వాడి.. వేడిగా

ABN , First Publish Date - 2021-08-03T05:59:57+05:30 IST

ఆస్తి పన్ను పెంపుపై జరిగిన కౌన్సిల్‌ సమావేశం దద్దరిల్లింది.

వాడి.. వేడిగా
ప్ల కార్డులతో నేలపై కూర్చుని నిరసన తెలుపుతున్న టీడీపీ కార్పొరేటర్లు

ఆస్తి పన్నుపెంపును వ్యతిరేకించిన టీడీపీ సహా పలువురు వైసీపీ సభ్యులు

కౌన్సిల్‌లో బైఠాయించి నిరసన తెలిపిన టీడీపీ కార్పొరేటర్లు

కరోనా నేపథ్యంలో పెంపును వాయిదావేయాలన్న విపక్షం

అయినా ఆస్తిపన్ను పెంపునకు కౌన్సిల్‌ ఆమోదం

గుంటూరు (కార్పొరేషన్‌), ఆగస్టు 2: ఆస్తి పన్ను పెంపుపై జరిగిన కౌన్సిల్‌ సమావేశం దద్దరిల్లింది. ఆస్తి పన్ను పెంపుదలను ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావుతోపాటు టీడీపీ కార్పొరేటర్లు వ్యతిరేకించారు. పలువురు వైసీపీ కార్పొరేటర్లు కూడా నిరసన వాణి వినిపించారు. నేరుగా ఆస్తి పన్ను పెంచవద్దంటూ చెబుతూ పెంచిన విధానం తగ్గించాలని విజ్ఞప్తిచేశారు. మేయర్‌ కావటి శివనాగమనోహర్‌ నాయుడు అధ్యక్షతన సోమవారం కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు. గుంటూరు నగరవాసులపై పడనున్న ఆస్తిపన్ను భారాన్ని అడ్డుకునేందుకు టీడీపీ కార్పొరేటర్లు ప్రయత్నించారు... కౌన్సిల్‌లో నేలపై బైఠాయించి ప్ల కార్డులతో నిరసన వ్యక్తంచేశారు. కరోనా వల్ల ఆర్ధికవ్యవస్థ మరింతగా చిన్నాభిన్నం అయిందని ఈ పరిస్థితుల్లో ప్రజలు పన్నులు చెల్లించడమే కష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఆస్తిపన్ను చెల్లింపుకు సంబంధించి వడ్డీ మినహాయింపు ఇవ్వాలని, పూర్తిగా ఆస్తి పన్నుపై వడ్డీని మాఫీచేయాలని కౌన్సిల్‌ తీర్మానించింది. 

ఓ దశలో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. పన్ను పెంచేవిధంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని టీడీపీ కార్పోరేటర్లు కోవెలమూడి రవీంద్ర (నాని), వేములపల్లి  శ్రీరాం ప్రసాద్‌, కొమ్మినేని కోటేశ్వరరావు, వరప్రసాద్‌, అశోక్‌ తదితరులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లు రాజలత, సంకూరి శ్రీనివాసరావుతోపాటు పలువురు టీడీపీ నాయకులతో వాగ్వాదానికి దిగారు.  తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో టీడీపీ కార్పోరేటర్లు ప్రసంగాన్ని వైసీపీ కార్పొరేటర్లు పదే పదే అడ్డుకోవడం, వారిని మాట్లాడించే అవకాశం ఇవ్వలేదు. ఈ దశలో అనేకసార్లు టీడీపీ సభ్యులను మాట్లాడనీయకుండా అధికారపార్టీ సభ్యులు అడ్డుకున్నారు. 2002లో ఆస్తిపన్ను పెంచారని 19ఏళ్ల తరువాత ఇప్పుడు ఆస్తి పన్ను పెంచాల్సిన అవసరం ఏంటని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. 2007లో వాణిజ్య భవనాలకు పెంచిన ఆస్తిపన్ను విజయవాడ, విశాఖపట్నం నగరాల కంటే అధికంగా ఉందని అప్పట్లోనే 100-1000 శాతం ఆస్తిపన్ను పెంచారని తెలిపారు. తక్షణమే ఆస్తి పన్ను పెంపుదలను వాయిదా వేయాలన్నారు. ఈ అంశాన్ని టీడీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు.  ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వారిపై పన్నుల భారం మోపుతారా అంటూ శ్రీరాం ప్రసాద్‌ (ఇసుకబుజ్జి) ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ వర్సెస్‌ వైసీపీ  

యూజీడీ పనులలో రూ.550కోట్ల మేర గత ప్రభుత్వ హాయంలో దోచుకున్నారంటూ మేయర్‌ కావటి ఆరోపించారు. ఇప్పటికీ యూజీడీ పనులు అస్తవ్యస్తంగాఉన్నాయని, గుంటూరును గుంతలూరుగా మార్చారంటూ పలువురు వైసీపీ కార్పొరేటర్లు గత టీడీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడంతో ఆ పార్టీ కార్పొరేటర్లు నాని, బుజ్జి, కోటేశ్వరరావు, వరప్రసాద్‌, అశోక్‌ తదితరులు అడ్డుకున్నారు. అప్పట్లో దోచుకున్నవారిని మీ పార్టీలోకి చేర్చుకున్నారుగా అంటూ ఎద్దేవా చేశారు. దీంతో కౌన్సిల్‌ సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడంతో మేయర్‌ జోక్యం చేసుకున్నారు. 

రుణం కోసమే ప్రజలపై భారం : ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు

కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రూ.25వేల కోట్ల రుణం కోసమే ప్రజలపై భారాన్ని మోపుతోందని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు పేర్కొన్నారు.  గత నవంబర్‌లోనే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ ద్వారా ఆర్డినెన్స్‌ జారీ చేయించిందని, ఇది కేవలం జీవోకు సంబంధించిన అంశం కాదని, ప్రజలపై భారాన్ని మోపడానికి తాను వ్యతిరేకమని చెప్పారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నుంచి రుణాన్ని పొందేందుకు ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు. అద్దె ప్రాతిపదికను తొలగించి కేపిటల్‌ విలువ ద్వారా పన్ను విధించడం తప్పని రిజిస్ట్రేషన్‌ పెరిగిన ప్రతిసారి ప్రజలపై భారం పడుతుందన్నారు. 

ప్రజలకు మరింత సేవచేసేందుకే ఈ నిర్ణయం 

రెంటల్‌ విధానం నుంచి రిజిస్ట్రేషన్‌ విధానంలోకి ఆస్తి పన్ను తీసుకొచ్చి ప్రజలకు మరింత సేవ చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ స్పష్టంచేశారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. నివాస భవనాలకు 0.15 శాతం పెంచుతున్నారని, అయితే స్థలంలో కట్టిన భవనం వరకు మాత్రమే కొలతలు పరిగణలోకి తీసుకుంటారని స్పష్టంచేశారు. 375 చదరపు అడుగులలోపు ఉన్న ఇళ్లకు రూ.50 మాత్రమేపన్ను ఉంటుందన్నారు. నగరంలోని సుమారు 185 మురికివాడల్లోని 39 వేల అసిస్‌మెంట్లకు ఆస్తి పన్ను పూర్తిగా తగ్గిపోతుందని, ప్రస్తుతం చెల్లిస్తున్న రూ. 600, రూ.700 పన్ను రూ.50లకే తగ్గుతుందన్నారు. మురికివాడలు మినహా మిగతా ప్రాంతాల్లో ఆస్తి పన్ను పెంచే అవకాశం ఉందన్నారు. అయితే చాలా నామినల్‌ చార్జీలు మాత్రమే ఉంటాయన్నారు. పెరిగిన ఆస్తి పన్ను ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అమలులోకి వస్తుందని ఇప్పటివరకు ఆస్తి పన్ను చెల్లించిన వారికి, మళ్లీ పెంచిన పన్ను ప్రకారం మిగిలిన మొత్తం చెల్లించేందుకు డిమాండ్‌ నోటీస్‌ జారీ చేస్తామన్నారు. ఖాళీ స్థలాలపై కూడా పెనాల్టీలు విధిస్తామని ఆమె తెలిపారు.

నివాస భవనాలకు 0.13శాతం పన్ను పెంపు: మేయర్‌ 

నగరపాలక సంస్థ పరిధిలోని నివాస భవనాలకు 0.13 శాతం పన్ను పెంచుతూ కౌన్సిల్‌లో తీర్మానం చేసినట్లు మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌నాయుడు ప్రకటించారు. టీడీపీ సభ్యుల నిరసన, పలువురు వైసీపీ సభ్యుల విజ్ఞప్తి మేరకు 0.15 శాతం పెంచాల్సిన ఆస్తి పన్నును 0.13 శాతం మాత్రమే పెంచే విధంగా కౌన్సిల్‌ తీర్మానం చేసిందని మేయరు స్పష్టం చేశారు. నివాసేతర (వాణిజ్య) భవనాలకు 0.30 శాతం, ఖాళీస్థలాలకు 0.50శాతం పెంచుతూ కౌన్సిల్‌ తీర్మానం చేసినట్లు మేయర్‌ స్పష్టం చేశారు. 

 

Updated Date - 2021-08-03T05:59:57+05:30 IST