సగం రుణమే

ABN , First Publish Date - 2020-12-03T05:26:32+05:30 IST

చిరువ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన జగనన్నతోడు పథకం రుణాన్ని అందజేయడంలో బ్యాంకులు వింతగా వ్యవహరిస్తున్నాయి. పదివేల రూపాయల చొప్పున బ్యాంకులు రుణం అందించాలి. కొన్ని బ్యాంకులు తమ సహజశైలిలో సగం మాత్రమే అందించి ఆ రుణం చెల్లించాక మిగిలిన ఐదువేల రూపాయల రుణం ఇస్తామని మెలికపెడుతుండడంతో లబ్ధిదారులు విస్తుపోతున్నారు.

సగం రుణమే

బ్యాంకుల తీరుపై ‘జగనన్నతోడు’ లబ్ధిదారుల నిరాశ

(బొబ్బిలి)

చిరువ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన జగనన్నతోడు పథకం రుణాన్ని అందజేయడంలో బ్యాంకులు వింతగా వ్యవహరిస్తున్నాయి. పదివేల రూపాయల చొప్పున బ్యాంకులు రుణం అందించాలి. కొన్ని  బ్యాంకులు తమ సహజశైలిలో సగం మాత్రమే అందించి ఆ రుణం చెల్లించాక మిగిలిన ఐదువేల రూపాయల రుణం ఇస్తామని మెలికపెడుతుండడంతో లబ్ధిదారులు విస్తుపోతున్నారు. దీనిపై బొబ్బిలిలో ఓ బ్యాంకు మేనేజరును ప్రశ్నించగా ఐదువేల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నామని, వారి రికవరీ చెల్లింపులు బాగుంటే మిగిలిన రుణమొత్తం ఇస్తామని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా రుణ గ్రహీతల నుంచి స్టాంపు డ్యూటీని ఒక్కో బ్యాంకు ఒక్కోలా వసూలు చేస్తోంది. స్టాంపుడ్యూటీని  చెల్లించాక  తీరిగ్గా దానిని మినహాయిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇలా జగనన్నతోడు పథకం అమలులో ఎన్నెన్నో విచిత్రాలు బయటపడుతున్నాయి. వీధివ్యాపారులు,  పండ్లు, కూరగాయలు, తినుబండారాలు, ఇతర చిల్లర వస్తువులు అమ్ముకునేవారికి బ్యాంకుల ద్వారా పదివేల రూపాయల రుణ సహాయాన్ని అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఆచరణలో అనేక అవాంతరాలు కనిపిస్తున్నాయి. బ్యాంకులు రూ.50 నుంచి రూ.150 వరకు కోర్టుఫీ స్టాంపులను కొనుగోలు చేయిస్తున్నాయి. వీటిని మినహాయించినట్లు ప్రభుత్వం ప్రకటించినా తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని బ్యాంకులు చెబుతున్నాయి. అంతటితో ఆగకుండా ఈ పథకంలో రుణం పొందేవారు బ్యాంకుల్లో అకౌంట్‌ను ప్రారంభించేందుకు వెయ్యి రూపాయల చొప్పున డిపాజిట్‌ చేయాలట. కేవలం పదివేల రూపాయల రుణం కోసం వెయ్యి రూపాయలా? అని వ్యాపారులంతా గగ్గోలు పెడుతున్నారు. పైగా తాత తండ్రుల నుంచి చిరువ్యాపారాలు చేసుకుంటున్న వారిలో చాలామందికి ఈ రుణాలు అందడం లేదు. అంగన్‌వాడీ ఇతరత్రా ఉద్యోగాలు చేసుకుంటున్నవారికి రుణాలను ఎలా మంజూరు చేస్తున్నారని అర్హులు ప్రశ్నిస్తున్నారు. 

అనర్హులకు రుణాలు మంజూరైతే కఠిన చర్యలు

జగనన్నతోడు పథకంలో అనర్హులకు రుణాలు మంజూరైనట్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. బొబ్బిలి పట్టణంలో 1322 మందిని ప్రాథమికంగా అర్హులుగా గుర్తించాం. వీరందరికీ వెరిఫికేషన్‌ అయ్యాక బ్యాంకులు రుణాలు అందిస్తాయి. గుర్తింపు కార్డులను పూర్తిస్థాయిలో జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం. 

- ఎంఎం నాయుడు, మున్సిపల్‌ కమిషనర్‌, బొబ్బిలి

 

Updated Date - 2020-12-03T05:26:32+05:30 IST