గురుకులం.. దుర్భరం

ABN , First Publish Date - 2022-09-21T05:21:01+05:30 IST

గురుకుల పాఠశాల అనగానే ఆహ్లాదకరమైన వాతావరణం.. మంచి చదువు.. పౌష్టికాహారం.. అనుకుంటారు.

గురుకులం.. దుర్భరం
హాస్టల్‌లో భోజనం చేస్తున్న విద్యార్థులు

గురుకులం.. దుర్భరం

నెల రోజులుగా నీరు బంద్‌

టాయిలెట్‌ ఆవరణలో విసర్జన

అనారోగ్యకరంగా వాతావరణం

నాసిరకం భోజనంతో ఇబ్బందులు

పర్యవేక్షణ మరిచిన ఉన్నతాధికారులు


గురుకుల పాఠశాల అనగానే ఆహ్లాదకరమైన వాతావరణం.. మంచి చదువు.. పౌష్టికాహారం.. అనుకుంటారు. అక్కడ తమ బిడ్డలను చేర్పిస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటారు. వ్యవసాయం, కూలి, వృత్తి పనులతో దుర్భర జీవితం గడిపే తల్లిదండ్రులు.. ఎన్నెన్నో ఆశలతో గురుకులాల్లో చేర్పిస్తుంటారు. కానీ కణేకల్లు క్రాస్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరిస్థితిని చూస్తేమాత్రం వాటిపై అభిప్రాయమే మారుతుంది. ఇక్కడి విద్యార్థులు సమస్యల నడుమ నరకం చూస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని బయటకు చెబితే ఎలాంటి ఇబ్బందులు ఎదురౌతాయోనని విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తాము హాస్టల్‌లో ఉండలేమని, పరిస్థితులు బాగాలేవని కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  - కణేకల్లు


అధ్వాన్నంగా భోజనం 

పాఠశాలలో విద్యార్థులకు నాసిరకం భోజనం అందిస్తున్నారు. అన్నం, సాంబారుతో సర్దుకుపోతున్నారు. ఉన్నతాధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో సిబ్బంది ఆడిందే ఆట... పాడిందే పాటగా తయారైంది. ప్రిన్సిపాల్‌ కూడా పట్టించుకోడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పాఠశాలలో విషయాలను బయటకు చేరవేస్తే ఇబ్బందులు తప్పవని విద్యార్థులను సిబ్బంది హెచ్చరిస్తున్నారని సమాచారం. ప్రిన్సిపాల్‌ వ్యవహారశైలి సరిగా లేదని, ప్రశ్నిస్తే తమ బిడ్డలకు ఇబ్బందులు ఎదురవుతాయని మిన్నకుండిపోతున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, గురుకుల పాఠశాలలో పరిస్థితులను చక్కదిద్దాలని కోరుతున్నారు. 


నీటి కష్టం

- కణేకల్లు మండల కేంద్రానికి 8 కి.మీ. దూరంలో ఉన్న గురుకుల పాఠశాలలో 6వ తరగతి విద్యార్థుల నుంచి ఇంటర్‌ వరకూ చదువు, హాస్టల్‌ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. సుమారు 629 మంది విద్యార్థులు ఇక్కడ ఉండి చదువుకుంటున్నారు. శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం పైపులైన ద్వారా గురుకులానికి నీరు సరఫరా అవుతోంది. కానీ పైప్‌లైన లీకేజీ కారణంగా నెల రోజుల నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు టాయిలెట్‌కు వెళ్లాలన్నా చెంబుడు నీరు కరువైంది. 


- ఆర్డీటీ సహకారంతో రోజూ ఒక ట్యాంకర్‌ నీటిని తెప్పిస్తున్నారు. ఆ నీటిని 629 మంది విద్యార్థులు సర్దుకోవాల్సి వస్తోంది. టాయిలెట్లలో నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు బాటిళ్లలో నీటిని నింపుకుని ఆరుబయటకు వెళుతున్నారు. రాత్రి వేళల్లో బయటకు వెళ్లేందుకు భయపడి.. మరుగుదొడ్ల ఆవరణలోనే మలవిసర్జన చేస్తున్నారు. దీంతో తీవ్ర అపరిశుభ్రత నెలకొంది. విద్యార్థులు దుర్వాసనను భరించలేక అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు రోజూ ముఖం కడుక్కుని కాలం వెళ్లదీస్తున్నారు. వారానికి ఒకసారి వంతులవారిగా స్నానం చేస్తున్నారు. ఒక్కోసారి నీటికోసం విద్యార్థులు గొడవ పడుతున్నారు. 


ఉన్నతాధికారులకు నివేదించాం

గురుకుల పాఠశాల నీటి సమస్యపై ఉన్నతాధికారులకు నివేదించాం. ఆర్డీటీ సహకారంతో రోజుకు ఒక ట్యాంకర్‌ నీటిని తెప్పిస్తున్నాం. పంచాయతీ నీటిని సరఫరా చేయాలని అధికారులను అడిగాం. త్వరలోనే నీటి సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 

 - ప్రసన్నకుమారి, ప్రిన్సిపాల్‌ 

Updated Date - 2022-09-21T05:21:01+05:30 IST