AP News: ఏపీ ప్రభుత్వం అప్పుల్లో రికార్డ్‌ సృష్టిస్తోంది: జీవీ రెడ్డి

ABN , First Publish Date - 2022-08-26T22:18:02+05:30 IST

ఏపీ ప్రభుత్వం అప్పుల్లో రికార్డ్‌ సృష్టిస్తోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి (GV Reddy) తప్పుబట్టారు.

AP News: ఏపీ ప్రభుత్వం అప్పుల్లో రికార్డ్‌ సృష్టిస్తోంది: జీవీ రెడ్డి

అమరావతి: ఏపీ ప్రభుత్వం అప్పుల్లో రికార్డ్‌ సృష్టిస్తోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి (GV Reddy) తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదు నెలల వ్యవధిలో ఏపీ రూ.46,603 కోట్లు రుణం సమీకరించిందని, ఏపీ చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ (All time record) అని తెలిపారు. వచ్చే మంగళవారం మరో రూ.2 వేల కోట్లు అప్పుకు ఆర్బీఐ (RBI)కి ఏపీ ప్రభుత్వం ఇండెంట్ పెట్టిందని చెప్పారు. ఇవికాక కార్పొరేషన్‌ ద్వారా తెచ్చిన అప్పులు అదనంగా తెస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతోందని జీవీ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ సమస్యలు, విభజన అంశాలపై కేంద్ర ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్‌ ఆధ్వర్యంలోని కమిటీ రాష్ట్ర బృందంతో గురువారం సమావేశమైంది. రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ బృందంలో ఉన్నారు. ప్రధాని కార్యాలయం (పీఎంవో) ఈ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో జరిగిందొకటి.. బయటికొచ్చాక విజయసాయి, బుగ్గన చెప్పింది వేరొకటి కావడం గమనార్హం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నుల గురించి సోమనాథన్‌ ప్రశ్నించారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఉల్లంఘించి రాష్ట్ర బేవరేజేస్‌ కార్పొరేషన్‌ ద్వారా భారీగా రుణాలు తేవడం.. సంక్షేమ పథకాల కోసం అప్పులు చేయడంపై గట్టిగా నిలదీసినట్లు సమాచారం.  వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా సమకూర్చకపోవడం, డిస్కమ్‌లు చెల్లించాల్సిన రుణాలపై నివేదికలు ఇవ్వకపోవడం, రైల్వే ప్రాజెక్టులకు నిధులు, భూములు ఇవ్వకపోవడంపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది.

Updated Date - 2022-08-26T22:18:02+05:30 IST