గురు రాజు

ABN , First Publish Date - 2022-08-11T05:30:00+05:30 IST

మంత్రాలయ మహాప్రభువైన శ్రీ రాఘవేంద్రస్వామిని గురు సార్వభౌమునిగా, గురురాజుగా ప్రస్తుతిస్తారు.

గురు రాజు

నేటి నుంచి శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధన


మంత్రాలయ మహాప్రభువైన శ్రీ రాఘవేంద్రస్వామిని గురు సార్వభౌమునిగా, గురురాజుగా ప్రస్తుతిస్తారు. ‘దేవుడంటే తిరుపతి తిమ్మప్ప, గురువంటే మంత్రాలయ రాఘవేంద్రులే’ అని నానుడి. ఈ ప్రశంసల వెనుక రాఘవేంద్రుల సత్య దీక్ష, తపోనిష్ఠ, శ్రీహరిపట్ల ఆయనకు ఉన్న అపారమైన భక్తి కారణాలు.


పరమాత్ముని పూజకు రోజూ పూలను తెచ్చి ఇచ్చే కర్మజ దేవత అయిన శంఖుకర్ణుడు... విష్ణుభక్తుడు, నరసింహావతార కరుణాపాత్రుడు అయిన ప్రహ్లాదునిగా శాపవశాత్తూ అవతరించాడు. ఆయన రెండవ అవతారం శ్రీవ్యాసరాజ యతివరేణ్యులు. తదుపరి అవతారం శ్రీ రాఘవేంద్రస్వామి. సర్వులకూ ఆదర్శమైన జీవనశైలి, గురువుల పట్ల చూపించిన భక్తి, కాల నియమ, ప్రవచన శైలి, గ్రంథరచనా కౌశలం, పరోపకార గుణం, తపస్సు, హరి భక్తి... వీటన్నిటి వల్లా శ్రీ రాఘవేంద్రులు గురుస్థానంలో నిలిచారు. ప్రజల్లో జ్ఞాన, భక్తి, వైరాగ్యాలను ప్రేరేపించి, ముక్తి మార్గం వైపు నడిపిస్తున్నారు.


శ్రీరాఘవేంద్రుల పూర్వాశ్రమ నామం వేంకటనాథాచార్యులు. ఆయన నుంచి నేర్చుకోవలసిన విషయాల్లో మొదటిది... పేదరికం పట్ల ఉండాల్సిన దృష్టి కోణం. ఆయనకు సరస్వతీబాయితో వివాహం అయింది. ఒక పుత్రుడు జన్మించాడు. ఆ సమయంలో ఆయన అత్యంత బీదరికాన్ని అనుభవిస్తున్నారు. కట్టుకోవడానికి సరైన వస్త్రాలు ఉండేవి కావు. ఎన్నో రోజులు ఆహారమే దొరికేది కాదు. దొరికిన ఆహారాన్ని నేల మీదే తినాల్సిన దుస్థితి. అయినా వేంకటనాథుని ముఖంపై దరహాసం మాయమయ్యేది కాదు. ఎనభై నాలుగు లక్షల జన్మల తరువాత లభించే మానవ జన్మకు లక్ష్యం... తత్త్వ జ్ఞాన సంపాదనే కానీ లౌకిక సంపద కాదనేది మనకు ఆయన చెప్పిన తొలి పాఠం. ఆ బీదరికమే ఆయన అంతర్ముఖులు కావడానికీ, గ్రంథాధ్యయనానికీ సానుకూలతను కల్పించింది. అదే సమయంలో... సామాన్య మానవుల కష్టాలను తెలుసుకొని, సహాయం చేయడానికి కావలసిన దయాగుణాన్ని పెంపొందించుకోవడానికి సోపానం అయింది. ఆయన రాఘవేంద్రులు అయ్యాక... అశక్తులు, పేదవారు చేసిన చిన్న సేవకైనా గొప్ప ఫలాన్ని అందించి ‘శ్రీ రాఘవేంద్ర గురవే నమో అత్యంత దయాళువే’ అనే కీర్తి పొందడానికి రాజమార్గం అయింది. ‘‘పేదరికం భగవంతుని పట్ల మన పరాధీనతను మనకు తెలియజేసి, అహంకారాన్ని మాయం చేస్తుంది. మనిషిని దేవుడికి దగ్గర చేస్తుంది. కాబట్టి పేదరికంలో హరిచింతన చేయండి. సిరి ఉన్నప్పుడు సంపదను సత్పాత్రులకు దానం చేసి, సిరి పతి (మహావిష్ణువు) కృపను పొందండి’’ అనేది ఆ గురురాజు ఆచరించి, మానవులకు బోధించారు.


ఆధ్యాత్మిక, లౌకిక విషయాలను సమన్వయం చేయడానికి కాల నియమన, సమయ నియంత్రణ నేటి యుగంలో అత్యంత ఆవశ్యకం. శ్రీ రాఘవేంద్రులు ఉదయాన్నే స్నానం ఆచరించి, ఆహ్నికాలను తీర్చుకొని, వేదాంత శాస్త్రాధ్యయనం, శిష్యులకు పాఠ్యబోధన, సంస్థాన పూజా లాంటివి నిత్యం ఆచరించేవారు. వాటితో పాటు... శ్రీ మాధ్వాచార్యులు, శ్రీ వ్యాసరాజుల భాష్యాలకు, గ్రంథాలకు ఖండార్థాలు రాయడమే కాకుండా, అనేక గ్రంథాలు రచించారు. వీటి వెనుక మహత్తరమైన, పరిపూర్ణమైన అధ్యయనం దాగి ఉంది. శ్రీ రాఘవేంద్రులు ఎన్ని రంగాలలో నిష్ణాతులనే విషయాన్ని ఆయన శిష్యులైన శ్రీ అప్పణాచార్యులు ‘శ్రీ రాఘవేంద్ర మంగళాష్టకం’లో ప్రస్తావిస్తూ ‘సాలంకారక కావ్య నాటకకళా కాణాదపాతంజల త్రయార్థ స్మృతి జైమినీయ కవిత సంగీత పారంగత’ అంటూ ప్రస్తుతించారు. నిత్య నైమిత్తిక కర్మలను ఆచరిస్తూ, ఇన్ని రంగాలలో నైపుణ్యం సాధించాలంటే... కాలం మీద ఎంత నియంత్రణ కావాలో స్వామి ఆదర్శంగా చేసి చూపించారు. 


శ్రీ రాఘవేంద్రులు తమ పరిపూర్ణ అధ్యయనానికీ, జ్ఞాన సంపదకూ దరిదాపుల్లో... అహంభావం అనే గుణానికి ఏమాత్రం చోటు ఇచ్చేవారు కాదు. తత్త్వజ్ఞానాన్ని అందించడానికి తప్పితే... సన్నిహితులతో జరిపే ఇష్టాగోష్టిలో ప్రదర్శన కోసం కానీ, ప్రతివాదులతో సాగించే వాదనలలో ఆధిపత్యం కోసం కానీ తన విద్వత్తును వ్యక్తపరిచేవారు కాదు. ‘విద్యాదదాతి వినయం’ అనే నానుడికి నిదర్శనంగా... శ్రీ మాధ్వాచార్యులవారి ‘అణుభాష్యా’నికి ‘తత్వమంజరి వ్యాఖ్యానం’ చేసిన సందర్భంలో ‘‘ఈ అణుభాష్యాన్ని వివరించడానికి నేను సమర్థుణ్ణి కాదు. అయితే శిష్యులకు దీని గొప్పతనం తెలియజేయడానికి స్వల్ప ప్రయత్నం చేస్తాను’’ అన్నారు. ఇక తను రాసిన ‘తంత్రదీపిక’ చివరిలో ‘‘సుధీంద్ర తీర్థ గురు సార్వభౌముల శిష్యుడైన రాఘవేంద్ర యతి ద్వారా శ్రీ హరి ప్రీతి కోసం ఈ ‘తంత్రదీపిక’ రచన జరిగింది’’ అని శ్రీ రాఘవేంద్రులు పేర్కొన్నారు. అది ఆయన వినయ సంపన్నతకు తార్కాణం. 


శ్రీ రాఘవేంద్రుల ప్రవచన కౌశలం వర్ణనాతీతం. ఆయన ప్రవచన అనుగ్రహం వల్ల సాధకులకు అజ్ఞానం, భ్రాంతి, సంశయం, అపస్మృతి, అవయవాల కంపన, మాటలలో తడబాటు మాయమవుతాయని అప్పణాచార్యులవారు తన స్తోత్రంలో పేర్కొన్నారు. ప్రసిద్ధమైన ఉడిపి క్షేత్రంలో శ్రీ రాఘవేంద్రులు పదిసార్లు చంద్రికా గ్రంథ ప్రవచనం చేయడం ఆయన ప్రవచన దీక్షకు చిన్న ఉదాహరణ. ఇక, ఆయనకు తన గురువులైన శ్రీ సుధీంద్రుల నుంచి లభించిన అనుగ్రహం అపారం. శ్రీ రాఘవేంద్రులకు వ్యాకరణ వాక్యార్థాల్లో ఉన్న విద్వత్తును మెచ్చుకున్న గురువు... ఆయన పూర్వాశ్రమంలోనే ‘మహాభాష్యం వేంకటనాథాచార్య’ అనే బిరుదు ఇచ్చారు. ఆయన రచించిన ‘పరిమళ’ అనే వ్యాఖ్యానానికి ముగ్ధులై... నిద్రలో ఉన్న వేంకటనాథునికి... తాను కప్పుకున్న శాలువాను కప్పారు. శాస్త్రపాఠం, ప్రవచనాలు, సంచారం, జపతపాలు, వీటితోపాటు భక్తానుగ్రహదీక్ష... ఇన్నిటి మధ్య సమయాన్ని సమన్వయపరచుకొని, యాభైకి పైగా గ్రంథ రచనలను శ్రీ రాఘవేంద్రులు చేశారు. సరళమైన శైలి, సందేహాలను పటాపంచలు చేసే వివరణ, ఆత్మ విశ్వాసాన్ని కలిగించే సంక్షిప్తత... ఇదీ ఆయన గ్రంథ శైలి. 


పశువుల కాపరి అయిన వెంకన్నను దివాన్‌ చేసినా, మామిడి పండ్ల రసంలో మునిగి మృతి చెందిన శిశువుకు ప్రాణదానం చేసినా, కన్యాన్వేషణకు బయలుదేరిన శిష్యునికి కేవలం మృత్తికను ఇచ్చి... సుఖమయ జీవితాన్ని ప్రసాదించిన... అది ఆయనకే చెల్లు. సమస్యల వలయంలో చిక్కుకొని తన దగ్గరకు వచ్చిన ఎవరినీ ఆయన ఉత్త చేతులతో పంపలేదు. ఈ ఆధునిక యుగంలో తనను నమ్మి వచ్చిన భక్తులకు రోగ నివారణ చేసినట్టు ఎన్నో అనుభవాలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. అందుకే ఆయనను‘ భవరోగవైద్యుడు’ అంటారు. 

‘గురువు’ అనే శబ్దానికే గురుత్త్వాన్నీ, యశస్సును తెచ్చిన శ్రీ రాఘవేంద్రులను ‘గురురాజు’ అని ప్రశంసించడంలో అతిశయోక్తి లేదు. 


పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ

భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే

రవీంద్రనాథ్‌, 94402 58841


Updated Date - 2022-08-11T05:30:00+05:30 IST