పీఠమంటే అర్చనలు, పూజలు కావు: స్వరూపానందేంద్ర సరస్వతి

ABN , First Publish Date - 2021-07-24T22:40:22+05:30 IST

విశాఖ శ్రీ శారదాపీఠానికి ఆస్తులు ముఖ్యం కాదన్నారు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి. అద్వైత వేదాంతమే పీఠానికి ఏకైక ఆస్తి అని స్పష్టం చేశారు.

పీఠమంటే అర్చనలు, పూజలు కావు: స్వరూపానందేంద్ర సరస్వతి

ఋషికేష్: విశాఖ శ్రీ శారదాపీఠానికి ఆస్తులు ముఖ్యం కాదన్నారు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి. అద్వైత వేదాంతమే పీఠానికి ఏకైక ఆస్తి అని స్పష్టం చేశారు. ఋషికేష్ వేదికగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర శనివారం చాతుర్మాస్య దీక్షను చేపట్టారు. గురు పూర్ణిమ సందర్భంగా వ్యాస పూజతో దీక్షకు అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ పీఠమంటే అర్చనలు, పూజలు కాదన్నారు. పీఠమంటే అధ్యయనం, అధ్యాపనమని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మత మార్పిడులపై ధర్మ పోరాటం సాగించిన ఏకైక పీఠం విశాఖ శారదాపీఠమని స్పష్టం చేశారు. అద్భుతమైన గురు సాంప్రదాయం విశాఖ శ్రీ శారదాపీఠం సొంతమని స్వరూపానందేంద్ర వివరించారు. తమ పీఠానికి గురుస్థానం కర్నాటకలోని హోళె నర్సిపూర్ అని తెలిపారు. మహా తపస్సంపన్నులైన బోధానందేంద్ర సరస్వతీ స్వామి విశాఖ శారదా పీఠానికి పరమేష్టి గురువులని వివరించారు. వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని అనుభవ రూపకంగా తెలిపిన సన్యాస చక్రవర్తిగా ఆదిశంకరాచార్యుల వారిని కీర్తించారు. స్వాత్మానందేంద్ర స్వామి మాట్లాడుతూ మానసిక శుద్ధికోసం గురువుల్ని ఆరాధించడం ఒక్కటే మార్గమని తెలిపారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్రులకు ఇది 25వ చాతుర్మాస్య దీక్షగా తెలిపారు. 


శాస్త్రోక్తంగా చాతుర్మాస్య దీక్షకు అంకురార్పణ


సనాతన హైందవ ధర్మంలో అత్యంత ప్రాచుర్యం పొందిన చాతుర్మాస్య దీక్షలకు విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీకారం చుట్టింది. ఋుషికేష్ లోని పీఠం ఆశ్రమంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఈ దీక్షలను చేపట్టారు. సెప్టెంబర్ 20వ తేదీ వరకు చాతుర్మాస్య దీక్ష కొనసాగుతుంది. ఉదయం గంగానదీ తీరంలో గంగమ్మ తల్లికి పూజలు చేశారు. ఆ తర్వాత గోమాతను పూజించారు. పూర్ణాహుతి అనంతరం వ్యాస పూజ నిర్వహించారు. ఈ పూజలో శ్రీకృష్ణుడు, వ్యాసుడు, దక్షిణామూర్తి సహా 45 మంది గురువులను ఆరాధిస్తూ అర్చన చేశారు. సకల మానవాళికి శుభం కలగాలని విశాఖ శ్రీ శారదాపీఠం ఏటా చాతుర్మాస దీక్షలను చేపడుతోంది.

Updated Date - 2021-07-24T22:40:22+05:30 IST