పీఎం అఖిలపక్ష సమావేశానికి వెళ్లేందుకు గుప్కార్ కూటమి నిర్ణయం

ABN , First Publish Date - 2021-06-22T19:45:37+05:30 IST

జమ్ముకశ్మీర్‌‌కు సంబంధించిన అంశాలపై అక్కడి ప్రాంతీయ పార్టీలతో చర్చించేందుకు..

పీఎం అఖిలపక్ష సమావేశానికి వెళ్లేందుకు గుప్కార్ కూటమి నిర్ణయం

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌‌కు సంబంధించిన అంశాలపై అక్కడి ప్రాంతీయ పార్టీలతో చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేస్తున్న అఖిల పక్ష సమావేశానికి హాజరుకావాలని పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) మంగళవారంనాడు నిర్ణయం తీసుకుంది. శ్రీనగర్‌లోని ఫరూక్ అబ్దుల్లా నివాసంలో కూటమి నేతలంతా మంగళవారం ఉదయం సమావేశం అయ్యారు. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఫరూక్ అబ్దుల్లా మీడియాకు తెలిపారు. ప్రధాని ఆహ్వానం మేరకు మెహబూబూ ముఫ్తీ, మొహమ్మది తరిగామి, తాను హాజరవుతున్నట్టు ఆయన చెప్పారు. తమ అజెండాను ప్రధాని, హోం మంత్రి ముందు ఉంచుతామని తెలిపారు.


ఆర్టికల్ 370పై కూటమి నేతలంతా కలిసి చర్చిస్తామని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ చెప్పారు. ''ఇది తప్పు, చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. అధికరణను పునరుద్ధరించేంత వరకూ ఈ ప్రాంతంలో శాంతిని తిరిగి తీసుకురాలేరు'' అని ఆమె అన్నారు. మీటింగ్ ఎజెండా ఏమిటనేది ప్రధాని తమకు చెప్పలేదని సీపీఎం నేత ఎంవై తరిగామి పేర్కొన్నారు. రాజ్యాంగం తమకు ప్రసాదించిన గ్యారెంటీలపై పునరాలోచించాల్సిందిగా ప్రధానిని కోరుతామని చెప్పారు.


జమ్మూకశ్మీర్‌లో 370 అధికరణను రద్దు చేసి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్‌ను విభజించిన తర్వాత ప్రధాన పార్టీలతో ప్రధాని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తుండటం ఇదే మొదటిసారి. ఈనెల 24న ఈ సమావేశం జరుగనుంది. కాగా, సమావేశంలో సింగిల్ పాయింట్ ఎజెండా మాత్రమే ఉంటుందని, ఎంపికైన ప్రజాప్రతినిధులకు సాధ్యమైనంత త్వరగా అధికారం అప్పగించడం, రాష్ట్రపతి పాలనకు ముగింపు పలకడం సమావేశం ఉద్దేశమని పీఎంఓ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Updated Date - 2021-06-22T19:45:37+05:30 IST