Advertisement

గల్ఫ్‌ ప్రవాసులకు గుర్తింపు ఏదీ?

Jul 22 2020 @ 08:44AM

ఏ విధంగా చూసినా, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో గల్ఫ్ ప్రవాసుల పాత్రను విస్మరించలేము. మాతృదేశ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తున్న ఈ ప్రవాసులకు దురదృష్టవశాత్తు ఇటు గల్ఫ్‌లో గానీ అటు స్వదేశంలో గానీ సరైన గుర్తింపు లభించడం లేదు.


శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలి మండలం సురదవాణిపేట గ్రామానికి చెందిన సురద సింహాచలం దుబాయిలో పని చేస్తున్నాడు. హైదరాబాద్ నగరానికి చెందిన బిక్కసాని దిలీప్ కుమార్ సౌదీ అరేబియాలో పని చేస్తున్నాడు. ఈ ప్రవాస శ్రామికులు యీ ఎడారి దేశాల నుంచి నెలా నెలా పంపించే డబ్బులే స్వదేశంలోని వారి వారి కుటుంబాలకు ప్రధాన ఆదాయం. కొన్ని కుటుంబాలకు అయితే ఆ గల్ఫ్ సొమ్మే పెద్ద దిక్కు అని కూడా చెప్పవచ్చు. ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాలలో కొన్ని లక్షలాది కుటుంబాలు ప్రతి నెలా ఎడారి దేశాల నుంచి అందే పెట్రో డాలర్ల పై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి. సౌదీ అరేబియా–రష్యా చమురు ధర పోరు, అమెరికా లోపాయికారీ వ్యవహారంతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అనూహ్యంగా పడిపోయాయి. ఈ ధరల పతనానికి తోడు కరోనా మహమ్మారి కారణాన విశ్వవ్యాప్తంగా రవాణా వ్యవస్థ కుదేలయిపోయింది. ఫలితంగా, సమీప భవిష్యత్తులో ఏ మాత్రం కోలుకోలేనంతగా పెట్రోలు ధరలు పడిపోయాయి. చమురు ఎగుమతుల సంపాదన పైనే ప్రధానంగా ఆధారపడ్డ గల్ఫ్ దేశాలు పెట్రోలియం ఉత్పత్తుల ధరల పతనంతో తమ వ్యయాన్ని తగ్గించాయి. గోరు చుట్టుపై రోకటి పోటు అన్నట్టుగా కరోనా వైరస్ విజృంభణ పరిస్థితిని మరింత కఠోరం చేసింది.


గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలలో సర్వత్రా నిర్మాణ రంగం అత్యంత కీలకమైనది. గత సంవత్సరం 2.5 ట్రిలియన్ డాలర్ల ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది. వీటికి అనుసంధానంగా అనేక ఇతర వ్యాపారాలు, పరిశ్రమలు ఈ ఎడారి దేశాలలో వర్ధిల్లుతున్నాయి. గల్ఫ్ దేశాల నిర్మాణ రంగం, దాని అనుబంధ పరిశ్రమలలో ఉపాధి పొందుతున్న వారిలో 70 శాతం మందికి పైగా ప్రవాసులు. ఈ ప్రవాసులలో భారతీయులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రవాసుల విషయానికి వస్తే, గల్ఫ్‌లోని నిర్మాణ రంగమే వారికి పెద్ద ఆసరా. ఆ ఆసరా ఇప్పుడు పూర్తిగా నిరాశాజనకంగా ఉండడంతో సింహాచలం లాంటి తెలుగు ప్రవాసులు ఇప్పుడు ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో మాతృభూమికి తిరిగి వెళ్ళుతున్నారు. కరోనా భయంతో కాకుండా, ఉపాధి కరువయి మాత్రమే వీరందరూ స్వదేశానికి తిరిగి వెళ్ళిపోతున్నారనేది గమనార్హం. మారిన పరిస్థితులలో ప్రతిష్ఠాత్మకమైన ‘సౌదీ విజన్- 2030’, ‘యు.ఏ.ఇ విజన్- 2021’, ‘ఆబుధాబి ఎకానిమిక్ విజన్- 2030’, ‘ఖతర్ నేషనల్ విజన్- 2030’లో రూపకల్పన చేసిన బడా ప్రాజెక్టులలో అనేకం మూలనపడ్డాయి. దుబాయి ఎక్స్ పో, కువైట్ రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టు మొదలైనవన్నీ రద్దయ్యాయి లేదా వాయిదాపడ్డాయి. అనేక సంస్థలు వేతనాలు చెల్లించడంలో జాప్యం చేస్తున్నాయి. మరికొన్ని పూర్తిగా మూతబడ్డాయి.


ఎడారులలో మండే ఎండలలో తట్టలు మోసే ఈ ప్రవాస కార్మికుల పుణ్యమా అంటూ భారత్‌లో విదేశీ మారకం నిల్వలు స్థిరంగా ఉంటున్నాయి. మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు పరితపించే అమెరికా లేదా ఐరోపాలలో నివసించే ప్రవాసుల కంటే గల్ఫ్‌లో తట్టలు మోసే ఈ కార్మికులు స్వదేశంలోని తమ కుటుంబాలకు పంపే ఆదాయమే భారత్‌కు కీలకమని ప్రపంచ బ్యాంకు, రిజర్వ్ బ్యాంకు గుర్తించాయి. విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ ఈ వాస్తవాన్ని అంగీకరించాయి. భారతదేశపు స్్్థూల ఆదాయంలో 2.9 శాతం గల్ఫ్ ప్రవాసులు తమ కుటుంబాలకు పంపే పెట్రో డాలర్లే నని అంచనా.


ఇప్పుడు కరోనా ఉపద్రవం, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పూర్తిగా పడిపోయిన కారణాన గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న భారతీయుల నుంచి మాతృదేశానికి అందే విదేశీ మారకం అంతకంతకూ తగ్గిపోతోంది. ప్రపంచ బ్యాంకు తాజా అంచనాల ప్రకారం 2020–-21 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి 23 శాతం అంటే సుమారు 64 బిలియన్ డాలర్ల వరకు గల్ఫ్ ప్రవాసుల నుంచి చెల్లింపులు తగ్గుతాయి. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ చెల్లింపులు మరింతగా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఆందోళనకరమని మరి చెప్పనవసరం లేదు. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్, సౌదీ అరేబియా, ఇంకా ఇతర గల్ఫ్ దేశాలలో ఉన్నవారితో పాటు హెచ్1-బి వీసాలపై అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు పంపే ధనమే భారత్ ఆర్థిక వ్యవస్థకు కీలకం. ఒక్కసారి చరిత్రను వెనక్కి తిరిగి చూస్తే, 1991లో ప్రవాసులు పంపిన 2 బిలియన్ డాలర్లలో సగం చమురు కొనుగోలుకు వెచ్చించే వారు.


పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టే నాటికి దేశ ఖజానాలో మిగిలి ఉన్నది కేవలం 1 బిలియన్ డాలర్లు మాత్రమే. 2019లో భారత్‌కు ప్రవాసుల నుంచి అందిన సొమ్ము 79 బిలియన్ డాలర్లు. దీన్ని బట్టి ప్రవాస భారతీయుల ఆర్థిక శక్తి ఎంతగా పెరిగిందో ఉహించుకోవచ్చు. ప్రవాసుల నుంచి అందే మొత్తంలో అత్యధికం గల్ఫ్ దేశాల నుంచి అందుతున్నదనే సత్యాన్ని గుర్తించి తీరాలి. ఇక అమెరికా విషయానికి వస్తే, అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న భారతీయ విద్యార్థులు, అక్కడ ఉంటున్న ఇతరులు తమ ఖర్చులకై దేశం నుండి ఏటా 11.33 బిలియన్ డాలర్లను ఆ దేశానికి తీసుకెళ్ళుతున్నారు. మరి దాదాపు అంత మొత్తం మాత్రమే అమెరికా నుంచి భారతదేశానికి అందుతున్నది! ఏ విధంగా చూసినా, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో గల్ఫ్ ప్రవాసుల పాత్రను విస్మరించలేము. మాతృదేశ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తున్న ఈ ప్రవాసులకు దురదృష్టవశాత్తు ఇటు గల్ఫ్‌లో గానీ అటు స్వదేశంలో గానీ సరైన గుర్తింపు లభించడం లేదు. -మొహమ్మద్ ఇర్ఫాన్, ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.