గుట్టుగా గుడుంబా

ABN , First Publish Date - 2022-10-03T05:38:20+05:30 IST

జిల్లాలోని పల్లెల్లో, మారుమూల తండాల్లో మళ్లీ గుడుంబా గుప్పుమంటోంది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న నాటుసారా తయారీ మళ్లీ పుంజుకుంటోంది. గుడుంబా తయారీదారులు గుట్టుచప్పుడు కాకుండా తయారు చేసి రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ దందా సాగిస్తున్నారు.

గుట్టుగా గుడుంబా
గుడుంబా తయారు చేస్తున్న దృశ్యం

- జిల్లాలో దొరకని చీప్‌ లిక్కర్‌.. ఐఎల్‌ఎం డిపోలో కొరత
- చీప్‌ లిక్కర్‌ కొరతతో గ్రామాల్లో గుప్పుమంటున్న గుడుంబా
- మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి అక్రమంగా దేశిదారు సరఫరా
- గ్రామీణ ప్రాంతాల్లో గుట్టుగా గుడుంబా తయారీ
- గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు
- పల్లెల నుంచి పట్టణాల దాక జోరుగా విక్రయాలు
- మద్యానికి బదులు సారా, దేశిదారు తాగుతున్న పేదలు


కామారెడ్డి, అక్టోబరు 2(ఆంఽధ్రజ్యోతి):
జిల్లాలోని పల్లెల్లో, మారుమూల తండాల్లో మళ్లీ గుడుంబా గుప్పుమంటోంది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న నాటుసారా తయారీ మళ్లీ పుంజుకుంటోంది. గుడుంబా తయారీదారులు గుట్టుచప్పుడు కాకుండా తయారు చేసి రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ దందా సాగిస్తున్నారు. చీప్‌ లిక్కర్‌ కొరతతో జిల్లాలోని మద్యం దుకాణాల్లో దొరకకపోవడం, మద్యం ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు నాటుసారా వైపు మల్లుతున్నారు.  గుడుంబా కేవలం పల్లెలు, తండాలకే పరిమితం కాకుండా ఇప్పుడు పట్టణాలకు సైతం పాకింది. అదేవిధంగా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో మద్యం ధరలు తక్కువగా ఉండడం, దేశిదారును సరిహద్దులు దాటి జిల్లాలోకి భారీగా తీసుకువస్తూ అమ్మకాలు జరుపుతున్నారు. ఇదంతా ఎక్సైజ్‌, పోలీసుశాఖలోని కొందరు అధికారులు, సిబ్బంది కనుసన్నల్లోనే దందా సాగుతుందనే విమర్శలు వస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాలే కాకుండా జిల్లా నలుమూలాల గుడుంబా, దేశిదారు అమ్మకాలు జోరుగా సాగుతుండడంతో జిల్లాలో మద్యం అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడుతుందని మద్యం వ్యాపారులు సైతం చెబుతుండడం గమనార్హం. గుడుంబా, దేశిదారు సరఫరాపై సంబంధిత ఎక్సైజ్‌ అధికారులు మూలాలపై దృష్టిపెట్టకుండా అడపాదడప దాడులు చేస్తూ అమ్మకందారులకు అడ్డుకట్టవేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
జోరుగా నాటుసారా తయారీ
జిల్లాలో నాటుసారా తయారీ జోరందుకుంది. చీప్‌ లిక్కర్‌ కొరత ఏర్పడడం, మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు తక్కువ ధరలో లభించే గుడుంబా వైపు మరులుతున్నారు. దీంతో పల్లెలతో పాటు పట్టణాల్లోనూ సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సారా విచ్చలవిడిగా తయారవుతోంది. గుట్టుచప్పుడు కాకుండా ప్లాస్టిక్‌ కవర్లలో నింపి రవాణా చేస్తున్నారు. ఎల్లారెడ్డి, గాంధారి, మాచారెడ్డి, రామారెడ్డి, రాజంపేట, జుక్కల్‌, పిట్లం, పెద్ద కొడప్‌గల్‌, మద్నూర్‌, బిచ్కుంద, బాన్సువాడ తదితర మండలాల్లోని మారుమూల గ్రామాల్లో, అటవీప్రాంతాల్లో గుడుంబా తయారీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ద్విచక్ర వాహనాలపై ఇతర గ్రామాలు, పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. కొందరు సారా తయారీనే వృత్తిగా మలుచుకొని పెద్దఎత్తున తయారు చేసి అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు తమ కోసం ఇప్పపువ్వుతో మేలిరకం సారా తయారు చేసుకుని తాగుతుండగా మరికొందరు ఇప్పపువ్వుతో పాటు బెల్లం, కుళ్లిన అరటిపండ్లు, ఇతర మత్తు పదార్థాలతో గుడుంబా తయారు చేసి దందా సాగిస్తున్నారు.
చీప్‌ లిక్కర్‌ కొరత
జిల్లాలోని ఆయా వైన్స్‌లలో చీప్‌ లిక్కర్‌ కొరత ఏర్పడుతోంది. గత నెలరోజులుగా వైన్స్‌లలో చీప్‌ లిక్కర్‌ దొరకడం లేదు. నిజామాబాద్‌ జిల్లాలో ఉండే ఐఎంఎల్‌ డిపో నుంచి జిల్లాలోని 49 వైన్స్‌లతో పాటు 8 బార్లకు సరఫరా అవుతోంది. అయితే గత నెలన్నరగా ఐఎంఎల్‌ డిపోలో చీప్‌ లిక్కర్‌ కొరత ఏర్పడుతోంది. మద్యం డిపోలో రేషన్‌ పద్ధతిలో వైన్స్‌లకు చీప్‌ లిక్కర్‌ అందజేస్తున్నారు. గత రెండు నెలల నుంచి డిస్ట్రిలరీస్‌ ద్వారా చీప్‌ లిక్కర్‌ సరఫరా పూర్తిస్థాయిలో జరగకపోవడంతో డిపోలో కొరత ఏర్పడుతుందని సంబంధితశాఖ అధికారులు, మద్యం వ్యాపారులు చెబుతున్నారు. దీంతో పాటు దూర ప్రాంతాలకు సరఫరా చేసే దగ్గర రవాణా చార్జీలపరంగా గిట్టుబాటు కావడం లేదని మద్యం వ్యాపారులు వెనకంజ వేస్తున్నారు. ఈ ప్రభావం కారణంగా ప్రస్తుతం క్షేత్రస్థాయిలో చీప్‌ లిక్కర్‌ కొరత కనిపిస్తోంది.
మందుబాబులు నాటుసారా, దేశిదారి వైపు
చీప్‌ లిక్కర్‌ కొరత ఏర్పడడం, మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన కొందరు మత్తు కోసం సారాకు అలవాటు పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం తాగాలంటే వందల రూపాయలు వెచించాల్సి వస్తోంది. క్వాటర్‌ మద్యం కొనాలన్నా రూ.100కు పైగానే ఖర్చవుతోంది. ఇలాంటి సమయంలో తక్కువ ధరలో దొరుకుతున్న గుడుంబా తాగేందుకు మందుబాబులు నాటుసారా వైపు చూస్తున్నారు. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో పేదలు, కూలీలు నివసించే పలు కాలనీల్లో గుడుంబా, సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణాలతో పాటు పలు మండలాల్లోనూ గుడుంబా అమ్మకాలు గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో మద్యం ధరలు చాలా తక్కువగా ఉండడంతో అక్కడి నుంచి దేశిదారును అక్రమంగా జిల్లా సరిహద్దులకు సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా జుక్కల్‌, మద్నూర్‌, పిట్లం, బిచ్కుంద, నిజాంసాగర్‌ మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దేశిదారు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మండలాలకు చెందిన గ్రామీణ ప్రాంత ప్రజలు కర్ణాటక, మహారాష్ట్ర ఏదో ఒక పనిమీద వెళుతూ అక్కడి నుంచి దేశిదారు మద్యాన్ని గుట్టుగా తీసుకువచ్చి తాగుతుండడమే కాకుండా అమ్మకాలు జరుపుతున్నట్లు ఎక్సైజ్‌ శాఖలోని కొందరు సిబ్బంది చెబుతున్నారు.
దేశిదారు, గుడుంబాపై నిఘా కరువు
జిల్లాలో నిషేధిత గుడుంబా, దేశిదారుపై ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక నిఘా పెట్టలేకపోతుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా నాటుసారా తయారు చేసే మూలాలపై సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతో విచ్చలవిడిగా నాటుసారా తయారవుతుందనే వాదన వినిపిస్తోంది. సారా అమ్మకాలు ఆగాలంటే తయారీ మూలాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గుట్టుగా తయారీ చేస్తూ వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. కొందరు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో గుడుంబాను పెద్దఎత్తున తయారు చేస్తు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షాకాలం సీజన్‌ కావడంతో పంట చేన్ల వద్ద గుట్టుగా తయారు చేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు ఎక్సైజ్‌ అధికారులు తండాలపై దాడులు నిర్వహించి సారా అమ్మకాలను వెతుకుతున్నారు. మూలాలను వెతకకుండా ఎక్కడో ఒకచోట దాడులు నిర్వహిస్తున్నారు. సారా ఎక్కడ తయారు చేస్తున్నారో గుర్తించి పక్కా వ్యూహంతో దాడులు చేస్తే అసలు నిందితులు దొరికే అవకాశం ఉంది. అదేవిధంగా సరిహద్దు ప్రాంతాలపై నిఘాపెట్టి దేశిదారు జిల్లాకు సరఫరా కాకుండా అడ్డుకట్ట వేయాలని మద్యం వ్యాపారులు సైతం కోరుతున్నారు.

గుడుంబా, దేశిదారు అమ్మకాలపై నిఘా పెడుతున్నాం

- రవీందర్‌ రాజు, ఎక్సైజ్‌ సూపరిటెండెంట్‌, కామారెడ్డి
జిల్లాలో గుడుంబా తయారీపై, దేశిదారు సరఫరాపై నిఘా పెడుతున్నాం. అంతర్రాష్ట్ర సరిహద్దులో ఎక్సైజ్‌ చెక్‌పోస్టులతో పాటు నిఘా టీంలను ఏర్పాటు చేసి పొరుగు రాష్ట్రాల మద్యం రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. గుడుంబా తయారీని పూర్తిగా నిషేధించాం. ఎవరైన గుట్టుగా తయారు చేసి అమ్మకాలు జరిపితే మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. జిల్లాలో చీప్‌ లిక్కర్‌ కొరత ఏర్పడుతుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు దేశిదారు, గుడుంబా వైపు మళ్లుతున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - 2022-10-03T05:38:20+05:30 IST