శివలింగం వదంతులతో గందరగోళం

Published: Fri, 27 May 2022 01:41:11 ISTfb-iconwhatsapp-icontwitter-icon
శివలింగం వదంతులతో గందరగోళం

జ్ఞానవాపి కేసులో మసీదు కమిటీ వాదనలు

ఆలయ ఆనవాళ్లు చెరిపేస్తున్నారు

వారాణసీ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు

తాజ్‌మహల్‌ వద్ద నమాజ్‌.. నలుగురి అరెస్టు

వారిలో ముగ్గురు హైదరాబాద్‌ వాసులు


న్యూఢిల్లీ/బెంగళూరు, మే 26 (ఆంధ్రజ్యోతి): జ్ఞానవాపి మసీదు వివాదంపై వారాణసీ జిల్లా కోర్టులో విచారణ ప్రారంభమైంది. మసీదులో దేవతా విగ్రహాలు ఉన్నాయని, అక్కడ పూజలకు అనుమతించాలని ఐదుగురు హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ విచారణార్హతను సవాలు చేస్తూ గురువారం అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ వాదనలు వినిపించింది. వజూఖానా(నీళ్ల ట్యాంకు)లో శివలింగం ఉందనేది ఆరోపణ మాత్రమేనని, అది ఇంకా నిరూపణ కాలేదని కమిటీ తెలిపింది. శివలింగం కనిపించిందనే వదంతులతో ప్రజల్లో గందరగోళం ఏర్పడిందని, నిరూపణ అయ్యే వరకూ ఇలాంటి వాటిని అనుమతించకూడదని పేర్కొంది. మసీదు కమిటీ వాదనలు పూర్తి కాకపోవడంతో తదుపరి విచారణను కోర్టు ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది. కాగా, వజూఖానాలో గుర్తించిన శివలింగాన్ని మసీదు కమిటీ ధ్వంసం చేసిందని హిందూ మహిళల తరఫు న్యాయవాది విష్ణుశంకర్‌ జైన్‌ ఆరోపించారు. శివలింగంపై ఉన్న 63 సెంటీమీటర్ల రంద్రం వారి పనేనన్నారు. పిటిషన్‌ విచారణార్హత వ్యవహారం తేలిన తర్వాత ఈ వివరాలన్నీ కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు. కాగా, మసీదులో ఆలయ ఆనవాళ్లు కనిపించకుండా పెయింటింగ్‌ వేయించడం తదితర చర్యలకు మసీదు కమిటీ పాల్పడుతోందని హిందూ పక్షం ఫిర్యాదు మేరకు వారాణసీ పోలీసుస్టేషన్‌లో గురువారం తాజా కేసు నమోదైంది. మరోవైపు ఆగ్రాలోని తాజ్‌మహల్‌ ఆవరణలో ఉన్న షాహీ మసీదులో నమాజ్‌ చేసిన నలుగురిని యూపీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. శుక్రవారం తప్ప మిగిలిన రోజుల్లో తాజ్‌మహల్‌ ఆవరణలో నమాజ్‌ చేయడాన్ని సుప్రీంకోర్టు నిషేధించిందని ఆగ్రా ఎస్పీ వికాశ్‌ కుమార్‌ చెప్పారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు షాహీ మసీదులో నలుగురు నమాజ్‌ చేస్తుండగా పురాతత్వ సర్వే శాఖ(ఏఎ్‌సఐ), కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎ్‌సఎఫ్‌) అధికారులు వారిని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసులకు అప్పగించినట్టు తెలిపారు.


ఐపీసీలోని 153 సెక్షన్‌ కింద వారిపై కేసులు నమోదు చేసి, కోర్టులో ప్రవేశపెట్టామని చెప్పారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్‌ వాసులు, ఒకరు ఆజంగఢ్‌ వాసి ఉన్నారని వివరించారు. అయితే, సుప్రీంకోర్టు నిషేధం విధించిన విషయం తెలియకే, వారు అక్కడ నమాజ్‌ చేశారని టూరిస్ట్‌ గైడ్‌ వినోద్‌ దీక్షిత్‌ చెప్పారు. నిషేధానికి సంబంధించిన నోటీసు కూడా అక్కడ ఏర్పాటు చేయలేదని తెలిపారు. మరోవైపు బెంగళూరు కళాసిపాళెంలోని టిప్పు సుల్తాన్‌ ప్యాలె్‌సపై వివాదం రాజుకుంది. ఆ ప్యాలెస్‌ హిందూ ఆలయానికి చెందిందని జనజాగృతి సమితి గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. తమ వద్ద ఉన్న ఆధారాలతో కోర్టును ఆశ్రయించనున్నట్టు పేర్కొంది. ప్యాలెస్‌లో తవ్వకాలకు అనుమతి ఇచ్చి, వీడియో సర్వే జరపాలని డిమాండ్‌ చేసింది. టిప్పు సుల్తాన్‌ వేసవి విడిది కోసం ఈ ప్యాలె్‌సను నిర్మించారు. ప్యాలెస్‌ సమీపంలో అత్యంత పురాతన కోటె వెంకటరమణస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో చిక్కదేవరాజ ఒడయార్‌ నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్యాలెస్‌ ఉన్న స్థలంలో వేద పాఠశాల ఉండేదని, ఇది ఆలయానికి అనుబంధంగా ఉండేదని, దీనిని కూల్చి ప్యాలెస్‌ నిర్మించారని హిందూ జనజాగృతి సమితి పేర్కొంది.


అజ్మేర్‌ దర్గా శివాలయమే!

మహారాణా ప్రతాప్‌ సేన ఆరోపణ

మందిర్‌-మసీదు వివాదంలో తాజాగా రాజస్థాన్‌లోని అజ్మేర్‌ షరీఫ్‌ దర్గా చేరింది. ఆ దర్గా నిజానికి శివాలయమని మహారాణా ప్రతాప్‌ సేన ఆరోపించింది. దీనిపై పురావస్తు సర్వే విభాగం ద్వారా దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేస్తూ సీఎం అశోక్‌ గెహ్లోత్‌కు లేఖ రాసింది. అజ్మేర్‌లోని హజ్రత్‌ క్వాజా గరీబ్‌ నవా జ్‌ దర్గా పురాతన శివాలయమని, అక్కడి తలుపులపై స్వస్తిక్‌ గుర్తులు ఉన్నాయని ప్రతాప్‌ సేన వ్యవస్థాపకుడు రాజవర్థన్‌ సింగ్‌ పర్మార్‌ ఆరోపిం చారు. శివాలయం కాకపోతే దర్గాలో స్వస్తిక్‌ గుర్తులు ఎందుకుంటాయని ప్రశ్నించారు. వారం రోజుల్లోగా దర్యాప్తు ప్రారంభం కాకపోతే కేంద్ర మంత్రులను కలుస్తామని తెలిపారు. దీనిపై ఆందోళన కూడా చేస్తామని చెప్పారు. ఖి

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.