ఎయిమ్స్‌లో పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-05-24T05:57:31+05:30 IST

మంగళగిరిలోని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)కు రాష్ట్ర ప్రభుత్వం తరుపున కల్పించాల్సిన మౌలిక వసతులను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు.

ఎయిమ్స్‌లో పనులు పూర్తి చేయాలి
యిమ్స్‌ నిర్మాణ పనులను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరిస్తోన్న ఆ సంస్థ అధికారులు

గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి


గుంటూరు, మే 23 (ఆంధ్రజ్యోతి): మంగళగిరిలోని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)కు రాష్ట్ర ప్రభుత్వం తరుపున కల్పించాల్సిన మౌలిక వసతులను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎయిమ్స్‌కు సంబంధించి మౌలిక వసతులపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎయిమ్స్‌ ఏర్పాటు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కల్పించాల్సిన సదుపాయాలు, పెండింగ్‌ అంశాలపై ఆ సంస్థ డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వంశీకృష్ణరెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్‌కు ఏర్పాటు చేసిన అప్రోచ్‌ రోడ్డు ప్రధాన ద్వారం వద్ద అటవీ భూమికి సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ప్రతిపాదనలు రెండు రోజుల్లో అందించాలన్నారు. ఎయిమ్స్‌కు తాత్కాలికంగా విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ నుంచి నిత్యం మూడు లక్షల లీటర్ల నీరు అందించేందుకు వీలైనంత త్వరలో చర్యలు తీసుకొంటామన్నారు. ఎయిమ్స్‌కు శాశ్వత ప్రాతిపదికన తాగునీటి సరఫరాకు సంబంధించి పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ అధికారులు అందించిన ప్రతిపాదనలకు పరిపాలన అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వరద నీటి ప్రవాహ కాలువల నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభింప చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ గణియా రాజకుమారి, డీఎఫ్‌వో రామచంద్రరాజు, డీఆర్‌వో చంద్రశేఖర్‌రావు, మంగళగిరి - తాడేపల్లి మునిసిపల్‌ కమిషనర్‌ శారద, ఎయిమ్స్‌ ఎస్‌ఈ సుదర్శన్‌ సురిన్‌, మంగళగిరి తహసీల్దార్‌ రాంప్రసాద్‌, తాడేపల్లి తహసీల్దార్‌ శ్రీనివాసరెడ్డి, విజయవాడ కార్పొరేషన్‌ ఎస్‌ఈ భాస్కర్‌, ఆర్‌ అండ్‌ బీ ఈఈ సమర్పణరావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T05:57:31+05:30 IST