కన్నేస్తే ఖాళీ

ABN , First Publish Date - 2022-09-26T07:45:38+05:30 IST

రాష్ట్రంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. కొందరు రెవెన్యూ అధికారుల కక్కుర్తి ఫలితంగా ఖరీదైన ఈ భూములు పరాధీనమైపోతున్నాయి. వాటిని దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్‌

కన్నేస్తే ఖాళీ

ప్రభుత్వ భూమి కనిపిస్తే హాంఫట్‌

వేగంగా చేతులు మారుతున్న 

ప్రభుత్వ భూములు దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్‌

ఆనక మ్యుటేషన్‌ కోసం దరఖాస్తులు

వెబ్‌ల్యాండ్‌ లాగిన్‌ దుర్వినియోగం

పార్కు స్థలాలు, అసైన్డ్‌, గిరిజన భూములనూ వదల్లేదు

మాఫియాతో అధికారుల కుమ్మక్కు

నెల్లూరు, ప్రకాశం, కడప, అన్నమయ్య,

బాపట్ల జిల్లాల్లోనే సమస్య తీవ్రం రెవెన్యూ శాఖ నివేదిక


రాష్ట్రంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. కొందరు రెవెన్యూ అధికారుల కక్కుర్తి ఫలితంగా ఖరీదైన ఈ  భూములు పరాధీనమైపోతున్నాయి. వాటిని దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్న ఉదంతాలు పుంఖానుపుంఖాలుగా వెలుగుచూస్తున్నాయి. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు. స్వయంగా రెవెన్యూ శాఖే తన నివేదికలో స్పష్టం చేసింది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

రాష్ట్రవ్యాప్తంగా భూముల సర్వే జరుగుతున్న సమయంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. రెవెన్యూ అధికారుల అండదండలతో ప్రైవేటు వ్యక్తులు గుట్టుగా రిజిస్ట్రేషన్లు జరిపి ఆ తర్వాత మ్యుటేషన్లకు దరఖాస్తు చేసుకుంటున్నారు. మ్యుటేషన్‌ చేసే సమయంలో మాత్రం దొరికిపోతున్నారు. ఒకటో రెండో కాదు.. కొన్ని వందల కేసులు ఇలాంటివి వెలుగుచూశాయి. ప్రధానంగా ఐదు జిల్లాల్లో ఈ సమస్య చాలా ఎక్కువ గా ఉందని రెవెన్యూశాఖ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్‌ దరఖాస్తులపై ఇటీవల సమీక్ష జరిపింది. 1,24,374 దరఖాస్తులు రాగా.. అందులో 52,617 పెండింగ్‌లో పెట్టారు. 64,306 దరఖాస్తులను ఆమోదించి.. 3,720 తిరస్కరించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల సంఖ్య సగంపైనే ఉండడంతో కలెక్టర్లు, జేసీల నుంచి వివరాలు సేకరించారు.


చుక్కల భూములు, సాదాబైనామాతోపాటు ప్రభుత్వ భూములపై హక్కులు కోరిన దరఖాస్తులు పెద్ద ఎత్తున వచ్చినట్లు గుర్తించారు. నెల్లూరు, ప్రకాశం, వైఎ్‌సఆర్‌ కడప, అన్నమయ్య, బాపట్ల జిల్లాల పరిధిలో ప్రభుత్వ భూములను మ్యుటేషన్‌ చేయాలని అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 400కుపైగా దరఖాస్తులు ఉన్నట్లు గుర్తించారు. రెండు జిల్లాల పరిధిలో విలువైన పార్కు స్ధలాలను ప్రైవేటుదిగా చూపించి మ్యుటేషన్‌ కోరినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.


ఎలా రిజిస్ట్రేషన్‌ చేశారు..?

సాధారణంగా ప్రతి ప్రభుత్వ భూమి నిషేధ భూమి జాబితాలో ఉంటుంది. రెవెన్యూ రికార్డుల్లో దీనిని ప్రభుత్వ భూమిగా చూపిస్తారు. మరి వీటికి రిజిస్ట్రేషన్లు ఎలా చేశారు? సేల్‌ డీడ్స్‌ ఎక్కడి నుంచి వచ్చాయని ఉన్నతాధికారులు ఆరాతీస్తున్నారు. ల్యాండ్‌ మాఫియాతో కొందరు అధికారులు కుమ్మక్కై వెబ్‌ల్యాండ్‌ లాగిన్‌ డేటాను దుర్వినియోగం చేయడం వల్లే ఈ సమస్య వచ్చి ఉంటుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బాపట్ల జిల్లాలో ఓ వ్యక్తి పడావు పడిన పార్కు స్థలాన్ని గుట్టుగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఇందుకు రెవెన్యూ అధికారి కూడా అంతే గుట్టుగా సహకరించినట్లు అనుమానిస్తున్నారు. అదెలాగంటే..


రిజిస్ట్రేషన్‌కు ముందు ఆ భూమిని వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో ప్రైవేటుగా చూపించారని, అందుకే రిజిస్ట్రేషన్‌ జరిగిందని.. ఆ పని పూర్తికాగానే తిరిగి దానిని ప్రభుత్వ భూమిగానే రికార్డును పూర్వ స్థితికి తీసుకొచ్చారని అధికారులు గుర్తించారు. ఇలా 270 కేసుల్లో జరిగింది. ఆ భూములపై మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో అది ప్రభుత్వ భూమిగానే ఉంది. దీంతో మ్యుటేషన్‌ దరఖాస్తులను కొన్ని చోట్ల తిరస్కరించారు. మరికొన్ని చోట్ల పెండింగ్‌ పెట్టారు. ఇలాంటి కేసులు ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా వస్తున్నాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ కేటగిరీ దరఖాస్తులను జిల్లాల వారీగా క్రోడీకరించారు. ఇందులో ఎక్కువగా స్థానిక ల్యాండ్‌ మాఫియా హస్తం ఉందని నిర్ధారించారు. అలాగే చాలా చోట్ల ఇందుకు బాధ్యులైన రెవెన్యూ అధికారులను కూడా గుర్తించారు. వారిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ శాఖ సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. మ్యుటేషన్‌ సవరణల పేరిట కూడా 693 దరఖాస్తులు వచ్చాయి. ఇవన్నీ ప్రభుత్వ భూములను తమ పేరిట మార్చాలని వచ్చినవే. వైఎ్‌సఆర్‌ కడప, కర్నూలు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో సగటున 75పైనే ఈ తరహా దరఖాస్తులు వచ్చాయని రెవెన్యూ శాఖ తన నివేదికలో పేర్కొంది. 


అసైన్డ్‌ భూములు కూడా..

ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్‌ భూములను మ్యుటేషన్‌ చేయాలంటూ ప్రైవేటు వ్యక్తులు దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 84 మంది అసైన్డ్‌పై మ్యుటేషన్లు కోరగా.. ఈ దరఖాస్తులను తిరస్కరించారు. అసైన్డ్‌ భూముల బదలాయింపు చట్టవ్యతిరేకం. పీవోటీ చట్టం ప్రకారం వాటిని ఇతరులు కొనుగోలు చేయడానికి వీల్లేదు. అమ్మడమూ చట్టవిరుద్దం. ఈ నేపఽథ్యంలో ఆ భూములను నిషేధ జాబితాలో చేర్చారు. అయినా ఈ భూములపై మ్యుటేషన్లు కోరడం  చర్చనీయాంశంగా మారింది.


గిరిజన భూముల కొనుగోలు..

షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గిరిజనేతరులు భారీగా భూములు కొనుగోలు చేసిన విషయం వెలుగుచూసింది. అలా కొన్న భూములను మ్యుటేషన్‌ చేయాలంటూ దరఖాస్తులు చేశారు. ఇటీవలి కాలంలో ఇలా 66 దరఖాస్తులు వచ్చాయి. గిరిజన పీఎల్‌టీ చట్టం ప్రకారం షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూముల బదలాయింపు నిషేధం. ఈ కేటగిరీ దరఖాస్తులను కూడా అధికారులు తిరస్కరించారు.

Updated Date - 2022-09-26T07:45:38+05:30 IST