గుట్కా గుట్టు రట్టు

ABN , First Publish Date - 2021-06-15T05:46:06+05:30 IST

గుట్కా గుట్టును గుంటూరు రూరల్‌ పోలీసులు చేధించారు.

గుట్కా గుట్టు రట్టు
గుట్కాలను పరిశీలిస్తున్న రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ

తయారీదారులు, పంపిణీదారులు, విక్రేతల గుర్తింపు

సూత్రధారి సహా ఐదుగురు అరెస్టు

సుమారు రూ.కోటి ఖరీదైన గుట్కాలు సీజ్‌

 

గుంటూరు, జూన్‌ 14: గుట్కా గుట్టును గుంటూరు రూరల్‌ పోలీసులు చేధించారు. గుట్కాలు తయారు చేస్తున్న రాజస్థాన్‌లోని మిరాజ్‌ కంపెనీని అక్కడి నుంచి వివిధ రాష్ర్టాలకు పంపిణీ చేస్తున్న బెంగళూరుకు చెందిన శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర ఎంటర్‌ ప్రైజెస్‌ సంస్థను, అక్కడి నుంచి సబ్‌ డీలర్లకు పంపిణీ చేస్తున్న ప్రస్తుతం గుంటూరు నగర శివారు గోరంట్లలో నివాసం ఉంటున్న బెంగళూరుకు చెందిన సిద్ధప్ప ఆంజనేయ తెలగార్‌ అలియాస్‌ సిద్ధును పోలీసులు గుర్తించారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి సుమారు రూ.కోటి విలువైన నిషేధిత గుట్కాలను సీజ్‌ చేశారు. సోమవారం పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ నిందితులను మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. ప్రధాన నిందితుడు సిద్ధుతోపాటు చిలకలూరిపేటకు చెందిన చికోటి రాజు, ఒంగోలుకు చెందిన కొప్పరపు మణికంఠ, శావల్యాపురం మండలం వేల్పూరుకు చెందిన పారా లింగారావు, ప్రకాశం జిల్లా దర్శికి చెందిన కొనకళ్ల ఆంజనేయులులను అరెస్టు చేసినట్టు రూరల్‌ ఎస్పీ  తెలిపారు.

 ఈ ముఠా గుట్కాలను రాజస్థాన్‌లోని నడ్వార్‌లో తయారవుతున్న మిరాజ్‌ కంపెనీ నుంచి దిగుమతి చేసుకుంటుందన్నారు. సిద్ధప్ప బెంగళూరుకు చెందిన శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర ఎంటర్‌ప్రైజెస్‌ అనే డిస్ర్టిబ్యూటర్‌కు నగదు పంపుతాడని ఆ కంపెనీ గుమస్తా సుధాకర్‌ గుట్కాలను పార్శిల్‌ సర్వీసు ద్వారా సిద్ధు చెప్పిన అడ్రసులకు నేరుగా పంపిస్తాడన్నారు. చిలకలూరిపేటకు చెందిన కృష్ణమూర్తి ట్రేడర్స్‌ నిర్వాహకుడు చికోటి రాజు, పసుమర్తి శివసత్యనారాయణ, తెనాలికి చెందిన లలిత ట్రేడర్స్‌ నిర్వాహకుడు రాజు, నరసరావుపేటలోని శివసాయి ట్రేడర్స్‌ నిర్వాహకుడు నోముల మల్లికార్జునలు డీలర్లుగా వ్యవహరిస్తుంటారు. వీరు జిల్లాల వారీగా డిస్ర్టిబ్యూటర్లను ఏర్పాటు చేసుకుని వారికి సరుకులు పంపిస్తున్నారన్నారు. ఒంగోలుకు చెందిన శ్రీ సాయి శ్రీనివాస ట్రేడర్స్‌ నిర్వాహకుడు కొప్పరపు మణికంఠ, గుడివాడకు చెందిన సాయి గణపతి ఏజెన్సీ నిర్వాహకుడు సాంబశివరావు, రాజమండ్రికి చెందిన ధనలక్ష్మి ఏజెన్సీ నిర్వాహకుడు సుబ్బారావు, కర్నూలుకు చెందిన సాహెబ్‌ ట్రేడర్స్‌ నిర్వాహకుడు షేక్‌ అమీర్‌సాహెబ్‌, శ్రీ అభయాంజనేయ ఏజెన్సీ నిర్వాహకుడు వెంకటేష్‌, కడపకు చెందిన గాయత్రి ఎంటర్‌ ప్రైజెస్‌ నిర్వాహకుడు శ్రీనివాసులు, కనిగిరికి చెందిన శ్రీనివాస ట్రేడర్స్‌ నిర్వాహకుడు రాజశేఖరరెడ్డి, విజయవాడకు చెందిన చంద్రిక జనరల్‌ స్టోర్స్‌ నిర్వాహకుడు వెంకటరమణారెడ్డి, బంటి, శ్రీనివాసరెడ్డి, ఏలూరులోని శ్రీకృష్ణ ఏజెన్సీ నిర్వాహకుడు రమేష్‌ తదితరులు రాష్ట్రవ్యాప్తంగా తమకు అందుబాటులో ఉన్న జిల్లాలకు గుట్కాలు పంపిణీ చేస్తున్నారన్నారు. నరసరావుపేట, తెనాలి డీఎస్పీలు విజయభాస్కరరావు, శ్రవంతిరాయ్‌ ఆధ్వర్యంలో చిలకలూరిపేట టౌన్‌, రూరల్‌ సీఐలు బిలాలుద్దీన్‌, సుబ్బారావు, నరసరావుపేట రూరల్‌ సీఐ అచ్చయ్య, తెనాలి రూరల్‌ సీఐ అశోక్‌కుమార్‌, వినుకొండ టౌన్‌, రూరల్‌ సీఐలు సురేష్‌బాబు, సుబ్బారావులతోపాటు ఎస్‌ఐలు, సిబ్బంది దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున ఆయా గుట్కాలను సీజ్‌ చేశారన్నారు. చిలకలూరిపేట టౌన్‌ ఎస్‌ఐ అజయ్‌బాబు ఈ మొత్తం ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించారని అన్నారు. చిలకలూరిపేట పోలీసులు రూ.63,20,000 ఖరీదైన 40 బ్యాగ్‌ల గుట్కాలు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారన్నారు.  పసుమర్తి శివసత్యనారాయణ, తెనాలికి చెందిన సుధాకర్‌, మరో ఆరుగురు పరారీలో ఉన్నారన్నారు. తెనాలి వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రూ.11 లక్షల ఖరీదైన గుట్కాలను సీజ్‌ చేశామన్నారు. తెనాలిలోని విజయలక్ష్మి ట్రేడర్స్‌ నిర్వాహకుడు తాడేపల్లి రామకృష్ణ, గుంటూరు శివారు రెడ్డిపాలేనికి చెందిన వెంకటేశ్వర ఏజెన్సీ నిర్వాహకుడు కుందూరు రామకృష్ణలను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. అలాగే చిలకలూరిపేట రూరల్‌ పోలీసులు రూ.6,32,000 ఖరీదైన గుట్కాలు సీజ్‌ చేశారని, ఈ కేసులో ఒంగోలుకు చెందిన మణికంఠను అరెస్టు చేయగా దర్రు ఆంజనేయులు, చీవెల సుబ్రహ్మణ్యం, నోముల మణికంఠలు పరారీలో ఉన్నారన్నారు. వినుకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 226 బ్యాగ్‌లకు సంబంధించి రూ.11,20,000 ఖరీదైన గుట్కాలను సీజ్‌ చేశామని, అంబికానగర్‌కు చెందిన పర్చూరి చిన కాశీ విశ్వనాథం పరారీలో ఉన్నాడన్నారు. శావల్యాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రూ.6 లక్షల ఖరీదైన గుట్కాలను సీజ్‌ చేశామని, ఈ కేసులో పారా లింగారావును, కొనకళ్ల ఆంజనేయులును అరెస్టు చేయటం జరిగిందన్నారు. రూరల్‌ జిల్లా పరిధిలో ఎక్కడైనా ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే రూరల్‌ జిల్లా వాట్సాప్‌ హెల్ప్‌లైన్‌ నెంబరు 8866268899కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ ముఠాను అరెస్టు చేసిన డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలను రూరల్‌ ఎస్పీ అభినందించి రివార్డు ప్రకటించారు.



 

Updated Date - 2021-06-15T05:46:06+05:30 IST