సమస్యలపై దద్దరిల్లిన కౌన్సిల్‌

ABN , First Publish Date - 2022-05-27T06:40:09+05:30 IST

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) సర్వసభ్య సమావేశం గురువారం వాడీవేడిగా జరిగింది.

సమస్యలపై దద్దరిల్లిన కౌన్సిల్‌

విపక్షాలతోపాటు అధికారులను నిలదీసిన అధికార పార్టీ సభ్యులు

అవాక్కయిన మేయర్‌, డిప్యూటీ మేయర్‌లు

విపక్షాల మాదిరిగా మాట్లాడతారేమిటంటూ తిప్పల వంశీరెడ్డిని ప్రశ్నించిన కటుమూరి సతీష్‌ 

ఇరువురి మధ్య వాగ్వాదం

సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలుకు సభ్యులు ఆమోదం లేకుండానే ఆమోదించేసినట్టు ఎలా ప్రకటిస్తారంటూ మేయర్‌ను నిలదీసిన వంశీ రెడ్డి

జోన్‌-8లో రెవెన్యూ అక్రమాలను నిరూపించలేకపోతే

రాజకీయసన్యాసం తీసుకుంటానని టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా సవాల్‌

వీధి దీపాల సమస్యపై పార్టీలకతీతంగా గళమెత్తిన సభ్యులు 

పారిశుధ్య నిర్వహణపై ఆగ్రహం

ట్రేడ్‌ లైసెన్స్‌ బకాయిల మాఫీలో అక్రమాలు: జనసేన 

సీపీఎం, బీజేపీ సభ్యులను డిప్యూటీ మేయర్‌ సతీష్‌ దూషించారంటూ మేయర్‌ పోడియం వద్ద విపక్ష సభ్యుల నిరసన 

క్షమాపణ  చెప్పడంతో సర్దుమణిగిన వివాదం

అగనంపూడి టోల్‌గేట్‌ తొలగించాలంటూ కేంద్రానికి ప్రతిపాదించాలని నిర్ణయం


విశాఖపట్నం, మే 25 (ఆంధ్రజ్యోతి):


మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) సర్వసభ్య సమావేశం గురువారం వాడీవేడిగా జరిగింది. మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన జరిగిన సమావేశం ఆద్యంతం వాగ్వాదాలు, సవాళ్లతో నడిచింది. సమస్యలపై విపక్ష సభ్యులతో పాటు ఈసారి అధికారపక్షం సభ్యులు కూడా గళమెత్తడంతో కౌన్సిల్‌ హాలు దద్దరిల్లింది. సభ ప్రారంభం కాగానే ఎజెండాలోని అంశాలపై చర్చ ప్రారంభించేందుకు మేయర్‌ సమాయత్తమవ్వగా, విపక్ష సభ్యులు ప్రశ్నోత్తరాలతో ప్రారంభించాలని పట్టుబడ్డారు. దీనికి మేయర్‌ సమ్మతించకపోవడంతో పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో జీరోఅవర్‌ కింద గంటపాటు సభ్యులు తమ వార్డుల్లోని సమస్యలను చెప్పుకునేందుకు మేయర్‌ అనుమతించారు. జోన్‌-8లో తప్పుడు పత్రాలతో 200 వరకూ అసెస్‌మెంట్‌లు అక్రమంగా జారీచేయడంపై గత ఏడాది జూన్‌లో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైందని, ఇంతవరకూ బాధ్యులపై చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ 97వ వార్డు కార్పొరేటర్‌ రాపర్తి కన్నా ప్రశ్నించారు. కేవలం నలుగురిని సస్పెండ్‌ చేసి వారం రోజుల్లోనే తిరిగి సస్పెన్షన్‌ ఎత్తివేయడంపై అనుమానం వ్యక్తంచేశారు. దీనికి కమిషనర్‌ డాక్టర్‌ లక్ష్మీషా బదులిస్తూ ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌తో దర్యాప్తు చేయించగా, 22 మంది వార్డు కార్యదర్శుల పాత్ర వున్నట్టు తేలిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటే అదనపు కమిషనర్‌ స్థాయి అధికారితో విచారణ చేయించాల్సి ఉందన్నారు. దీనిపై కన్నా మాట్లాడుతూ అసలు దోషులను వదిలేసి చిరుద్యోగులైన కార్యదర్శులను ఇరికించడం సరికాదన్నారు. టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ పీలా శ్రీనివాస్‌ స్పందిస్తూ 2012లో గాజువాకలో ఒక అసెస్‌మెంట్‌లో అక్రమాలు జరిగితే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఇక్కడ వందలాది అసెస్‌మెంట్లు అక్రమంగా జారీ అయితే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. నలుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేసిన అధికారులు, అసలు బాధ్యుడైన జోనల్‌ కమిషనర్‌ను సస్పెండ్‌ చేయకపోవడంలో ఆంత్యరమేమిటని కమిషనర్‌ను నిలదీశారు. దీంతో కమిషనర్‌ సమాధానం ఇస్తూ తక్షణం ఏడీసీ స్థాయి అధికారితో దర్యాప్తునకు ఆదేశాలు ఇస్తానని, ప్రతి వారం దర్యాప్తును తాను కూడా పరిశీలిస్తానన్నారు. అక్రమాలు జరిగినట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నా, చర్యలకు వెనకడుగు వేస్తున్నారని, అక్రమాలను నిరూపించలేకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని పీలా శ్రీనివాసరావు సవాల్‌ చేశారు. 

సీపీఎం ఫ్లోర్‌లీడర్‌ గంగారావు మాట్లాడుతూ అనధికార నిర్మాణాల పేరుతో జరిమానాలు విధించి పేదలను పీక్కుతింటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 2012కి ముందు జరిగిన నిర్మాణాలకు జరిమానా విధించకూడదని చట్టంలో స్పష్టంగా ఉన్నప్పటికీ 1996, 1994, 1991లో జరిగిన నిర్మాణాలకు కూడా జరిమానాలు విధించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇలా మూడు లక్షల అసెస్‌మెంట్లకు రూ.వంద కోట్లు జరిమానా విధించారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాల పేరుతో వసూలు చేసిన జరిమానాలను తిరిగి బాధితులకు డిపాజిట్‌ చేయాలని గంగారావు డిమాండ్‌ చేశారు. సీపీఐ కార్పొరేటర్‌ ఏజే స్టాలిన్‌ మాట్లాడుతూ వార్డుకు రూ.1.5 కోట్లు నిధులు ఇస్తామని ప్రకటించినా, ఇంతవరకూ పనులు ప్రారంభం కాలేదని, వార్డులో కాలువలు కూడా వేయలేని స్థితిలో వున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణం పనులపై దృష్టి పెట్టకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు. కోళ్ల వ్యర్థాల తరలింపులో పెద్దఎత్తున అవినీతి జరిగిందంటూ 60వ వార్డు కార్పొరేటర్‌ పీవీ సురేష్‌, 66వ వార్డు కార్పొరేటర్‌ మహ్మద్‌ ఇమ్రాన్‌, 90వ వార్డు కార్పొరేటర్‌ బొమ్మిడి రమణ, 97వ వార్డు కార్పొరేటర్‌ రాపర్తి కన్నా ఆరోపించారు. కౌన్సిల్‌లోని పెద్దలు కొందరు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై 2020-21లో టెండరు లేకుండానే వ్యవహరం నడిపించేశారని దీనిపై వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. దీనికి ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ శాస్ర్తి సమాధానం ఇస్తూ గత ఏడాది టెండర్లు పిలవలేదని, ప్రస్తుత సంవత్సరానికి టెండర్లు పిలవగా, సుమారు 80 మంది పాల్గొన్నారని, నిబంధనల ప్రకారం తక్కువకు కోట్‌ చేసిన వారికి పనులు అప్పగించామని వివరించారు. జనసేన ఫ్లోర్‌లీడర్‌ భీశెట్టి వసంతలక్ష్మి మాట్లాడుతూ తన వార్డులో ఆస్తి పన్ను కింద గత ఏడాది రూ.3.48 కోట్లు ఆస్తిపన్ను వసూలు చేశారని, ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి ఖర్చు చేయలేదన్నారు. ఆఖరుకు వృద్ధులు, వికలాంగుల పెన్షన్‌ నుంచి చెత్తసేకరణ చార్జీలను రికవరీ చేయడం సిగ్గుచేటన్నారు. 87వ వార్డు కార్పొరేటర్‌ బొండా జగన్నాథం మాట్లాడుతూ తన ఇంటి ముందున్న ఫ్లెక్సీలను తొలగించాలని జోనల్‌ కమిషనర్‌ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసి తీయించేశారని మేయర్‌కు ఫిర్యాదుచేశారు. జీవీఎంసీ పరిధిలో అధికార పార్టీ కార్పొరేటర్లు, నేతలు రోడ్లపై ఫ్లెక్సీలు పెట్టినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రెండో వార్డు కార్పొరేటర్‌ గాడు చిన్నికుమారిలక్ష్మి మాట్లాడుతూ కార్పొరేటర్‌గా ఏడాది పూర్తిచేసుకున్న సందర్భమంటూ ఒక్కో వార్డుకి రూ. ఐదు లక్షలు ప్రకటించినా ఇంతవరకూ వాటిని ఇవ్వలేదని, కోట్లాది రూపాయాలతో పనులకు ఎలా అనుమతి ఇచ్చేస్తున్నారని మేయర్‌ను ప్రశ్నించారు. మేయర్‌ తన విచక్షణాధికారాలను నిధుల దుర్వినియోగానికి వాడుతున్నారని విమర్శించారు. 


తిప్పల వంశీ వర్సెస్‌ డిప్యూటీ మేయర్‌

జీవీఎంసీ పరిధిలోని పది ఉన్నత పాఠశాల్లో సీబీఎస్‌ఈ అమలుకు అనుమతి కోరుతూ కేంద్రానికి ప్రతిపాదించే అంశాన్ని సభ్యులు ఆమోదించకుండానే ఆమోదం పొందినట్టు మేయర్‌ ప్రకటించడంపై వైసీపీ కార్పొరేటర్‌ తిప్పల వంశీ అభ్యంతరం తెలిపారు. తమ సమ్మతి అవసరం లేనప్పుడు తామంతా సమావేశానికి రావడం ఎందుకుని మేయర్‌ను ప్రశ్నించారు. పారిశుధ్య విభాగంలో ఆప్కోస్‌ కింద వున్న కార్మికుల వివరాలను వార్డుల వారీగా ఇవ్వాలని కోరారు. దీనికి డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌ లేచి అభ్యంతరం చెప్పడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం జరిగింది. మేయర్‌ స్పందిస్తూ సభా మర్యాదలు పాటించాలనడంతో వంశీరెడ్డి రెచ్చిపోయారు. ‘సభలో ఐదుగురు ఆమోదించేస్తే చాలా?, ఎవరు ఆమోదించారు?, ఏమిటీ ఘోరం? మాకు గౌరవం లేదా?, స్టాండింగ్‌ కమిటీలోని అంశాన్ని కూడా కౌన్సిల్‌లో పెట్టేసి ఆమోదించేసుకుంటారా?, అయితే కానీయండి. సభా మర్యాదలు అంటే ఏమిటి? అడగాలంటే అన్నీ అడుగుతాం. అడగలేక కాదు...’ అంటూ మండిపడ్డారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని డిప్యూటీ మేయర్‌ సతీష్‌ అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరింది. ఈ దశలో ఫ్లోర్‌లీడర్‌ బాణాల శ్రీనివాసరావు, కో-అప్షన్‌ సభ్యుడు బెహరా భాస్కరరావు ఇతర వైసీపీ కార్పొరేటర్లు వంశీ వద్దకు వెళ్లి బుజ్జగించడంతో వివాదం సర్దుమణిగింది.


సమస్యలపై విపక్షాలతో కలిసి గళమెత్తిన అధికారపక్షం కార్పొరేటర్లు

వార్డుల్లోని సమస్యలపై విపక్ష కార్పొరేటర్లతోపాటు అధికారపక్షం కార్పొరేటర్లు కూడా గళమెత్తడం ఆశ్చర్యం కలిగించింది. వార్డుల్లో పందులు, కుక్కల బెడద తీవ్రంగా ఉండడంతోపాటు, వీధి లైట్లు వెలగడం లేదని, పారిశుధ్యం ఘోరంగా ఉందంటూ కార్పొరేటర్లు అక్కరమాని రోహిణి, కోరుకొండ స్వాతీదాస్‌, చెన్నా జానకిరామ్‌, శానాపతి వసంత, గులివిందల లావణ్య, ఏజే స్టాలిన్‌, ముక్కా శ్రావణి, పీవీఎల్‌ నరసింహం తదితరులు ఫిర్యాదు చేశారు. కార్పొరేటర్లుగా గెలిచి ఏడాదిన్నర అవుతున్నా ఇంకా పారిశుధ్యం కోసం కౌన్సిల్‌లో అడగాల్సి రావడం సిగ్గుగా ఉందని 26వ వార్డు కార్పొరేటర్‌ ముక్కా శ్రావణి ఆవేదన వ్యక్తంచేశారు.


ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్‌కు వైఎస్‌ఆర్‌ పేరు...టీడీపీ అభ్యంతరం

ఎన్‌ఏడీ ఫ్లై ఓవర్‌కు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టే ప్రతిపాదనను కౌన్సిల్‌ ఆమోదించింది. అంతేకాకుండా ఫ్లైఓవర్‌ మధ్యలో అంబేద్కర్‌ విగ్రహం పెట్టాలని కూడా నిర్ణయించింది. దీనికి టీడీపీ కార్పొరేటర్‌ పల్లా శ్రీనివాసరావు అభ్యంతరం తెలిపారు. టీడీపీ హయాంలో రూ.147 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్‌కు వైఎస్‌ రాజశేఖర్‌రెడి ్డ పేరు పెట్టడం సరికాదని, అంబేడ్కర్‌ పేరు పెట్టాలని కోరారు. కొత్తగా హనుమంతవాక, గాజువాక వంటి ప్రాంతాల్లో ఫ్లైఓవర్‌ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి వాటికి ఎవరి పేరు పెట్టుకున్నా తమకు అభ్యంతరం ఉండదన్నారు. 


ట్రేడ్‌ లైసెన్సుల బకాయిల మాఫీలో అక్రమాలు 

భీమిలి జోన్‌ పరిధిలోని నాలుగు వార్డుల్లో రద్దయిన 716 ట్రేడ్‌ లైసెన్సుల బకాయిలు మాఫీకి సంబంధించిన అంశంపై చర్చ సందర్భంగా తీవ్ర దుమారం రేగింది. దీనిపై జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ అభ్యంతరం తెలుపుతూ ట్రేడ్‌ లైసెన్సు బకాయిల రద్దు పేరుతో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. తన వార్డు పరిధిలో వీఐపీ రోడ్డులో వున్న మంత్రీస్‌ హోటల్‌ను ఇందుకు ఉదహరించారు. హోటల్‌ నిర్వాహకుడు మారారనే సాకుతో రూ.78 వేలు ట్రేడ్‌లైసెన్స్‌ బకాయిని కట్టించకుండా, కొత్త లైసెన్స్‌ జారీ చేయాలని యత్నించగా తాను అభ్యంతరం చెప్పడంతో ఆ మొత్తాన్ని వసూలు చేశారని వివరించారు. భీమిలి జోన్‌లో కూడా అలాంటివే అయివుంటాయని అనుమానం వ్యక్తంచేశారు. దీనికి తిప్పల వంశీరెడ్డి మాట్లాడుతూ...తనకు తెలియకుండానే ట్రేడ్‌ లైసెన్స్‌ వేరొకరి పేరుకి మార్చేసి, కొన్నేళ్ల తర్వాత మళ్లీ తన పేరుకు మార్చేశారని, దీనికి బాధ్యుడు ఎవరు? ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో? చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనికి కమిషనర్‌ మాట్లాడుతూ తర్వాత దీనిపై పూర్తివివరాలు తీసుకుని, సమాచారం ఇస్తానని హామీ ఇచ్చారు.


63 అంశాలకు ఆమోదం:

ప్రధాన అజెండాలో 63 అంశాలు చే ర్చగా, వాటిలో ఎర్రిగెడ్డలో పూడికతీతకు ఎనిమిది నెలల కాలానికి టెండరు పిలవాలనే అంశంతోపాటు, తెల్లకార్డు దారులకు యూజర్‌ చార్జీని రూ.120 నుంచి రూ.60కి తగ్గించే అంశాన్ని వాయిదా వేశారు. చెత్తపన్నును పూర్తిగా తొలగించాలని టీడీపీ పట్టుపట్టడంతో ఆ అంశాన్ని తర్వాత చర్చిద్దామంటూ వాయిదా వేశారు. ముడసర్లోవ పార్కు చుట్టూ రూ.10 కోట్లతో రక్షణ గోడ నిర్మాణం, ఆరిలోవ, శ్రీహరిపురం ఆర్‌ఎఫ్‌యూల నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగింత, ఎండాడ సర్వే నబర్‌ 175/4లో రెండు ఎకరాల స్థలాన్ని వైసీపీ కార్యాలయం నిర్మాణానికి 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. అలాగే అగనంపూడి టోల్‌గేట్‌ను తొలగించేందుకు వీలుగా తీర్మానం చేసి కేంద్రానికి పంపే అంశాన్ని ఆమోదించారు.


చెత్తవాహనాల  మరమ్మతుల్లో అక్రమాలు:

నగరంలో చెత్త తరలింపు వాహనాల మరమ్మతుల పేరుతో అవినీతి జరుగుతోందని టీడీపీ కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావు ఆరోపించారు. తమ వార్డు పరిధిలో మరమ్మతుకు గురైన వాహనాలను తాము పరిశీలించి సమ్మతి తెలిపిన తర్వాతే రిపేరు చేయాలని గత కౌన్సిల్‌లో చెప్పామని, అయినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 61, 81 వార్డుల కార్పొరేటర్ల కొణతాల సుధ, పీలా లక్ష్మీసౌజన్య మాట్లాడుతూ చెత్తవాహనాలు సరిగా తిరగకపోవడంతో పారిశుధ్య సమస్య తలెత్తుతోందన్నారు. మూడు ట్రిప్పులు తిరగాల్సి ఉన్నా ఒకటి ట్రిప్పుతోనే సరిపెట్టేస్తున్నారని ఆరోపించారు. కుక్కలు పట్టే కార్యక్రమం పేరుతో అధికంగా ఖర్చు చేస్తున్నారంటూ వైసీపీ సభ్యుడు చెన్నా జానకిరామ్‌, టీడీపీ సభ్యుడు బళ్ల శ్రీనివాసరావు, గంధం శ్రీను తదితరులు ఆరోపించారు. 


గంగారావును ‘ఇడియట్‌’ అన్న

డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌

తనను కూడా అసభ్య పదజాలంతో దూషించారని బీజేపీ కార్పొరేటర్‌ కవిత ఫిర్యాదు

బీజేపీ కార్పొరేటర్‌ గంకల కవిత మాట్లాడుతూ ఏడాదికాలంలో వార్డులో ఒక్క పని కూడా జరగలేదని మేయర్‌ దృష్టికి తేగా డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌ ఆమెకు అడ్డుపడ్డారు. ఆ సమయంలో సతీష్‌ తనపై అసభ్యపదజాలం వాడారంటూ మేయర్‌కు కవిత ఫిర్యాదుచేశారు. సతీష్‌ తనకు క్షమాపణ చెప్పాలంటూ నేలపై బైఠాయించారు. అదే సమయంలో సీపీఎం కార్పొరేటర్‌ గంగారావు మాట్లాడుతూ జీవీఎంసీ పాఠశాల్లో సీబీఎస్‌ఈ అమలు వల్ల పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందని, ఒకేసారి స్టేట్‌ సిలబస్‌ నుంచి సెంట్రల్‌ సిలబస్‌కు మారితే వారికి అర్థం కాక చదువు మానేస్తారని అనడంతో డిప్యూటీ మేయర్‌ సతీష్‌ అడ్డుతగిలి ‘ఇడియట్‌’ అని దూషించడంతో గంగారావు అభ్యంతరం చెప్పారు. దీనిపై విపక్షల సభ్యులంతా అభ్యంతరం చెప్పడంతోపాటు గంగారావుకు క్షమాపణ చెప్పించాలంటూ మేయర్‌ పోడియాన్ని చుట్టుముట్టారు. మేయర్‌ ఆదేశం మేరకు డిప్యూటీ మేయర్‌ వారికి క్షమాపణ చెప్పడంతో వివాదం సర్దుమణిగింది.



Updated Date - 2022-05-27T06:40:09+05:30 IST