మహా అవగాహన?

ABN , First Publish Date - 2021-02-26T06:00:23+05:30 IST

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల్లో టీడీపీ, వామపక్షాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

మహా అవగాహన?

జీవీఎంసీ ఎన్నికల్లో కలిసి పనిచేయనున్న టీడీపీ, వామపక్షాలు?

3 వార్డులు కేటాయింపు

సీపీఎంకు 98, 45, సీపీఐకు 72...

మార్కిస్టు పార్టీ తరపున గంగారావు, స్టాలిన్‌ సతీమణి పోటీ

తుది నిర్ణయం రేపు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) ఎన్నికల్లో టీడీపీ, వామపక్షాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని నగర టీడీపీ నేతలు రెండు రోజుల క్రితం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన...పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లి అనుమతి తీసుకున్నారు. ఈ అవగాహన మేరకు గాజువాక ప్రాంతంలో రెండు, నగరంలో ఒకటి లేదా రెండు సీట్లు వామపక్షాలకు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఉక్కు నగర పరిసరాలతో కూడిన 98వ వార్డు సీపీఎంకు, గాజువాకలోని 72వ వార్డు సీపీఐకి కేటాయించాలని సూత్రప్రాయంగా టీడీపీ నిర్ణయించింది. 98వ వార్డు నుంచి సీపీఎం నేత గంగారావు, 72వ వార్డు నుంచి సీపీఐ నేత ఎంజే స్టాలిన్‌ సతీమణి పోటీ చేయనున్నట్టు తెలిసింది. అలాగే నగరంలోని 45వ వార్డును సీపీఎంకు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇక్కడ అభ్యర్థిగా గౌరీష్‌ పేరు పరిశీలిస్తున్నారు. అవగాహనపై మాట్లాడేందుకు శనివారం నగరానికి రానున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో వామపక్షాల నేతలు సమావేశం కానున్నారు. ఇరుపక్షాలకు అంగీకారం కుదిరితే వామపక్షాలకు కేటాయించిన వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ నుంచి వైదొలగవలసి ఉంటుంది. అలాగే మిగిలిన వార్డుల్లో వామపక్షాల అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకుని టీడీపీ అభ్యర్థులను బలపరచవలసి ఉంటుంది. కాగా 2007 ఎన్నికలలో టీడీపీ, వామపక్షాలు కలిసి పోటీ చేశాయి. అప్పట్లో నగరంలో వామపక్షాల అభ్యర్థులు రెండుచోట్ల గెలిచారు. 


టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల రేపు 


జీవీఎంసీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను శనివారం విడుదల చేయాలని తెలుగుదేశం నిర్ణయించింది.  అభ్యర్థులపై ఇప్పటికే నగర నేతలు కసరత్తు పూర్తిచేశారు. రెండు, మూడుచోట్ల మార్పులు ఉంటాయని, మెజారిటీ వార్డుల్లో గత ఏడాది ప్రకటించిన అభ్యర్థులే వుంటారని నాయకులు చెబుతున్నారు. ఎన్నికలకు సమయం తక్కువగా వున్నందున అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేయకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన మేరకు శుక్రవారం జాబితా ప్రకటించాల్సి ఉంది. అయితే అచ్చెన్నాయుడు శనివారం నగరానికి రానున్నారు. అందువల్ల ఆయనతోనే అభ్యర్థుల జాబితా విడుదల చేయించాలని నిర్ణయించినట్టు విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గురువారం రాత్రి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు. 


వైసీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌

టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులు, వార్డు స్థాయి నేతలకు గాలం

హామీలు లేదంటే బెదిరింపులతో లొంగదీసుకునేందుకు యత్నం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆపరేషన్‌ ఆకర్ష్‌ అమలుచేస్తున్నారు. టీడీపీతోపాటు ఇతర పార్టీల నుంచి కార్పొరేటర్‌ అభ్యర్థులుగా నామినేషన్‌ వేసినవారిని, వార్డు స్థాయిలో కీలకంగా వ్యవహరించే నాయకులను పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నయానోభయానో వారిని దారిలోకి తెచ్చుకునేందుకు యత్నిస్తున్నారు.


జీవీఎంసీకి వచ్చే నెల పదిన ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలాగైనా మేయర్‌ పీఠం దక్కించుకోవాలని వైసీపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకోసం ఎంతకైనా సిద్ధపడిపోతున్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఆ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్వయంగా భుజానవేసుకుని వార్డుల్లో ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు పార్టీ అభ్యర్థులకు ఓటెయ్యాలని ప్రచారం చేస్తూనే, మరోవైపు ఆయా వార్డుల్లో బలంగా వున్న ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు, కీలకంగా వ్యవహరించే వార్డు స్థాయి నేతలను గుర్తించి పార్టీలో చేర్చుకునేలా వ్యూహాలు అమలుచేస్తున్నారు. పార్టీలో చేరితో భవిష్యత్తులో నామినేటెడ్‌ పోస్టులు ఇస్తామని, వారికి సంబంధించి ఏవైనా వివాదాలు వున్నట్టయితే పరిష్కారం చూపిస్తామని హామీ ఇస్తున్నారు. ఒకవేళ ఎవరైనా లొంగకపోతే వారు చేస్తున్న వ్యాపారాలను ప్రస్తావిస్తూ ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంకా గతంలో వున్న కేసులు తిరగతోడతామని కూడా బెదిరించి దారిలోకి తెచ్చుకునేందుకు యత్నిస్తున్నారు. తాజాగా 14వ వార్డు కార్పొరేటర్‌గా నామినేషన్‌ వేసిన టీడీపీ రెబెల్‌ అభ్యర్థి బాక్సర్‌ రాజుతోపాటు 46వ వార్డు, 50 వార్డుల నుంచి పలువురు వార్డు స్థాయి టీడీపీ నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. 

Updated Date - 2021-02-26T06:00:23+05:30 IST