పక్షి జాతులకు ఆవాసం కవ్వాల్‌

ABN , First Publish Date - 2022-05-16T04:33:47+05:30 IST

ప్రకృతి రమణీయతకు నెలవై సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్న జిల్లాలోని కవ్వాల్‌ అభయారణ్యం ఎన్నో రకాల పక్షి జాతులకు ఆవాసమైంది. ఈ కవ్వాల్‌ అభయారణ్యాన్ని ప్రభుత్వం పులుల సంరక్షణ కేంద్రంగా ప్రక టించింది. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని తాడోబా పులుల సంరక్షణ కేంద్రం ఈ అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో అక్కడి నుంచి పులులు ఇక్కడికి వలస వచ్చే అవకాశం ఉందని అంచనాకు వచ్చిన అధికారులు భారీగానే నిధులు కేటాయించి పలు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పక్షుల ఆవాసానికి అవసరమైన విధంగా పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు.

పక్షి జాతులకు ఆవాసం కవ్వాల్‌
విద్యార్థులకు పక్షుల గురించి వివరిస్తున్న ఎఫ్‌డీవో(ఫైల్‌)

-  సంరక్షణకు అటవీశాఖ అధికారుల చర్యలు 

- వేసవిలో నీరు, ఆహారం లభించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు

ప్రకృతి రమణీయతకు నెలవై సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్న జిల్లాలోని కవ్వాల్‌ అభయారణ్యం ఎన్నో రకాల పక్షి జాతులకు ఆవాసమైంది. ఈ కవ్వాల్‌ అభయారణ్యాన్ని ప్రభుత్వం పులుల సంరక్షణ కేంద్రంగా ప్రక టించింది. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని తాడోబా పులుల సంరక్షణ కేంద్రం ఈ అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో అక్కడి నుంచి పులులు ఇక్కడికి వలస వచ్చే అవకాశం ఉందని అంచనాకు వచ్చిన అధికారులు భారీగానే నిధులు కేటాయించి పలు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పక్షుల ఆవాసానికి అవసరమైన విధంగా పలు రకాల చర్యలు తీసుకుంటున్నారు.

జన్నారం, మే 15: పులులకు ఆవాసమైన ఈ కవ్వాల అభయారణ్యంలో పలు రకాల పక్షులు నివాసాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఖానాపూర్‌ అటవీ డివిజన్‌ పరిధిలోని కవ్వాల్‌ అభయారణ్యంలో గతంలో సుమారు 300కుపై చిలుకు వివిధ రకాల పక్షులు ఉండేవి. ప్రస్తుతం 256 పక్షి జాతులకు పైగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా కవ్వాల్‌ అభయారణ్యంలో ఉన్న పక్షి జాతులు, వాటి జీవన విధానం. వాటి వల్ల కలిగే ప్రయోజనాలపై అవగా హన కల్పించేందుకు అటవీశాఖ ఇటీవల రెండు రోజుల పాటు బర్డ్‌ వాచ్‌ నిర్వహించింది.  దీంతో దేశ వ్యాప్తంగా పర్యాటకులు కదిలి రావడంతో పక్షుల ప్రేమికుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని పక్షి జాతులను కాపాడుకునేందుకు అటవీశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. 

- ప్రత్యేక ఏర్పాట్లు..

కవ్వాల టైగర్‌జోన్‌లో పక్షి జాతులను కాపాడుకునేందుకు వాటికి ఆమో దయోగ్యమైన ఆవాసాలను ఎంచుకుని ఆ ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలోని బైసన్‌కుంట, మైసమ్మకుంట, కల్పకుంట, నీలుగాయికుంటతోపాటు పలు ప్రాంతాల్లో నీటి కుంటల వద్ద పక్షుల కోసం ఆవాసాలను ఏర్పాటు చేశారు. వీటికి సులువుగా నీరు, ఆహారం అందించేందుకు నీటి కుంటల వద్ద ఎండిన చెట్లపై సహజసిద్ధమైన గూళ్లను ఏర్పాటు చేయ డమే కాకుండా ప్రత్యామ్నాయంగా గూళ్లను ఏర్పాటు చేయడం, వాటికి అనువుగా నీరు దొరికే విధంగా సాసర్‌వేర్‌లు, కుంటల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు మొదలుపెట్టారు.  దీంతో పాటు  గత ఏడాది నుంచి కుంట ల్లో పక్షులకు ఆహారం సులు వుగా దొరికే విధంగా చేప పిల్లలను పెంచడం వల్ల పక్షి జాతులు అభివృద్ధి చెందుతాయని, వాటికి సులువుగా ఆహారం లభించేలా చర్యలు చేపట్టారు.  నీటికుంటల వద్ద తుంగను ఏర్పాటు చేయ డం వల్ల నీటిలో తిరిగే పక్షులు తుంగలో గూళ్లు పెట్టుకోవడం, పిల్లలు చేస్తు న్నాయి. ఈ నీటి కుంటల వద్ద తుంగ ఏర్పాటు చేయడం వల్ల ఎప్పటికప్పుడు నీరు ఫిల్టర్‌ అవడం, నీటి ఉష్ణోగ్రత పెరగకుండా అదుపులో ఉంటుంది. అం దుకే ప్రతి నీటి కుంటలో తుంగ ఉండేలా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.  

- తుమ్మలు నాటితే..

నీటి కుంటల వద్ద వేసవిలో తుమ్మలు  నాటడం వల్ల పక్షులు వాటిపై గూళ్లు ఏర్పాటు చేసుకొంటాయి. పక్షులు వాటి పిల్లలను కాపాడుకోవడానికి తుమ్మ చెట్లు ఉపయోగపడుతాయి. అందుకే ప్రతి నీటి కుంటలో తుమ్మ చెట్లు ఏర్పాటు చేయడం, అడవిలో ఎండిన చెట్లను తొలగించి నీటి కుంటల్లో పెడుతున్నారు. వర్షాకాలంలో నీరు చేరడంతో పక్షులు చెట్లపై కూర్చుని నీటిలో ఉండే చేపలను వేటాడే విధంగా అటవీ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.  పక్షుల ఆవాసం సరిగ్గా ఉంటే శాకాహార, మాంసాహార జంతువులు వాటి సంకేతాలతో అప్రమత్తంగా ఉంటాయని అధికారులు చెబుతు న్నారు. కవ్వాల టైగర్‌జోన్‌లో అటవీ, వన్య ప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చట్టాలున్నాయి. పక్షి జాతులను వేటాడితే షెడ్యూలు 3, 4 ప్రకారం కేసులు నమోదు చేస్తారు. 

- అంతరించే పక్షి జాతులపై ప్రత్యేక దృష్టి..

అధికారులు అంతరించే పక్షి జాతులపై ప్రత్యేక దృష్టి సారించారు. కవ్వాల టైగర్‌జోన్‌లో గతంలో 300లకు పైగా పక్షి జాతులుండేవి. ఇప్పుడు 256 పక్షి జాతులు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇందులో అంతరించే పక్షి జాతులపై ప్రత్యేక దృష్టి సారించారు. వాటి సంరక్షణకు ప్రత్యేక ఆవాసాలు(గూళ్లు)తో పాటు ఆహారం, నీరు పూర్తిస్థాయిలో అందించే విధంగా అధికారులు మానిటరింగ్‌ చేస్తున్నారు. కవ్వాల టైగర్‌జోన్‌ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే దిశగా అధికారులు ముందుకు వెళ్తున్నారు. 

 మానవాళి మనుగడలో పక్షుల పాత్ర కీలకం..

 -మాధవరావు, ఎఫ్‌డీవో 

ప్రకృతి సమతుల్యతకు, మానవాళి మనుగడలో పక్షుల పాత్ర కీలకం. రైతులు దుక్కి దున్నితే పక్షులే క్షీరదాలను, కీటకాలను తినేయడం వల్ల భూ మి చదునవుతుంది. ప్రకృతి సమతుల్యత చెందాలంటే అడవులు ఉండాలి. అడవుల్లో మాంసాహార, శాకాహార జంతువులు ఉండాలి. వాటితోపాటు పక్షులు ఉంటేనే పర్యావరణ సమతుల్యత ఉంటుంది. పక్షుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. 

Updated Date - 2022-05-16T04:33:47+05:30 IST