కుర్రాళ్ల హుషారు.. కోడెద్దుల జోరు

ABN , First Publish Date - 2022-01-17T07:42:26+05:30 IST

చంద్రగిరి మండలంలోని ఎ.రంగంపేట, పుల్లయ్యగారిపల్లె, అరిగిలవారిపల్లెలో జల్లికట్టును అట్టహాసంగా నిర్వహించారు.

కుర్రాళ్ల హుషారు.. కోడెద్దుల జోరు
ఎ.రంగంపేటలో కోడెగిత్తలను నిలువరించి.. బహుమతులను చేజిక్కించుకునేందుకు పోటీ పడుతున్న యువకులు

‘జల్లికట్టు’తో జనసంద్రమైన గ్రామాలు


చంద్రగిరి, జనవరి 16: జోరుగా పరుగుతీసే కోడెద్దులు. వీటి కొమ్ములకు కట్టిన బహుమతులను చేజిక్కించు కోవడానికి పోటీపడే కుర్రకారు. ఇలా ఆదివారం చంద్రగిరి మండలంలోని ఎ.రంగంపేట, పుల్లయ్యగారిపల్లె, అరిగిలవారిపల్లెలో జల్లికట్టును అట్టహాసంగా నిర్వహించారు. ఉదయమే గ్రామ దేవతకు పశువుల యజమానులు పూజలు చేశారు. తమ కోడెగిత్తలకు, ఆవులకు, దూడలకు కొమ్ములు చెలిగారు. రంగులేసి కొప్పులు తొడిగారు. నగదు, విలువైన వస్తు సామగ్రి, పలువురు నాయకులు, సినీనటుల ఫొటోలతో కూడిన చెక్క పలకలను కొమ్ములకు కట్టారు. 11 గంటలకు పుల్లయ్యగారిపల్లెలో పశువులను వదిలారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎ.రంగంపేటలోని యాదవ వీధిలో పశువులను గుంపులు, గుంపులుగా వదిలారు. పలు ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన యువకులు గుంపులుగా అల్లె అవతల నిలబడి కోడెగిత్తలను నిలువరించేందుకు పోటీ పడ్డారు. బహుమతులను సొంతం చేసుకొనేందుకు తీవ్రంగా పోటీపడ్డారు. ఈ ప్రయత్నంలో కొందరు గాయపడ్డారు. మరికొందరు యువకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. జల్లికట్టును చూసేందుకు వచ్చిన జనం గ్రామంలోని ఇళ్లపై, చెట్ల కొమ్మలపైకి చేరారు. అరిగిలవారిపల్లెలోనూ పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు. కాగా, ఎ.రంగంపేటలో ఉదయం 11.30 నుంచి 1.30 గంటల వరకు జల్లికట్టు జరగ్గా.. గ్రామం నుంచి నారావారిపల్లె మీదుగా వెళ్లే రోడ్డు మార్గం స్తంభించింది. జల్లికట్టు ముగిసిన తర్వాత జనం ఒక్కసారిగా బయటకు రావడంతో ఎ.రంగంపేట సర్కిల్లో అరగంటపాటు ట్రాఫిక్‌  ఆగింది. 

Updated Date - 2022-01-17T07:42:26+05:30 IST