గురు రాఘవేంద్ర నమో నమః

ABN , First Publish Date - 2022-08-12T05:39:47+05:30 IST

రాఘవేంద్ర నమో నమః అంటూ వేలాది మంది భక్తులు రాఘవేంద్రస్వామి సన్నిధిలో తరించారు.

గురు రాఘవేంద్ర నమో నమః
పూజలు చేస్తున్న పీఠాధిపతి

గజవాహనంపై దర్శనమిచ్చిన ప్రహ్లాదరాయలు
మూలరాములకు కనకాభిషేకం

మంత్రాలయం, ఆగస్టు 11: రాఘవేంద్ర నమో నమః అంటూ వేలాది మంది భక్తులు రాఘవేంద్రస్వామి సన్నిధిలో తరించారు. రాఘవేంద్రస్వామి 351వ సప్తరాత్రోత్సవాల్లో రెండో రోజు గురువారం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో మూల బృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు. మూలరాములకు కనకాభిషేకం చేసిన దృశ్యం భక్తులను కనువిందు చేసింది. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు గజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పల్లకిలో ఊరేగించి ఊంజల సేవ నిర్వహించారు. పీఠాధిపతి శాఖోత్సవం చేసి మహామంగళహారతులు ఇచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో మఠం ప్రాంగణం మార్మోగింది. బృందావనాన్ని బంగారు, వెండి, పట్టు వస్త్రాలు, గులాబి పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. రాఘవేంద్ర సర్కిల్‌లో విద్యుద్దీపాలతో రాఘవేంద్రస్వామిని అలంకరించిన దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత విద్వాన్‌ రాజా ఎస్‌ గిరిరాజాచార్‌, సుజీంద్రాచార్‌, గౌతమాచార్‌, ఆనంద తీర్థాచార్‌, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి, శ్రీపతిఆచార్‌, సీఆర్‌వోలు రవి కులకర్ణి, విజయేంద్రాచార్‌, జయతీర్థాచార్‌, ఈఈ సురేష్‌ కోనాపూర్‌, ఏఈ బద్రినాథ్‌, ద్వారపాలక అనంత స్వామి, ప్రకాష్‌ ఆచార్‌, బీఎం ఆనందరావు, మంత్రాలయం సీఐ భాస్కర్‌, ఎస్‌ఐ వేణుగోపాల్‌ రాజు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యం

గురువారం రాత్రి యోగీంద్ర కళా మండపంలో విజయవాడకు చెందిన భారతి నృత్య కేంద్రం చెందిన బృందం చేసిన కూచిపూడి నృత్యం భక్తులను ఆకట్టుకుంది. అదేవిధంగా బెంగళూరుకు చెందిన హనుమేష్‌ ఆచారిచే వేణువాయిద్యం, తిరుపతికి చెందిన విద్వాన్‌ సరస్వతి ప్రసాద్‌ చే అన్నమాచార్య సంకీర్తనలు అలరించాయి. పీఠాధిపతి వీరికి శేషవస్త్రం, మెమెంటో, నగదు ఇచ్చి సత్కరించారు.

Updated Date - 2022-08-12T05:39:47+05:30 IST