రోడ్డు భద్రతకు.. కమిటీ

ABN , First Publish Date - 2021-04-23T05:52:29+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా స్థాయి ఎంపీల రోడ్డు భద్రత కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

రోడ్డు భద్రతకు.. కమిటీ
గల్లా జయదేవ్‌, ఎంపీ

చైర్మన్‌గా సీనియర్‌, ప్రత్యేక ఆహ్వానితులుగా ఇతర ఎంపీలు

ఆ ప్రకారం గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కి చైౖర్మన్‌ బాధ్యతలు

గుంటూరు, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా స్థాయి ఎంపీల రోడ్డు భద్రత కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో వివిధ రంగాలకు చెందిన వారితో పాటు అధికారులను భాగస్వామ్యం చేసింది. ప్రధానంగా రోడ్డు భద్రత కోసం కమిటీలో చర్చించి నిర్ణయాలు తీసుకుని అమలు చేయడమే ముఖ్య ఉద్దేశ్యం. జిల్లాలో ప్రస్తుతం లోక్‌సభకు ప్రాతినిఽథ్యం వహిస్తోన్న ఎంపీల్లో ఎవరు సీనియర్‌ అయితే ఆయనే ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆ ప్రకారం లోక్‌సభ సభ్యుల్లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ సీనియర్‌. దాంతో ఆయన నేతృత్వంలోనే కమిటీ కొనసాగుతుంది. అలానే లోక్‌సభ, రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఇతర ఎంపీలు ఈ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. జిల్లా కలెక్టర్‌ వైస్‌చైర్మన్‌గా వ్యహరిస్తారు. ఎంపీల రోడ్డు భద్రత కమిటీకి మెంబర్‌ సెక్రెటరిగా రవాణ శాఖ ఉప కమిషనర్‌ వ్యవహరిస్తారు. సభ్యులుగా అర్బన్‌, రూరల్‌ ఎస్పీలు, జడ్పీ సీఈవో, నగరపాలకసంస్థ మేయర్‌, ఉడా చైర్మన్‌, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఆర్డీవోలు, సబ్‌ కలెక్టర్లు, చైర్మన్‌ నామినేట్‌ చేసే ముగ్గురు ఎన్‌జీవోలు, జిల్లా స్థాయి అధికారులు, ట్రేడ్‌ అసోసియేషన్‌ నుంచి ప్రతినిధి, జిల్లా సివిల్‌ సర్జన్‌, డీఈవో, పీడబ్ల్యూడీకి చెందిన సీనియర్‌ అధికారి, జాతీయ రహదారుల ఆఫీసర్‌ ఇన్‌చార్జి, ఎన్‌హెచ్‌ఏఐ అధికారి ఉంటారు. ఎంపీల రోడ్డు భద్రత కమిటీ జిల్లాలో అన్ని రోడ్డు భద్రత కార్యకలాపాలు, జరుగుతోన్న ప్రమాదాలను పర్యవేక్షిస్తుంది. ప్రమాదాలు జరుగుతోన్న ప్రాంతాలు, అందుకు దారి తీస్తోన్న కారణాలను అధ్యయనం చేస్తుంది. రోడ్డు సేఫ్టీ పణ్రాళికలను రూపొందించి మరణాలు, ప్రమాదాలు తగ్గించేందుకు కృషి చేస్తుంది. ప్రధానంగా నాలుగు ఈలు(ఎడ్యుకేషన్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎమర్జన్సీ కేర్‌, ఇంజనీరింగ్‌) పకడ్బందీగా అమలు జరిగేలా చర్యలు చేపడుతుంది. వేగ నియంత్రణలను కూడా సమీక్షిస్తుంది. నగరంలో ట్రాఫిక్‌ పార్కు-కమ్‌-ట్రైనింగ్‌ సెంటర్‌ని ఏర్పాటు చేస్తుంది. ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఈ కమిటీ సమావేశమై చర్చించి నిర్ణయాలు తీసుకొంటుంది. వాటి అమలుపై తదుపరి సమావేశంలో సమీక్షిస్తుంది. 


Updated Date - 2021-04-23T05:52:29+05:30 IST