గుట్టుగా గుట్టకు ఎసరు!

ABN , First Publish Date - 2021-05-08T04:52:00+05:30 IST

దాదాపు తొమ్మిదిన్నర దశాబ్ధాల కిందట నిజాం నవాబు నిర్మించిన మధ్యతరహాకు చెందిన వైరా రిజర్వాయర్‌ భద్రత కొంతమంది స్వార్థపరుల కక్కుర్తితో ప్రమాదపు అంచుల్లోకి నెట్టివేస్తుంది.

గుట్టుగా గుట్టకు ఎసరు!
అలుగులోతట్టులో గ్రావెల్‌ తవ్వకాలు జరిపిన చోటు

 ప్రమాదపు అంచుల్లో వైరా రిజర్వాయర్‌ భద్రత

వైరా, మే 7: దాదాపు తొమ్మిదిన్నర దశాబ్ధాల కిందట నిజాం నవాబు నిర్మించిన మధ్యతరహాకు చెందిన వైరా రిజర్వాయర్‌ భద్రత కొంతమంది స్వార్థపరుల కక్కుర్తితో ప్రమాదపు అంచుల్లోకి నెట్టివేస్తుంది. అర్థరాత్రుల వేళ గుట్టుచప్పుడు కాకుండా వైరా రిజర్వాయర్‌ గుట్టలనే మట్టి తవ్వకాలకు క్వారీగా మార్చిన ఓ కాంట్రాక్టర్‌ ఉదంతమిది. నీటిపారుదలశాఖ అధికారులు కరోనా బారీనపడి విధులు నిర్వహించలేని పరిస్థితుల్లో సిబ్బంది యాసంగి సాగుకు నీరు క్రమబద్దీకరణ విధుల్లో తలమునకలై ఉన్న సమయంలో సందట్లో సడేమియాగా కాంట్రాక్టర్‌ అర్థరాత్రుల వేళ గుట్టుగా గుట్టను తవ్వి గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టారు. ఫలితంగా వైరా రిజర్వాయర్‌ పటిష్టత ప్రమాదపు అంచుల్లోకి నెట్టివేయబడుతుందని రైతులు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వైరా రిజర్వాయర్‌ ఆనకట్టను మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేస్తున్న కాంట్రాక్టర్‌ రిజర్వాయర్‌ గుట్టలనే క్వారీగా ఏర్పాటుచేసుకొని అక్కడి గ్రావెల్‌ను ఆనకట్టపై పోశారు. ఇతర ప్రాంతాల నుంచి నాణ్యమైన గ్రావెల్‌ను ఆనకట్టకు తోలాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా రిజర్వాయర్‌ గుట్టల మట్టినే ఆనకట్టకు తోలారు. వైరా రిజర్వాయర్‌కు 2010-11కు ముందు నాలుగు అలుగులు ఉండేవి. ఈ నాలుగు అలుగులు కూడా గుట్టల మధ్యనే నిర్మించారు. అలుగుకు అలుగుకు మధ్య గుట్టలు సపోర్టింగ్‌గా ఉన్నాయి. అయితే 2005లో వచ్చిన వరదల తర్వాత కోట్లాదిరూపాయలు వెచ్చించి రిజర్వాయర్‌ను కాపాడుకొనే దానిలో భాగంగా ఐదో అలుగును నిర్మించారు. 

అయితే ఇప్పుడు మొదటి, రెండు అలుగులకు సపోర్టింగ్‌గా ఉన్న గుట్ట ముందుభాగాన్ని కాంట్రాక్టర్‌ క్వారీగా మార్చాడు. గుట్ట మొత్తాన్ని తవ్వి ఆగ్రావెల్‌ను మినీ ట్యాంక్‌బండ్‌ అభివృద్ధిలో భాగంగా ఆనకట్ట పైభాగంలో పోశారు. ఈ తతంగం అంతా కొద్దిరోజుల కిందట అర్థరాత్రుల వేళ గుట్టుగా చేశారు. 


గుట్టను తవ్వి గ్రావెల్‌గా పోసి


నాలుగైదురోజులపాటు రాత్రులవేళ గుట్టుగా గుట్టను తవ్వి గ్రావెల్‌ను ఆనకట్టపై పోసి రోలర్‌తో చదును చేశారు. ఆనకట్ట బాగుపడుతున్నందుకు సంతోషించాలో లేక రిజర్వాయర్‌కు అత్యంత కీలకమైన గుట్టలను ధ్వంసం చేసి ఆమట్టినే ఇక్కడ పోసినందుకు ఏంచేయాలో పాలుపోని దయనీయ స్థితిలో స్థానికులు, రైతులు ఉన్నారు. రిజర్వాయర్‌ అలుగుల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి తవ్వకాలు జరుపకూడదు. గతంలో అలుగులకు కిలోమీటర్‌ దూరంలో కోరండం రాళ్ల తవ్వకాలు చేపట్టినప్పుడు కూడా వాటిని బంద్‌ చేయించారు. అలాంటిది రెండు అలుగులకు మధ్య ఉన్న గుట్టను ఏకంగా పది అడుగుల లోతు తవ్వకాలు జరిపి క్వారీ చేశారు. ఈ గుట్ట పటిష్టత దెబ్బతింటే రిజర్వాయర్‌ ఉనికే అత్యంత ప్రమాదం. అంతేకాకుండా అలుగుల లోతట్టులో కూడా మట్టి తవ్వకాలు చేశారు. ఆప్రాంతాన్ని కూడా క్వారీగా మార్చారు. అలుగుల మధ్య ఉన్న ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లివచ్చే దారిలోనే ఈ తవ్వకాలు జరిగాయి. వెంటనే సదరు ప్రమాదకరంగా క్వారీ పెట్టిన గుట్ట మొత్తాన్ని పటిష్టపర్చేవిధంగా అధికారులు ఆదేశించాలని రైతులు కోరుతున్నారు. లేనట్లయితే రిజర్వాయర్‌ ఉనికికే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఫ ఈ విషయమై నీటిపారుదలశాఖ డీఈ పి.శ్రీనివా్‌సను వివరణ కోరగా తాను అనారోగ్యకారణంగా అందుబాటులో లేనని సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.


Updated Date - 2021-05-08T04:52:00+05:30 IST