హా...జీ! ఇది సరికొత్త ఎమోజీ

ABN , First Publish Date - 2021-10-27T08:31:06+05:30 IST

కొండ గుహలలో తలదాచుకున్న ఆదిమానవుడు మనసులోని భావాలను వ్యక్తం చేయడానికి బొమ్మలనే ఆశ్రయించాడు. తాను వేటాడి తెచ్చిన జంతువు రూపాన్ని గుహలోని గోడపై చిత్రీకరించి చూపేవాడు...

హా...జీ! ఇది సరికొత్త ఎమోజీ

కొండ గుహలలో తలదాచుకున్న ఆదిమానవుడు మనసులోని భావాలను వ్యక్తం చేయడానికి బొమ్మలనే ఆశ్రయించాడు. తాను వేటాడి తెచ్చిన జంతువు రూపాన్ని గుహలోని గోడపై చిత్రీకరించి చూపేవాడు. ఆ తర్వాత నోటి నుంచి వెలువడే ధ్వనులు, నిర్దిష్ట సంకేతాలుగా ఎదిగి భాషగా అభివృద్ధి చెందింది. చైనీయులది చిత్రలిపి. బొమ్మలతోనే వారి అక్షరమాల రూపొందింది. ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలోనూ ఎమోజీల రూపంలో అలనాటి దృశ్యభాష విరాజిల్లుతోంది.


వీడియో కాల్‌ ద్వారా కూడా ముఖాముఖి మాట్లాడుకోగల అవకాశాలు అందివచ్చాయి. ఇలాంటి సందర్భాల్లో ఆ సంభాషణకు శరీర భాష కూడా తోడవుతోంది. ముఖంలో వ్యక్తమయ్యే భావాలు అంతరంగాన్ని ఆవిష్కరించి సంభాషణను మరింత అర్థవంతం చేస్తాయి. అయితే సామాజిక మాధ్యమాల్లో టెక్ట్స్‌ రూపంలో సాగే మెసేజింగ్‌లో అక్షరాలలో వ్యక్తం చేయలేని సందర్భాలు అనేకం ఉంటాయి. సందేశాన్ని వేగంగా చేర్చాల్సినపుడు పది మాటల్లో చెప్పే విషయాన్ని ఒక్క ఎమోజీతో వ్యక్తీకరించవచ్చు. ఇది అందరి అనుభవంలో ఉన్నదే.


అవసరాలకు అనువుగా భాషలో సరికొత్త పదాలు వచ్చి చేరి భాషను బలోపేతం చేస్తున్నట్లే ప్రపంచ కాలమాన పరిస్థితులకు దీటుగా భావాలను వ్యక్తం చేయడానికి ఏటికేడాది కొత్త ఎమోజీలను రూపొందించి వినియోగంలోకి తెస్తున్నారు. ఒకరకంగా మనసులోని భావాలను, అనుభూతులను, ఆందోళనలను, ఉద్వేగాలను పట్టి చూపే అంతర్జాతీయ దృశ్యభాష ఇది. విస్తృతంగా సర్వేలు చేసి, అభిప్రాయాలు క్రోడీకరించుకుని ఎమోజీలను తయారు చేస్తున్నారు.


డిజిటల్‌ టెక్ట్స్‌కు ప్రమాణాలను నిర్దేశించే యూనికోడ్‌ కన్సార్టియం ఈ ఏడాది 37 కొత్త ఎమోజీలను ఆమోదించింది. వచ్చే ఏడాది నుంచి ఇవి నెటిజన్లకు అందుబాటులోకి వస్తాయి. కొత్తగా చేరనున్న ఈ ఎమోజీల్లో మెల్టింగ్‌ ఫేస్‌ (కరుగుతున్న ముఖం) ఎమోజీకి సామాజిక మాధ్యమాల్లో విశేష ఆదరణ లభిస్తోంది. జెన్నిఫర్‌ డేనియల్‌, నీల్‌కాన్‌లు దీనికి రూపం ఇచ్చారు.


ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ సృష్టించిన విలయంతో నెలకొన్న మానసిక స్థితికి మెల్టింగ్‌ ఫేస్‌ ఎమోజీ దర్పణం పడుతోంది. గ్లోబల్‌ వార్మింగ్‌కూ ఇది సంకేతం కానుంది. జావగారి పోవడం, నీరుగారి పోవడం, మనసు ద్రవించడం అనే తెలుగు పలుకుబళ్ళకు ముమ్మూర్తులా ఇది దృశ్యరూపం అనుకోవచ్చు. మాటలు చాలని సందర్భాల్లో అవమానం, ఆశాభంగం, బాధ, నిస్త్రాణ, అసౌకర్యం అరనవ్వు వంటి భావాలను మెల్టింగ్‌ ఫేస్‌ బొమ్మ కట్టిస్తుంది.


1999లో జపాన్‌కు చెందిన కళాకారుడు షిగేటక కురీత మొట్టమొదటిసారిగా ఎమోజీని ఆవిష్కరించాడు. అప్పట్లో జపనీస్‌ మొబైల్‌ కంపెనీ డొకొమో, మొబైల్‌ ఇంటర్నెట్‌ సర్వీస్‌ ద్వారా పంపే సందేశాలకు 250 క్యారెక్టర్ల పరిమితి విధించింది. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు ఎమోజీలను అతడు సృష్టించాడు. భిన్న ప్రాంతాలు, సంస్కృతులు ఉన్న ప్రజలకు ఆమోదయోగ్యం ఆదరణపాత్రంగా ఉండేలా ఎమోజీల రూపకల్పనలో శ్రద్ధ తీసుకుంటారు. షిగేటక సృష్టించిన 176 ఎమోజీలను మ్యూజియం ఆఫ్‌ మోడరన్‌ ఆర్ట్‌లో శాశ్వత కలెక్షన్‌గా భద్రపరిచారు. టెక్ట్స్‌ సందేశాలపై ఇప్పుడు పరిమితి లేకున్నా పదాల్లో వ్యక్తం చేయలేని భావాలను చేరవేసేందుకు ఎమోజీలు ఉపకరిస్తున్నాయి. గతంలో బ్రిటన్‌లో జరిపిన సర్వేలో నెలసరి గురించి చెప్పుకోవడానికి యువతులు ఇబ్బంది పడుతున్నారని తేలడంతో రక్తబిందువును పోలిన ఎమోజీని రూపొందించి వాడకంలోకి తెచ్చారు. ఇప్పటివరకు సుమారు నాలుగువేల ఎమోజీలు నెటిజన్లకు అందుబాటులో ఉన్నాయి.

గోవిందరాజు చక్రధర్‌

Updated Date - 2021-10-27T08:31:06+05:30 IST