కాయను పండుగా మార్చే ప్రక్రియ గుట్టు రట్టు

ABN , First Publish Date - 2022-09-30T08:51:00+05:30 IST

అరటి, మామిడి వంటివాటిని పండ్లుగా మార్చడానికి ఇథలీన్‌ను వాడడం సాధారణమే! అయితే..

కాయను పండుగా మార్చే ప్రక్రియ గుట్టు రట్టు

ఢిల్లీ యూనివర్సిటీ, హెచ్‌సీయూ సంయుక్త పరిశోధన

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అరటి, మామిడి వంటివాటిని పండ్లుగా మార్చడానికి ఇథలీన్‌ను వాడడం సాధారణమే! అయితే.. ఈ ప్రక్రియ గురించి పూర్తిగా తెలుసుకుంటే కాయలు పక్వానికి వచ్చే సమయాన్ని పెంచడం, తగ్గించడం వంటివి చేయొచ్చు. అవి ఎక్కువ కాలం నిల్వ ఉండేలా కూడా చేయొచ్చు. అందుకే ఈ ప్రక్రియ గుట్టు రట్టు చేసేందుకు ఢిల్లీ యూనివర్సిటీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిశోధకులు సంయుక్త ప్రయోగాలు చేశారు. రిసెర్చ్‌ కోసం వారు టొమాటాలోను ఎంచుకున్నారు. ఈ ప్రక్రియలో ‘ఎస్‌ఐఈఆర్‌ఎఫ్‌ డీ7’ అనే రైపెనింగ్‌ ఇండ్యూస్డ్‌ ఈఆర్‌ఎఫ్‌ జీన్‌ చాలా కీలకంగా పనిచేస్తున్నట్టు తాము గుర్తించామని హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రాహుల్‌ కుమార్‌ తెలిపారు. ఈ జన్యువును ఉత్పరివర్తనం చేయడం ద్వారా కాయలు పక్వానికి వచ్చే సమయాన్ని పెంచడం, తగ్గించడం చేయవచ్చన్నారు. పరిశోధనల్లో భాగంగా టొమాటోల్లోని ఈ జన్యువును ప్రేరేపించగా.. వాటి రంగుతోపాటు పోషక విలువలు పెరిగిననట్లుగా గమనించామన్నారు. తమ పరిశోధన ఫలితాలు అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ ప్లాంట్‌ బయాలజిస్టులు నిర్వహించే ప్లాంట్‌ సోషియాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయని తెలిపారు. ఈ పరిశోధనలో యూనిర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ ప్రొఫెసర్‌ అరుణ్‌ కే శర్మ, పీహెచ్‌డీ విద్యార్థిని ప్రియా గంభీర్‌, విజేందర్‌ సింగ్‌, డాక్టర్‌ అద్వైత పరిదా, ఉత్కర్ష్‌ రఘువంశీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-30T08:51:00+05:30 IST