ బీజేపీ గెలిస్తే అసెంబ్లీలో కేసీఆర్‌కు చుక్కలు కనిపిస్తాయి. రఘునందన్‌రావు లాంటి విద్యావంతుడు, వాదనాపటిమ గల నాయకుడు గెలిచి శాసనసభలో అడుగుపెడితే ప్రభుత్వం రోజూ ఆత్మహత్య చేసుకోవలసిందే. అందుకే టీఆర్‌ఎస్‌ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ గెలిచినా మళ్లీ టీఆర్‌ఎస్‌లోకే వెళ్లడం ఖాయం. ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు నోరులేని వంద జీవాలున్నాయి. ఒకవేళ సుజాత గెలిచినా ఆమె వినమ్రంగా వెనుక బెంచీలో కూర్చొని రావడం తప్ప మరేం ఉండదు. బీజేపీ గెలిస్తే గులాబీ కూసాలు కదలడం ఖాయం కనుకే ఆ నిరాశలో నుంచి గులాబీ గురివెంద నీతులు పుట్టుకొస్తున్నాయి.

యం. రఘునందన్‌ రావు, బీజేపీ తెలంగాణ


ఉద్యమంగా బతుకమ్మ

బతుకమ్మ పండుగ ఒక పోరాట రూపం, ఒక స్పూర్తి, ఒక చైతన్యం. తెలంగాణ బిడ్డల గుండెచప్పుడుతో ముడిపడిఉన్న పండుగే బతుకమ్మ. ఇది భూస్వాముల అకృత్యాలకు వ్యతిరేకంగా జరిగిన పండగని మరువకూడదు. నాటి రైతాంగ సాయుధ పోరాటం మొదలుకుని ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు, నేటి ప్రజాపోరాటాల వరకూ బతుకమ్మ ఆట, పాట ఒక భాగం అయిందంటే దాని స్ఫూర్తిని అర్థం చేసుకోవచ్చు. బతుకమ్మ పండుగ తెలంగాణకు సంకేతం. బతుకునే అమ్మగా భావించి పూలలో, ఆకులలో, నీటిలో ప్రకృతిలో ఆమెను దర్శించి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో కొలవటం తెలంగాణలో మాత్రమే ఉన్న విశిష్ట సంప్రదాయం. బతుకమ్మ పాటలలో సామూహిక గానం, సంగీతం, నృత్యం ఉన్నాయి. అలాగే ప్రజల జీవితం ఉంది. ఈ పండుగలో తెలంగాణ ప్రజల జీవితాలను విషాదాలను పాడుకుంటూ గత చరిత్రను గుర్తుచేసుకుంటారు. నిజ జీవిత సమస్యలు, ఆర్థిక సమస్యలు తదితర అంశాలనునెమరువేసుకుంటారు. వేల పాటల ఊట, కొటి గొంతుల గానం తెలంగాణ బతుకమ్మ. 


నేడు బతుకమ్మ పండుగను కేవలం సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసంలో జరిపే ఒక ఉత్సవంగా మాత్రమే పాలకులు పరిగణిస్తున్నారు. తెలంగాణ ప్రజల చరిత్రాత్మక పోరాట రూపం బతుకమ్మ. తెలంగాణ రాష్ట్రం వచ్చినా అది జీవన సౌందర్యానికి నెలవు కాలేదు. యువతకు ఉపాధి కరువు, దళితులకు లభించని 3 ఎకరాల భూ వసతి, భద్రత లేని స్త్రీ జీవనం, ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కొరవడడంతో రైతులో నిరాశానిస్పృహలు... ఇలా ఎన్నో సమస్యలు. కాబట్టి బతుకమ్మను ఒక ఉద్యమంగా సాగించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి.

మాదం తిరుపతి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.