భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి

ABN , First Publish Date - 2020-07-06T10:06:14+05:30 IST

తాండూరు పట్టణంలో ఆదివారం గురుపౌర్ణమి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి

ఘనంగా సాయి సామూహిక వ్రతాలు 

ఉదయం నుంచి రాత్రి వరకు భజనలు, ప్రత్యేక పూజలు 

సాయి నామస్మరణతో మార్మోగిన ఆలయాలు


తాండూరు: తాండూరు పట్టణంలో ఆదివారం గురుపౌర్ణమి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కోకట్‌ సాయిబాబా ఆలయం, సీతారాంపేట్‌ సత్యసాయి ఆలయంతోపాటు సాయిబాబా ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. కోకట్‌లో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్యసాయి ఆలయంలో భక్తులు బాబా విగ్రహానికి అభిషేకం చేశారు. 


అజ్ఞానాన్ని తొలగించడానికే గురువు అవతరణ

వికారాబాద్‌ : అజ్ఞానం తొలగించి మానవుడిని సక్రమ మార్గంలో నడిపించడానికే గురువు అవతరించారని సత్యసాయి జ్ఞాన కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ హారతి ద్వారకానాథ్‌ అన్నారు. జ్ఞానకేంద్రం గంగారంలో గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్‌ సత్యనారాయణగౌడ్‌, న్యాయవాది గోపాల్‌, జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్త బందెప్పగౌడ్‌, విశ్వనాథం, పాపయ్య, విఠోభా, మల్లయ్య, బస్వరాజ్‌, మోహన్‌, సేవాదళ్‌ సభ్యులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. సామాజిక చైతన్యం కల్పించడం గురువు బాధ్యతని రాష్ర్టీయ స్వయం సేవక్‌ సంఘ్‌ విభాగ్‌ ప్రముఖ్‌ కూర జయదేవ్‌ అన్నారు. ఆదివారం వ్యాస పౌర్ణిమ సందర్భంగా సాహితీ సమితి గంగారం శాఖ ఆధ్వర్యంలో జూమ్‌ యాప్‌ ద్వారా నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు పునర్జన్మనిస్తారని కొనియాడారు. అబ్దుల్‌ కలాం వంటి గొప్ప శాస్త్రవేత్తలను దేశానికందించిన గురువులకు ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశంలో వీరకాంతం, కృష్ణగౌడ్‌, అనంతపద్మనాభరావు, పరమేష్‌, వెంకటయ్య, దివాకర్‌శాస్ర్తీ తదితరులు పాల్గొన్నారు.


ప్రత్యేక పూజలు.. అభిషేకాలు

మేడ్చల్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌/కీసర రూరల్‌/శామీర్‌పేట:   గురుపౌర్ణమి, గురు పూజోత్సవ కార్యక్రమాలను ఆలయాల్లో ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మేడ్చల్‌లోని సాయిబాబా ఆలయంలో భక్తులు బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబాకు అభిషేకాలు చేసి భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు చేశారు. మేడ్చల్‌లో ప్రసిద్ధిగాంచిన ఆలయం కావడంతో సాయంత్రం వరకు ఆలయంలో పూజా కార్యక్రమాలు కొనసాగించారు. సాయంత్రం బాబా ఊరేగింపు సేవ నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ పద్మజగన్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ వీర్లపల్లి రజితారాజమల్లారెడ్డి పాల్గొన్నారు. ఘట్‌కేసర్‌ మండలం ఎదులాబాద్‌లోని శ్రీసాయి నిలయంలో పూజారి కుమార్‌శర్మ సాయిబాబాకు పూజలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో భక్తులు లేకుండానే గురుపూజోత్సవ వేడుక నిర్వహించారు. అనంతరం భక్తులు మాస్కులు ధరించి బాబాను దర్శించుకున్నారు.


ఈ కార్యక్రమంలో కాలేరు సుదర్శనం, కాలేరు నవీన్‌, రమన్‌రాజు పాల్గొన్నారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిఽధిలోని సాయిబాబా ఆలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. నాగారం మున్సిపాలిటీ సత్యనారాయణ కాలనీలోని సాయిసత్యనారాయణ ఆలయంలో సాయినామస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శామీర్‌పేటలోని శ్రీ సాయిముక్తి దామంలోని శ్రీసాయిబాబాకు ఆలయ వ్యవస్థాపకుడు ముక్తనందస్వామి (నరేంద్రబాబు) ప్రత్యేక పూజలను చేశారు.  


మార్మోగిన సాయి నామస్మరణ

ఆమనగల్లు/శంషాబాద్‌ : పట్టణంలోని షిరిడీ సాయి ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆలయాన్ని పచ్చటి తోరణాలు, పుష్పాలతో అలంకరించారు. పట్టణంతో పాటు వివిధ గ్రామాలకు చెందిన సాయి భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు సాయి నామ స్మరణతో ఆలయం మార్మోగింది. ఆలయ నిర్వాహకులు బీఎ్‌సఎన్‌ మధుసూదన్‌శర్మ, రవికిరణ్‌, రాజమ్మ ఆధ్వర్యంలో సౌకర్యాలు కల్పించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వామి వారికి మేలుకొలుపు పాడారు. అనంతరం మూలవిరాట్‌ను పట్టువస్త్రాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. అర్చకులు సాయి సామూహిక వ్రతాలు చేపట్టారు. సుభ్రాతసేవ, కాగడ హారతి, సాయినాథుడి మంగళ స్నానం, సంస్థాన్‌ వారి హారతి, అర్చనలు, ధూప హారతి, పల్లకీ సేవ, శేజ హారతి కార్యక్రమాలు కనుల పండువగా కొనసాగాయి.


కార్యక్రమంలో ఆమనగల్లు మాజీ మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ గుర్రం కేశవులు, మాజీ సర్పంచ్‌ గుర్రం కరుణశ్రీ, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని ధర్మగిరి ధర్మసాయి ఆలయంతో పాటు పలు దేవాలయాల్లో ఆదివారం నిరాడంబరంగా గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భక్తులు మాస్కులు ధరించి భౌతికదూరం పాటిస్తు సాయిబాబాను దర్శించుకున్నారు.  

Updated Date - 2020-07-06T10:06:14+05:30 IST