Advertisement

కలకలం రేపుతున్న సరికొత్త ఆన్‌లైన్‌ మోసాలు

Jan 24 2021 @ 00:37AM

కేటుగాళ్లు!

ఆపదలో ఉన్నాం డబ్బు పంపాలని మెసేజ్‌లు..

మీ పేరుతో మీకు తెలియకుండానే ఆన్‌లైన్‌ వసూళ్లు

జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న మోసాలు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): గుంటూరుకు చెందిన ఓ వ్యక్తికి ఫేస్‌బుక్‌లో ఓ రిక్వెస్ట్‌ వచ్చింది. స్నేహితుడి వద్ద నుంచే కదా అని చూస్తే... అర్జెంటుగా డబ్బులు కావాలని అందులో సమాచారం ఉంది. ఏదో ఆపదలో ఉన్నాడు కదా అని రూ.2వేలు అందులో ఉన్న నెంబర్‌కు పంపాడు. ఆ కొద్దిసేపటికే ఆ స్నేహితుడి వద్ద నుంచి ఓ మెసేజ్‌ వచ్చింది. నా పేరుతో ఎవరో ఫేక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేశారు... డబ్బులు అడుగుతారు.. దయచేసి పంపవద్దు అని..! ఈ లోగా డబ్బులు పంపిన వ్యక్తి విషయం తెలుసుకుని లబోదిబో మన్నాడు. 

 

ఇటీవల పెరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన మోసాల కంటే భిన్నంగా ప్రస్తుతం చోటు చేసుకుంటున్న మోసాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.. వారికి తెలియకుండానే వారి పేరుతో వారి స్నేహితులు బంధువులకు ఛాటింగ్‌ల ద్వారా సంప్రదింపులు జరుపుతూ అత్యవసర పరిస్థితిలో ఉన్నానని నమ్మిస్తూ తమ అకౌంట్‌కు ఆన్‌లైన్‌ ద్వారా డబ్బు జమ చేయించుకుంటున్నారు. గడిచిన పది రోజులుగా నగరంలో ఈ తరహా మోసాలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


మోసం జరుగుతోంది ఇలా.. 

ఒకరి పేరుపై ఉన్న ఫేస్‌బుక్‌ అకౌంట్‌తో అకౌంట్‌ తెరుస్తున్నారు. నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ని ఆపరేట్‌ చేస్తున్న వ్యక్తి తాను ఇబ్బందుల్లో ఉన్నాననో... వైద్యం కోసం అత్యవసరంగా డబ్బులు కావాలనో ఫేస్‌బుక్‌ ద్వారా పోస్టు చేస్తున్నారు. దాంతో వారు తమ స్నేహితుడు ఇబ్బందుల్లో ఉన్నాడని భావిస్తూ ఆన్‌లైన్‌లోనే ఛాటింగ్‌ చేస్తున్నారు. ఇదే ఉచ్చులో పడేలా చేస్తోంది. ఆ పరిస్థితుల్లో తమ స్నేహితుడు నేరుగా/ ఫోన్‌ చేసి అయినా సాయం కోరకుండా ఇలా ఛాటింగ్‌ ద్వారా అడుగుతున్నాడేమిటి అని ఎవరూ సందేహించడం లేదు. పైగా తమ వద్ద ఉన్న అతని నెంబర్‌కి కాకుండా ఛాటింగ్‌లో పంపిన నెంబర్‌కి యూపీయూ యాప్స్‌ ద్వారా నగదు బదిలీ చేస్తున్నారు. తర్వాత విషయం తెలుసుకుని లబోదిబో మంటున్నారు. ఒకవేళ ఎవరికైనా అనుమానం వచ్చి తనకు సందేశం పంపిన వ్యక్తితో మాట్లాడాలని ప్రయత్నించినా ఫోన్‌ నెట్‌వర్క్‌ కలవకుండా మాట్లాడాలని చూస్తుంటారు. దీంతో నిజమోనేమోనని భ్రమించి డబ్బు జమ చేస్తున్నారు.


వారం రోజులుగా...

ఇటీవలే శ్రీనివాసరావుపేటకు చెందిన ఓ వ్యక్తి ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. అయితే ఆయన నగదుని సైబర్‌ నేరగాడు పంపిన నెంబరుకు కాకుండా తన ఫోన్‌లో ఫీడ్‌ అయి ఉన్న స్నేహితుడి అసలు నెంబరుకి నగదు పంపడంతో ఎలాంటి నష్టం జరగలేదు. మంగళగిరికి చెందిన మరో ఫేస్‌బుక్‌ వినియోగదారుడి అకౌంట్‌తో నగరంలో అతని స్నేహితులు ఇద్దరికి ఆన్‌లైన్‌లో ఛాటింగ్‌ రిక్వెస్ట్‌లు పంపి ఒకరి ద్వారా రూ.12 వేలు, మరొకరి ద్వారా రూ.2 వేలు సైబర్‌ నేరస్థుడు తన అకౌంట్‌లోకి బదిలీ చేయించుకొన్నారు. ఇలానే మరో రాజకీయ నాయకుడి నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ని క్రియేట్‌ చేసి అతని స్నేహితులకు డబ్బు పంపమని విజ్ఞప్తులు పంపారు. గడిచిన వారం రోజులుగా పలు పత్రికా కార్యాలయాల్లో ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు ఈ తరహా సైబర్‌ కేటుగాళ్ల మోసానికి గురికావటం విశేషం.


ఈ తరహా మోసాలపై జాగ్రత్త

కొద్ది రోజులుగా నగరంలో సైబర్‌ కేటుగాల్ళ మోసాలు పెరిగిపోయాయని బాధితులు లబోదిబోమంటున్నారు. అయితే వారు పోలీసులకు ఫిర్యాదు చేయటానికి కూడా ఆసక్తి చూపటం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇటువంటి సందేశాలనుఎట్టి పరిస్థితిల్లో నమ్మవద్దని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటువంటి సందేశాలు వచ్చినప్పుడు నేరుగా వారితో మాట్లాడి వాస్తవమేనని నిర్థారించిన తరువాతే లావాదేవీలు నిర్వహించాలని సూచిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కేవలం సందేశాల ద్వారా మాత్రమే డబ్బు అడిగే పరిస్థితి ఉండదని సూచిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారి అకౌంట్‌కు డబ్బు జమ చేసినా వారు ఉపయోగించుకునే వీలు కూడా ఉండదని దీనిని బట్టి ఈ తరహా సందేశాలన్ని సైబర్‌ మోసగాళ్ళు చేస్తున్న పనేనని గుర్తించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు కోరుతున్నారు.  

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.