గురజాడ రచనలు అజరామరం

ABN , First Publish Date - 2020-11-30T04:50:52+05:30 IST

‘దేశమంటే మట్టి కాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌’ అంటూ దేశభక్తి గీతాన్ని, సమాజాన్ని మేల్కొలిపే కన్యాశుల్కం వంటి నాటకాన్ని తెలుగుజాతికి అందించిన మహాకవి గురజాడ అప్పారావు.. నేటి రచయితలకు మార్గదర్శకునిగా, దిక్సూచిలా నిలిచారు. ఆధునిక సాహిత్యానికి పితామహునిగా గురజాడ పేరొందారు.

గురజాడ రచనలు అజరామరం

నేడు వర్ధంతి 

(విజయనగరం రూరల్‌) 

‘దేశమంటే మట్టి కాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌’ అంటూ దేశభక్తి గీతాన్ని, సమాజాన్ని మేల్కొలిపే కన్యాశుల్కం వంటి నాటకాన్ని తెలుగుజాతికి అందించిన మహాకవి గురజాడ అప్పారావు.. నేటి రచయితలకు మార్గదర్శకునిగా, దిక్సూచిలా నిలిచారు. ఆధునిక సాహిత్యానికి పితామహునిగా గురజాడ పేరొందారు. ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి రచన సమాజాన్ని జాగృతం చేసింది. కన్యాశుల్కం రచించి 150 ఏళ్లు దాటినా.. నేటికీ ఆ రచన, అందులోని పాత్రఽధారులు మన కళ్లముందు కదలాడుతూ ఉంటారు. సామాజిక దురాచారంపై కన్యాశుల్కం ద్వారా గురజాడ చేసిన పోరాటం అజరామరం.. నేటికీ కన్యాశుల్కం నాటకం ప్రదర్శితమౌతోందంటే.. ప్రేక్షకులు క్షణాల్లో అక్కడికి చేరిపోతారు.. 150 ఎళ్ల కిందటి కన్యాశుల్కంలోని పాత్రలు, నేటి సమాజంలో కూడా మనకు కన్పిస్తుంటాయి.. భవిష్యతను ఆలోచించి ముందే ఆయన ఈ రచన చేశారు.. ఏటా ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను విజయనగరంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమాలను కుదించారు.

గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో 

గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఏటా నవంబరు 30న గురజాడ సాహితీ చైతన్యోత్సవం నిర్వహిస్తూ వస్తున్నారు.  అదే రోజు ఓ విశిష్ట వ్యక్తిని గురజాడ పురస్కారంతో గౌరవిస్తున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో భారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించకుండా ఈ ఏడాది కొద్ది మందితో మాత్రమే తలపెట్టారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు గురజాడ నివాసంలో జ్యోతి ప్రజ్వలన చేసి, గురజాడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించనున్నారు. సాహితీవేత్త డాక్టరు ఏ.గోపాలరావు రచించిన ‘గురుజాడల గురజాడ’ గ్రంథం అవిష్కరణ జరగనుంది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టరు హరిజవహర్‌లాల్‌, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మీ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధులు పీవీ నర్సింహారాజు, కాపుగంటి ప్రకాష్‌, డాక్టరు ఏ.గోపాలరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి.


Updated Date - 2020-11-30T04:50:52+05:30 IST