కానీ.. అందరికీ తెలుసు

Published: Thu, 26 May 2022 00:47:51 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 కానీ.. అందరికీ తెలుసుకొడికొండ సమీపంలో స్వాధీనం చేసుకున్న వాహనం, గుట్కా పదార్థాలు(ఫైల్‌)

గుట్టుగా గుట్కా!

గుంతకల్లు కేంద్రంగా దందా

రూ.కోట్లు గడిస్తున్న వ్యాపారులు

ముడుపులు ఇచ్చి అక్రమ రవాణా

కొందరు పోలీసులు, అధికారులకు వాటా


- ఆరు నెలల క్రితం గుంతకల్లు డివిజన పరిధిలో పనిచేసే ఓ స్టేషన పోలీసులు పెద్ద ఎత్తున గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక ఓ రైల్వే ఉద్యోగి ఉన్నట్లు తేలింది. అతనితో ఓ ఎస్‌ఐ కుమ్మక్కై, రూ.లక్షల్లో ముడుపులు పుచ్చుకుని వదిలేశారని సమాచారం. 

- జిల్లాలోకి అక్రమంగా గుట్కా పదార్థాలను తరలిస్తున్న వాహనాన్ని నెలరోజుల క్రితం కొడికొండ ప్రాంతంలో సెబ్‌ పోలీసులు పట్టుకున్నారు. రూ.19,37,396 విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.


గుట్కా వ్యాపారం జిల్లాలో యథేచ్ఛగా సాగుతోందని, దీనికి కొందరు ఉద్యోగులు, పోలీసు అధికారులు సహకరిస్తున్నారని చెప్పడానికి ఈ రెండు ఘటనలు తార్కాణం. పట్టుబడుతున్నది కొంతే. కళ్లుగప్పి, ముడుపులు ఇచ్చి రూ.లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చిన్న చిన్న బంకులలో వీటిని విక్రయిస్తూనే ఉన్నారు. కొందరు వ్యాపారులు గుట్కా, పొగాకు ఉత్పత్తుల రవాణా, విక్రయాలతో రూ.కోట్లు గడించారు. నిషేధం విధించిన తరువాత వారిలో కొందరు వ్యాపారాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. అక్రమ దందా లాభసాటిగా ఉండటంతో ఇంకొందరు కొత్తగా రంగంలోకి దిగారు. 

- అనంతపురం క్రైం


ఎక్కడైనా దొరుకుతుంది..

గుట్కా పదార్థాలు, కొన్ని పొగాకు ఉత్పత్తులపై ప్రభుత్వం నిషేధం విధించింది. కానీ విక్రయాలు, రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. అనంతపురం పాతూరులో కొన్ని దుకాణాల్లో ప్యాకెట్ల రూపంలో భారీగా లభిస్తోంది. కళ్యాణదుర్గం, బళ్లారి బైపాస్‌ పరిసర ప్రాంతాల్లో అమ్మకాలు ఎక్కువగా సాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో గుట్కా వినియోగించే ఇతర రాషా్ట్రలకు చెందిన కూలీలు ఎక్కువగా ఉంటారు. మిగిలిన ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి. అనంతపురం నగరం తరువాత గుంతకల్లులో ఎక్కువగా విక్రయాలు జరుగుతాయనేది ఒక అంచనా. తాడిపత్రి పట్టణంలోనూ కూలీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతంలోనూ గుట్కా ప్యాకెట్ల విక్రయాలు భారీగానే జరుగుతుంటాయి. కళ్యాణదుర్గం, రాయదుర్గంతో పాటు అన్ని మండల కేంద్రాల్లోనూ గుట్కా అమ్మకాలు సాగుతున్నాయి. పోలీసులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి, గుట్కా ప్యాకెట్లు దొరికినట్లు చెబుతున్నారు. కొన్ని పోలీస్‌ స్టేషన్లలో గత ఆరు నెలల వ్యవధిలో ఒక్క గుట్కా కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. 


రూ.కోట్లలో దందా...

 రాష్ట్రంలో గుట్కా నిషేధిత పదార్థం. దీన్ని రవాణా చేయడం, నిల్వ ఉంచడం, విక్రయించడం.. అన్నీ నేరాలే. అయినా, చాపకింద నీరులా దందా సాగుతోంది. కొందరు తెలిసిన వారికే ఇస్తుంటే.. మరికొందరు ఎవరికైనా ఇచ్చేస్తున్నారు. గుట్కా, పొగాకు ఉత్పత్తులు జిల్లా కేంద్రంలోనే కాదు, అన్ని పట్టణాలు, మండల కేంద్రాలకు విస్తరించింది. గుట్కా వినియోగదారులలో దిన కూలీల నుంచి సంపన్నులవరకూ అన్ని వర్గాలవారూ ఉన్నారు. దీంతో ఈ వ్యాపారం లాభసాటిగా మారింది. ప్రతి నెలా రూ.కోట్లలో టర్నోవర్‌ అవుతోంది. దందా చేసేవారు పన్నుల శాఖలోని కొందరు అధికారులకు, పోలీసులకు  భారీగా ముడుపులు ఇస్తున్నారని సమాచారం.


గుంతకల్లులో కీలక వ్యాపారి

గుట్కా పదార్థాలు, పొగాకు ఉత్పత్పులు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు గుంతకల్లు నుంచే  ఎక్కువగా సరఫరా అవుతుంటాయి. ఇక్కడ ఓ వ్యాపారి కీలకంగా వ్యవహరిస్తున్నాడు. గతంలో నిత్యం వాహనాల్లో భారీగా సరుకు తెప్పించేవాడట. నిషేధం ఉండటంతో ఇప్పుడు కాస్త జోరు తగ్గించినా, డిమాండ్‌ మేరకు లారీల్లో తెప్పించేస్తున్నాడు. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు నగరాల నుంచి ఎక్కువగా తెప్పిస్తున్నట్లు సమాచారం. వాటిపై నిషేధం ఉండటంతో పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీంతో పన్నుల శాఖ అధికారులు అటువైపు చూడరు. వారిని దారితోకి తెచ్చుకున్నారని, గుంతకల్లులో ఓ కమర్షియల్‌ టాక్స్‌ అధికారికి, అనంతపురం నగరంలోని ఓ పన్నుల శాఖ ఉన్నతాధికారికి (గుంతకల్లుతో సంబంధమున్న) భారీగా ముడుపులు  అందజేస్తున్నారని సమాచారం. 


- గుంతకల్లులో ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి పోలీసులకు ముడుపులు ముట్టజెబుతూ  చాపకింద నీరులా వ్యాపారం నడుపుతున్నాడట. అక్కడి పోలీస్‌ అధికారులకు సైతం భారీగానే ముడుపులు అందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అనంతపురం నగరంలోనూ కొందరు వ్యాపారులు తమ హవా కొనసాగిస్తున్నారు. కొన్ని ట్రాన్సపోర్టు వాహనాలలో, కిరాణం సరుకుల పేరుతో గుట్కా పదార్థాలు తెప్పిస్తున్నట్లు సమాచారం. రాజా, హన్స, చైనీ ఖైనీ ప్యాకెట్లను రూ.20 నుంచి రూ.40 వరకు విక్రయిస్తుంటారు. వీటి ధర రూ.5 వరకూ ఉంటుంది. కానీ గుట్టుగా విక్రయిస్తుండటంతో ఒక్కో ప్యాకెట్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు మార్జిన పెట్టుకుని అమ్మకాలు చేస్తుంటారు. ఈ కారణంగా పోలీసులకు, ఇతర శాఖల అధికారులు ముడుపులు ఇచ్చినా, అక్రమార్జన బాగానే ఉందని అంటున్నారు. 


గుట్కాతో క్యాన్సర్‌..

గుట్కా పదార్థాలను తినడం వల్ల కాన్సర్‌ వస్తుంది. నోటి క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ. రక్తనాళాలు బ్లాక్‌ కావడం వలన గుండె జబ్బు, పక్షవాతం వస్తుంది. దీనికితోడు కాళ్లలో గ్యాంగ్రిన వస్తుంది. గుట్కా ఎక్కువ తీసుకోవడం ప్రమాదకరం. 15 ఏళ్లపాటు క్రమంగా తీసుకునేవారికి ప్రమాదకర జబ్బులు వస్తాయి. గుట్కాకి దూరంగా ఉండటం మంచిది. 

- యాసర్‌ అరాఫత, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.