సున్నావడ్డీ పేరుతో జగన్‌ మోసం

ABN , First Publish Date - 2021-04-22T05:04:08+05:30 IST

రైతులను సున్నా వడ్డీ పేరుతో సీఎం జగన్‌ మోసం చేస్తున్నారని, ఈ క్రాప్‌ నిబంధనలతో రైతులు నష్టపోతున్నారని టీడీపీ నరసరావుపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు.

సున్నావడ్డీ పేరుతో జగన్‌ మోసం

ఈ క్రాప్‌ నిబంధనలతో నష్టపోతున్న రైతులు

నరసరావుపేట పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు

గుంటూరు, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి):  రైతులను సున్నా వడ్డీ పేరుతో సీఎం జగన్‌ మోసం చేస్తున్నారని, ఈ క్రాప్‌ నిబంధనలతో రైతులు నష్టపోతున్నారని టీడీపీ నరసరావుపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. బుధవారం ఆయన ఆన్‌లైన్‌ సమావేశంలో మాట్లాడారు. 64లక్షల మంది రైతులకు రూ.4వేల కోట్లు సున్నా వడ్డీకి ఇస్తామని హామీ ఇచ్చి 6 లక్షల మందికి మాత్రమే ఇస్తూ వంచిస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో 37 లక్షల మంది రైతులకు సున్నా వడ్డీ కింద లబ్ధి చేకూర్చగా, ప్రస్తుత ప్రభుత్వం సున్నా వడ్డీని ఈక్రాప్‌లో నమోదుచేసుకున్న రైతులకు వర్తింపచేయడంతో 90 శాతం మంది రైతులకు సున్నా వడ్డీ రాయితీ అందట్లేదన్నారు. వైసీపీ కార్యకర్తలకు మాత్రమే సున్నా వడ్డీ పథకాన్ని అమలుచేస్తూ రైతులకు కూడా కులాలను ఆపాదించిన ఘనత జగన్‌ రెడ్డిది అని జీవీ పేర్కొన్నారు. రూ. లక్ష లోపు రుణం తీసుకున్న రైతుకే సున్నా వడ్డీ పరిమితం చేస్తూ జగన్‌రెడ్డి జీవో 464 విడుదల చేశారు. కానీ ఒక హెక్టారు లోపు రైతుకు సున్నా వడ్డీని కుదించారు. రూ.2లక్షల నుంచి రూ.3 లక్షల వరకు రుణం తీసుకునే రైతుకు సున్నా వడ్డీ రద్దు చేశారు. చంద్రన్న పాలనలో రైతు వడ్డీని ప్రభుత్వమే చెల్లించేదని ఆయన గుర్తుచేశారు. జగన్‌ రెడ్డి విధానాలతో రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని ఆయన హితవు పలికారు.

Updated Date - 2021-04-22T05:04:08+05:30 IST