16 ఏళ్ల తర్వాత

ABN , First Publish Date - 2021-02-18T06:51:33+05:30 IST

గత ఏడాది కరోనా కారణంగా అర్థంతరంగా నిలిచిపోయిన నగరపాలక సంస్థ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది.

16 ఏళ్ల తర్వాత

నగర పాలక సంస్థకు ఎన్నికలు

సత్తాచాటాలని చూస్తోన్న అధికార పార్టీ

నగరంలో పట్టు కోసం టీడీపీ నేతల వ్యూహం

బీజేపీ పొత్తుతో సై అంటున్న జనసేన నాయకులు

పూర్తి స్థాయి ప్రచారంలోకి దిగిన అభ్యర్థులు


(గుంటూరు, ఆంధ్రజ్యోతి)

గత ఏడాది కరోనా కారణంగా అర్థంతరంగా నిలిచిపోయిన నగరపాలక సంస్థ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ ప్రకటనతో 16 ఏళ్ల తర్వాత గుంటూరు నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఒక్కసారిగా జీఎంసీ పరిధిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 

అధికారపక్షమైన వైసీపీ సత్తా చాటుకొని తొలిసారిగా జీఎంసీలో మేయర్‌ పీఠం కైవసం చేసుకోవాలని వ్యూహరచన చేస్తోంది. జీఎంసీ పరిధిలోని రెండు నియోజకవర్గాలైన తూర్పు, పశ్చిమలో తమదే పెత్తనం అని.. అది కలిసొచ్చే అంశం అని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ తరపున మేయర్‌ అభ్యర్థి ఏవరన్నది స్పష్టత  లేదు. అయినా సీనియర్లు పాదర్తి రమేష్‌గాంధీ, కావటి మనోహర్‌నాయుడు రేసులో ఉన్నారు. ఇప్పటికే కార్పొరేట్‌ అభ్యర్థులను ప్రకటించటంతో వారు మంగళవారం ప్రచారం చేపట్టారు. నగరంలో పట్టున్న నేతలు ఉండటంతో తమ గెలుపు ఖాయమంటూ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా తూర్పు నియోజకవర్గ పరిధిలో డివిజన్లలో అభ్యర్థుల గెలుపు భారం ఎమ్మెల్యే ముస్తఫా తన భుజస్కంధాలపై వేసుకున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలానే చంద్రగిరి ఏసురత్నం, మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి వంటి వారు పశ్చిమలో కీలకంగా మారారు. మరోవైపు టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ ఇప్పటికే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అభ్యర్థుల గెలుపు కోసం ఆయన స్వయంగా ప్రచారంలో పాల్గొనటంతో పాటు అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. జగన్‌ పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయంటూ వైసీపీ అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు.

పట్టు కోసం టీడీపీ వ్యూహం


గుంటూరు నగరపాలక సంస్థపై పచ్చజెండా ఏగురవేసి పట్టు పెంచుకోవాలని టీడీపీ తమ్ముళ్లు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. నగరపాలక సంస్థలో రెండుసార్లు తమ పాలనను గుర్తుచేసుకోవాలంటూ ప్రచార శంఖం పూరించారు. టీడీపీ హాయాంలో గుంటూరు తూర్పు, పశ్చిమలో ట్రెడ్‌ మార్కులుగా చేసిన పనులతో పాటు పొన్నూరు రోడ్డు విస్తరణ, లాంచస్టర్‌ రోడ్డు రాకపోకలు అనువుగా తీర్చిదిద్దటం, బీఆర్‌ స్టేడియం, బస్టాండ్‌ పరిసర ప్రాంతాలలో రోడ్ల విస్తరణ, కొల్లి శారదా మార్కెట్‌, మానస సరోవరం, ఎన్టీఆర్‌ స్టేడియం ఇటువంటి శ్వాశ్వత పనులు తమ హాయంలో జరిగాయంటూ ప్రచారం మొదలు పెట్టారు. నగరపాలక సంస్థకు ఇప్పటికి మూడుసార్లు ఎన్నికలు జరగగా రెండు సార్లు టీడీపీదే పైచేయిగా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఘోరంగా దెబ్బ తిన్నా గుంటూరు లోకసభ, పశ్చిమ నియోజకవర్గాన్ని ఆ పార్టీ కైవసం చేసుకొంది. తాజాగా మేయర్‌ స్థానం ఓసీ జనరల్‌కు కేటాయించటంతో టీడీపీ సీనియర్‌ నేత కోవెలమూడి రవీంద్రను అభ్యర్థిగా ప్రకటించి... ఆ పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాయి. కార్పొరేట్ల సీట్ల ఎంపీకలో స్వల్ప విభేదాలు వచ్చినా నేతల జోక్యంతో వాటిని సామరస్యంగా పరిష్కరించారు. దాదాపు ఏడాది నుంచి టీడీపీ కార్పొరేట్‌ అభ్యర్థులు తాము పోటీ చేస్తున్న ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కొవిడ్‌ సమయంలో పేద వర్గాలకు నిత్యావసర సరుకులు అందించి.. తాము ఎప్పుడు అందుబాటులోనే ఉంటామన్న సంకేతాన్ని పంపారు.  ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలు పెంచుకొంది. ప్రధానంగా రాజధాని తరలింపు, అమరాతి రైతుల ఆందోళనలు, కలిసొస్తాయని అంచనా వేస్తున్నారు. అలానే పార్టీ సీనియర్‌ నేతలు, రాష్ట్రనాయకులు నగరపాలక సంస్థ అభ్యర్థులకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. పశ్చిమలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి, వైసీపీలోకి మారి గుంటూరు లోకసభ అభ్యర్థిగా బరిలో దిగి ఓటమి చెందిన మోదుగుల వేణుగోపాలరెడ్డితో పాటు, ఎమ్మెల్యేగా గెలుపొందిన మద్దాళి గిరిధర్‌ కూడా వైసీపీ గూటికి చేరటాన్ని శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.  నాయకులు పార్టీ మారినా డివిజన్లలో క్యాడర్‌ చెక్కు చెదరలేదన్న సంకేతాన్ని ఇవ్వడానికి ద్వితీయశ్రేణి నాయకత్వం పనిచేస్తుంది. అదే తరహాలో తూర్పులో కూడా మెజార్టీ సీట్లు సాధించటం పైనే దృష్టిపెడుతున్నారు. ఆస్తిపన్ను పెంపు తదితరాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తమకు సానుకూల వాతావరణం తేవడానికి అక్కడ ఇన్‌చార్జిగా ఉన్న మహ్మద్‌ నసీర్‌ కృషి చేస్తున్నారు. నసీర్‌ అహ్మాద్‌, కోవెలమూడి రవీంద్రలు నియోజకవర్గ ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ప్రకటనకు ముందే ఇద్దరూ అభ్యర్థులతో కలిసి ఇంటింటికి తెలుగుదేశం పేరుతో డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు. కాగా తాజా ప్రకటనతో పూర్తి స్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వారికి అండగా అర్బన్‌ అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌ ప్రచారం చేస్తున్నారు. గుంటూరు మండలంలోని గోరంట్ల, నల్లపాడు, ఏటూకూరు, బుడంపాడు, గొర్లవారిపాలెం తదితర గ్రామాలు నగరపాలక సంస్థలో కలిశాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న ఈ గ్రామాలపై మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్యతో పాటు పార్టీ సీనియర్‌ నేతలు దృష్టిపెట్టారు. 

బరిలో బీజేపీ, జనసేన..


జీఎంసీ ఎన్నికల బరీలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులు బరీలో నిలిచారు. అభ్యర్థుల ఎంపికలో ఇరు పార్టీ నేతలు అనేక సమావేశాలు నిర్వహించాక సామాజిక వర్గాల ప్రతిపాదికన అభ్యర్థులను బరిలోకి దించారు. బీజేపీ 18, జనసేన 24 మందితో రంగంలోకి దిగారు. మిగిలిన 10 డివిజన్లలో ఏవరన్నది ఇంకా బీ ఫారాలు ఇవ్వలేదు. అలానే మేయర్‌ అభ్యర్థి ఎవరన్నది ప్రకటించలేదు. వారి తరపున జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ప్రచార బాధ్యతలను చేపట్టారు.. అలానే సీపీఐ 7, సీపీఎం 5 డివిజన్లలో అభ్యర్థులను పోటీలో నిలిపాయి.  


Updated Date - 2021-02-18T06:51:33+05:30 IST