Advertisement

కరోనాపై అరబ్బుల సమరం

Mar 25 2020 @ 06:36AM

గల్ఫ్ దేశాలలో రాత్రివేళలలో జన సంచారం ఎక్కువగా ఉంటుంది. ‌ఈ కారణంగా కువైత్ సాయంకాలం అయిదు నుంచి తెల్లవారు జాము దాకా, సౌదీ అరేబియా రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరు వరకు కర్ఫ్యూను అమలు పరుస్తున్నాయి. కర్ఫ్యూ వేళలలో ఇళ్ళ నుండి బయటకు వచ్చిన ప్రతి వ్యక్తిని పోలీసులు నిర్బంధిస్తున్నారు. సౌదీలో అయితే కర్ఫ్యూ సమయంలో కారు నడిపిన వారిని సి.సి. టీవీల ఆధారంగా గుర్తించి పది వేల రియాళ్ళు (సుమారు రూ.2 లక్షలు) జరిమానా విధిస్తున్నారు. 


కరోనా మహమ్మారితో ప్రపంచం వణికిపోతోంది. భారతదేశమూ భయపడుతోంది. ఈ భయం, భారతదేశానికి విశాల ప్రపంచంతో ఉన్న సంబంధాలను ప్రతిబింబిస్తోంది. కనీవినీ ఎరుగని ఈ భయంకర అంటువ్యాధి విదేశాల నుంచి ఏ విధంగా సంక్రమిస్తుందో తెలిసి దేశ ప్రజలందరూ అమితంగా ఆందోళన చెందుతున్నారు. కరోనా వ్యాప్తిని ప్రతిఘటించేందుకై ముందస్తు కఠోర చర్యలకు కేంద్ర ప్రభుత్వమూ, రాష్ట్ర ప్రభుత్వాలూ పూనుకున్నాయి. వీటిలో భాగంగా ఇరుగు పొరుగు, దూర దేశాల నుంచి విమానాల రాకపై నిషేధం విధించారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ నిర్భంధంలో ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పదే పదే చెప్పుతున్నారు. అంతర్జాతీయ విమానాల రాకపై నిషేధం, పర్యాటకులపై ఆంక్షలు మొదలైనవి కరోనా సంక్షోభపు విదేశీ మూలాలను చాటుతున్నాయి.


భారతదేశంలో అధికారికంగా తొలి కరోనా మృతుడు ఒక కన్నడిగుడు. సౌదీ అరేబియాలో ఇంజనీర్‌గా ఉన్న తన కుమారుని వద్దకు వెళ్ళి, అటుగా మక్కా పుణ్యక్షేత్రాన్ని సందర్శించి తిరిగి వచ్చిన 76 ఏళ్ళ వృద్ధుడతడు. జెద్ధా నుంచి హైద్రాబాద్‌కు వచ్చి నగరంలో చికిత్స చేయించుకుని కర్ణాటకు వెళ్ళిన అనంతరం ఆయన మరణించాడు. ఆ కన్నడిగుడి మరణం మొ దలు ఇప్పటి వరకు హైదరాబాద్‌లో గానీ. దేశంలోని ఇతర ప్రాంతాలలో గానీ నమోదయిన కరోనా నిర్ధారణ కేసులన్నీ విదేశీ ప్రయాణ ప్రమేయమున్నవే కావడం గమనార్హం. గల్ఫ్ దేశాలు, ప్రత్యేకించి దుబాయితో ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధమున్నవారే ఈ కరోనా బాధితులలో అత్యధికంగా వున్నారు.


భారతీయ అంతర్జాతీయ విమానయాన మార్కెట్ పై దుబాయికి చెందిన ‘ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్’ సంస్ధ, మన ‘ఎయిర్ ఇం డియా’ కంటే కూడా ఎక్కువ పట్టు ఉన్నది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, భారత్ మధ్య ప్రతి వారమూ దాదాపు 1.35 లక్షల మంది ప్రయాణికులను చెరో వైపు నుంచి తీసుకు వెళ్ళే ఒప్పందం ఉన్నది. ఒక్క హైదరాబాద్ నుంచే ప్రతి రోజూ సుమారు రెండు వేల మంది దుబాయి మీదుగా గల్ఫ్‌కు, ప్రపంచంలోని ఇతర దేశాలకు ప్రయాణిస్తుంటారు. తెలంగాణ గడ్డపై నిర్ధారణ అయిన కరోనా కేసులో సంబంధిత కన్నడిగుడు కూడ దుబాయి నుంచి బెంగుళూరుకు వెళ్ళి, అక్కడ నుంచి హైదరాబాద్‌కు రావడం జరిగింది. అంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటి వరకు కరోనా వ్యాధి నిర్ధారితమైన రోగులలో అత్యధికులు దుబాయి లేదా ఆబుధాబి మీదుగా గల్ఫ్ దేశాలతో పాటు అమెరికా లేదా యూరోపియన్ దేశాల నుంచి భారతదేశానికి వచ్చిన వారు కావడం గమనార్హం. భారతదేశంలో అత్యధికంగా కరో నా కేసులు నమోదయిన మహారాష్ట్రలో సగం మంది బాధితులు దుబాయి పర్యటన నుండి తిరిగి వచ్చిన వారేనన్నది ఒక కఠోర వాస్తవం. 


కరోనా సంక్షోభాన్ని గుర్తించిన తొలి దశలో విదేశాల నుంచి వచ్చిన 15 లక్షల మందికి పైగా ప్రయాణీకులకు విమానాశ్రయాలలోనే ప్రాథమికంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరమే దేశంలోకి అనుమతించారు. అయితే, ఆ తర్వాత కొన్ని రోజులకే వారిలో కొందరికి కరోనా వ్యాధి మళ్ళీ సంక్రమించినట్లుగా గుర్తించడంతో దిగ్భ్రాంతి చెందిన అధికారులు విమానాలు దిగిన ప్రయాణికులను విమానాశ్రయంలోనే ప్రత్యేకంగా ఉంచి పర్యవేక్షించడానికి ఏర్పాట్లు చేసారు. ముంబై, హైదరాబాద్ విమానాశ్రయాలలో దిగి తమ తమ స్వస్ధలాలకు తిరిగి వెళుతోన్న ప్రవాస భారతీయులకు చికాకు కలిగించే ఒక సమస్య ఎదురవుతున్నది. వారి చేతులపై కరోనా వ్యాధి నిర్ధారిత పరీక్ష జరిగిన స్టాంపు ఉన్న కారణాన మార్గమధ్యంలో ప్రజలు, పోలీసులు వారిని నిందితులుగా పరిగణించడం జరుగుతోంది! కరోనా వ్యాధిపై క్షేత్రస్ధాయిలో అవగాహన లేమిని ఇది ఎత్తిచూపడం లేదా?


దుబాయిలో మొదటిసారిగా గత జనవరిలో, చైనాలోని ఉహాన్ నగర సందర్శకులలో కరోనా వ్యాధి ఉన్నట్లు ప్రకటించారు. మార్చిలో కువైత్, బహ్రెయిన్, ఖతర్, సౌదీ అరేబియా, ఒమాన్ ప్రభుత్వాలు తమ దేశాలలో కరోనా రోగులు ఉన్నట్లు ప్రకటించాయి. ఇరాన్‌లోని ఖోం అనే పుణ్యక్షేత్రానికి వెళ్ళిన ఈ అరబ్బులకు అక్కడ కరోనా సంక్రమించింది. తమ దేశాలలోని కరోనా వ్యాధిగ్రస్తులలో వీరి సంఖ్యే అత్యధికంగా వున్నదని అవి వెల్లడించాయి. 


ఇక ముందుస్తు నిర్మూలనా చర్యలను పరిశీలిస్తే, ధనిక గల్ఫ్ దేశాల కంటే భారతదేశంలో సకాలంలో చేపడుతున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పవచ్చు. గల్ఫ్ దేశాలలో ఉదయం, మధ్యాహ్న వేళల్లో కంటే సాయంకాలం, రాత్రివేళలలో జన సంచారం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా కువైత్ సాయంకాలం అయిదు నుంచి తెల్లవారు జాము దాకా, సౌదీ అరేబియా రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు పూర్తిగా కర్ఫ్యూను అమలు పరుస్తున్నాయి. కర్ఫ్యూ వేళలలో ఇళ్ళ నుండి బయటకు వచ్చిన ప్రతి వ్యక్తిని పోలీసులు నిర్బంధిస్తున్నారు. సౌదీలో అయితే కర్ఫ్యూ సమయంలో ఎవరైనా కారు నడిపితే సి.సి. టీవీల ఆధారంగా పది వేల రియాళ్ళు (సుమారు 2 లక్షల రూపాయాలు) జరిమానా విధిస్తున్నారు. కువైత్‌లో కర్ఫ్యూ అమలుకు సైనికులనే రంగంలోకి దించి, పాఠశాలలను తాత్కాలిక జైళ్ళుగా మార్చారు. ఖతర్‌లో తెలుగు ప్రవాసులతో పాటు లక్షలాది దక్షిణాసియా కార్మికులు నివసించే సనయ్యా ప్రాంతాన్ని పోలీసులు దిగ్బంధం చేసారు. రోగుల సంఖ్య విషయంలో దుబాయి వెల్లడిస్తున్న సంఖ్యను అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. కరోనా మహమ్మారి అంతమయ్యే దాకా అ ఎడారి దేశాలలో అసంఖ్యాకుల, మరీ ముఖ్యంగా ప్రవాస భారతీయుల ఆర్ధిక పరిస్ధితులు ప్రభావితం కానున్నాయి.


మోహమ్మద్ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి


Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.