గుంటూరు జంక్షన్‌.. రీమోడలింగ్‌పై దృష్టి

ABN , First Publish Date - 2021-06-18T05:59:40+05:30 IST

గుంటూరు రైల్వే యార్డు రీమోడలింగ్‌ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసేందుకు డివిజనల్‌ రైల్వే అధికారులు దృష్టి సారించారు.

గుంటూరు జంక్షన్‌.. రీమోడలింగ్‌పై దృష్టి
గుంటూరు రైల్వే యార్డు

గుంతకల్లు డబ్లింగ్‌ ప్రాజెక్టులోకి యార్డు పనులు

రూ.73 కోట్ల వ్యయం అవుతుందని ప్రతిపాదనలు 

అంచనాలను రైల్వేబోర్డు ఆమోదిస్తే త్వరితగతిన పనులు

గుంటూరు రైల్వేస్టేషన్‌లో తీరనున్న ప్లాట్‌ఫాంల సమస్య

గుంటూరు, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): గుంటూరు రైల్వే యార్డు రీమోడలింగ్‌ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసేందుకు డివిజనల్‌ రైల్వే అధికారులు దృష్టి సారించారు. గతంలోనే మంజూరైన ఈ ప్రాజెక్టుకి ఏటా కేంద్ర బడ్జెట్‌లో అరకొరగా నిధులు కేటాయిస్తున్నారు. దీంతో ఇప్పట్లో ఆ పని పూర్తి అయ్యేలా లేకపోతోంది. దీంతో గుంటూరు - గుంతకల్లు డబ్లింగ్‌ ప్రాజెక్టులో చేర్చి పని పూర్తి చేసేందుకు అనుమతించాల్సిందిగా రైల్వేబోర్డుకి ఇక్కడి  అధికారులు నివేదించారు. డబ్లింగ్‌ ప్రాజెక్టు ఇప్పటికే నిర్మాణ దశలో ఉండి నిధులు కూడా పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైల్వేబోర్డు అనుమతిస్తే సాధ్యమైనంత త్వరగా యార్డు రీమోడలింగ్‌ పనిని చేపట్టేందుకు అధికారులు దృష్టి సారించారు. ప్రాజెక్టు పూర్తి అయితే గుంటూరు రైల్వే జంక్షన్‌లో 8 ప్లాట్‌ఫాంలు 24 బోగీల రైళ్లు నిలిపేందుకు అందుబాటులోకి వస్తాయి.

రైల్వే జంక్షన్‌లో అనేక సమస్యలు

గుంటూరు రైల్వేజంక్షన్‌లో యార్డు రీమోడలింగ్‌ జరగకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. పేరుకు ఎనిమిది ప్లాట్‌ఫాంలు ఉన్నప్పటికీ వాటిల్లో 24 బోగీల రైళ్లని కేవలం నెంబరు. 1, 4 పైనే నిలపాల్సిన పరిస్థితి. అరండల్‌పేట ఆర్‌వోబీ వద్ద నుంచి ఒంపు ఉండటంతో పలు సందర్భాల్లో ఈ రెండు ప్లాట్‌ఫాంలు ఖాళీ లేక మిగతా వాటిపై రైళ్లని నిలిపినప్పుడు పలు బోగీలు ప్లాట్‌ఫాంలు దాటిపోయేవి. దాంతో వాటిల్లో నుంచి కిందికి దిగేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలానే లోకోపైలట్‌, గార్డుల సిగ్నలింగ్‌లోనూ సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. దీంతో మూడేళ్ల క్రితమే యార్డు రీమోడలింగ్‌ ప్రతిపాదన తెర పైకి వచ్చింది. రైల్వేబోర్డు రూ.73 కోట్ల అంచన విలువతో ఈ ప్రాజెక్టుకి ఆమోదం తెలిపినప్పటికీ ఏటా కేంద్ర బడ్జెట్‌లో నామమాత్రంగానే నిధులు కేటాయిస్తున్నది. దీని వల్ల పనులు ముందుకు సాగే పరిస్థితి లేకుండా పోయింది. 

ఈ నేపథ్యంలో గుంటూరు - గుంతకల్లు డబ్లింగ్‌ ప్రాజెక్టులో రైల్వేయార్డు రీ మోడలింగ్‌ని ప్రతిపాదించాల్సిందిగా డివిజనల్‌ రైల్వే యూజర్స్‌ కన్‌సల్‌టేటివ్‌ కమిటీ సమావేశాల్లో పలుమార్లు సభ్యులు రైల్వే డీఆర్‌ఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన స్పందించి దక్షిణ మధ్య రైల్వే జీఎం ద్వారా రైల్వేబోర్డుకి తాజాగా నివేదించారు. రీమోడలింగ్‌లో భాగంగా రెండు స్టేబుల్‌ లేన్‌లను కూడా ప్రతిపాదించారు. వీటికి బోర్డు ఆమోదం తెలిపితే సాధ్యమైనంత త్వరగా పనులు చేపట్టి పూర్తి చేస్తామని అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటికే గుంటూరు వెస్టు టెర్మినల్‌ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. యార్డు రీమోడలింగ్‌ కూడా పూర్తి అయితే గుంటూరు రైల్వే జంక్షన్‌ రూపురేఖలే మారిపోతాయన్న అభిప్రాయం వ్యక్తమౌతున్నది. 

Updated Date - 2021-06-18T05:59:40+05:30 IST