బీటెక్‌-బీఎడ్‌ వారూ టీజీటీ పోస్టులకు అర్హులే

ABN , First Publish Date - 2021-12-21T06:44:20+05:30 IST

బీటెక్‌ డిగ్రీ, బీఎడ్‌ పూర్తిచేసిన అభ్యర్థులు ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టులకు అర్హులేనని హైకోర్టు స్పష్టంచేసింది. డిగ్రీ స్థాయిలో బీటెక్‌ కోర్సు చేసినవారు టీజీటీ పోస్టులకు అనర్హులని పేర్కొంటూ తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌..

బీటెక్‌-బీఎడ్‌ వారూ టీజీటీ పోస్టులకు అర్హులే

  • ఏ డిగ్రీ చేసినవారైనా బీఎడ్‌ ఉంటే అర్హులేనన్న ఎన్‌సీటీఈ
  • గురుకుల రిక్రూట్‌మెంట్‌ బోర్డు పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు


హైదరాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): బీటెక్‌ డిగ్రీ, బీఎడ్‌ పూర్తిచేసిన అభ్యర్థులు ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టులకు అర్హులేనని హైకోర్టు స్పష్టంచేసింది. డిగ్రీ స్థాయిలో బీటెక్‌ కోర్సు చేసినవారు టీజీటీ పోస్టులకు అనర్హులని పేర్కొంటూ తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) దాఖలుచేసిన పిటిషన్‌ను హైకోర్టు ఇటీవల కొట్టేసింది. గురుకుల విద్యా సంస్థల్లో టీచర్‌ పోస్టుల భర్తీకి టీఆర్‌ఈఐఆర్‌బీ 2018లో నోటిఫికేషన్‌ ఇచ్చింది. అందులో బీటెక్‌ తర్వాత బీఎడ్‌ చేసిన అభ్యర్థులను అర్హులుగా గుర్తించలేదు. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం బీటెక్‌ చేసిన అభ్యర్థులు కూడా టీచర్‌ పోస్టులకు అర్హులేనని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన కె.షాలిని, ఖమ్మం జిల్లాకు చెందిన కె.సంజీవరావు తదితరులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.


బీటెక్‌ తర్వాత బీఎడ్‌ చేసిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్చిన నోటిఫికేషన్‌ను కొట్టేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్లను విచారించిన సింగిల్‌ జడ్జి ఽఽధర్మాసనం... బీటెక్‌ విద్యార్థులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును టీఆర్‌ఈఐఆర్‌బీ డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేసింది. చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఎన్‌సీటీఈ తరఫు న్యాయవాది సి.రమాకాంత్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ... ఏ డిగ్రీ చదివిన వారైనా, బీఎడ్‌ ఉంటే టీజీటీ పోస్టులకు అర్హులేనని తెలిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... బీటెక్‌, బీఎడ్‌ చేసినవారు టీచర్‌ పోస్టులకు అర్హులేనని ఎన్‌సీటీఈ స్పష్టంచేసినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆర్టీఐ దరఖాస్తుకు ఎన్‌సీటీఈ ఇచ్చిన సమాధానాన్ని ధర్మాసనం ముందు ఉంచారు. ఎన్‌సీటీఈ 2014లో విడుదల చేసిన మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... బీటెక్‌ విద్యార్థులకు ఊరట కల్పిస్తూ తీర్పు ఇచ్చింది.


ఎన్‌సీటీఈ నిబంధనలను పట్టించుకోని అధికారులు

టీచర్‌ పోస్టులకు అవసరమైన కనీస అర్హతలను పేర్కొంటూ 2014లోనే ఎన్‌సీటీఈ నిబంధనలను జారీచేసింది. బీటెక్‌ డిగ్రీ చేసిన బీఎడ్‌ అభ్యర్థులు టీచర్‌ పోస్టులకు అర్హులేనని ఆ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అధికారులు వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. అంతకుముందు 2010లో ఎన్‌సీటీఈ జారీచేసిన గైడ్‌లైన్స్‌ను అనుసరించి 2018లో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అయితే 2014లో జారీచేసిన నిబంధనలు ఉండగా... 2010 నాటి మార్గదర్శకాలను ఎలా పరిగణనలోకి తీసుకుంటారని అభ్యర్థులు హైకోర్టు ఎదుట వాదనలు వినిపించారు. అభ్యర్థుల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు... నోటిఫికేషన్‌ ఇచ్చింది 2018లో కాబట్టి 2014లో ఇచ్చిన నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. బీఎడ్‌ చేసిన బీటెక్‌ విద్యార్థులను కూడా టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలని ఆదేశించింది.

Updated Date - 2021-12-21T06:44:20+05:30 IST