టెన్త్‌లో 96.07 శాతం ఉత్తీర్ణత

ABN , First Publish Date - 2022-07-01T06:31:28+05:30 IST

టెన్త్‌లో 96.07 శాతం ఉత్తీర్ణత

టెన్త్‌లో 96.07 శాతం ఉత్తీర్ణత

ఫలితాల్లో రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచిన హనుమకొండ జిల్లా

12,454 మంది విద్యార్థులకు 11,965 మంది పాస్‌

కేజీబీవీల్లో 96.33, మోడల్‌ స్కూళ్లలో 98 శాతం పాస్‌

సత్తా చాటిన ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 

 పెద్ద సంఖ్యలో 10/10 జీపీఏల కైవసం


వరంగల్‌ సిటీ, జూన్‌ 30: 70 శాతం సిలబ్‌సతో పదో తరగతి పరీక్షలను పూర్తిస్థాయిలో రాసిన విద్యార్థులు విజయాన్ని సాధించారు. హనుమకొండ జిల్లాను రాష్ట్ర స్థాయిలో 6వ స్థానంలో నిలబెట్టారు. జిల్లాలోని వివిధ రకాల యాజమాన్యాలకు చెందిన 318 పాఠశాలల నుంచి 12,454 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయగా, 11,965 మంది విద్యార్థులు ఉత్తీర్ణత (96.07శాతం) సాధించారు. అలాగే 9 కేజీబీవీల నుంచి 300 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 289 మంది (96.33 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 


ఉత్తీర్ణత వివరాలు

మే 23 నుంచి జూన్‌ 1 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు జిల్లా నుంచి వివిధ యాజమాన్యాలకు చెందిన 318 పాఠశాలల నుంచి మొత్తం 12,454 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో 6,573 మంది బాలురు పరీక్షలు రాయగా 6,523 మంది (95.13 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 5,881 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా 5,712 మంది (97.13 శాతం) ఉత్తీర్ణత సాధించి జిల్లాలో టాప్‌లో నిలిచారు. 


కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లల్లో...

జిల్లాలోని 9 కేజీబీవీల నుంచి 300 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 289 మంది (96.33 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఐనవోలు, ఆత్మకూరు, శాయంపేట, వేలేరు కేజీబీవీలు 100 ఫలితాలు సాధించాయి. ఐనవోలు కేజీబీవీలోని ముగ్గురు విద్యార్థినులు జె.హాసిని, ఎన్‌.శ్రీవాణి, ఎం..అర్చన 10 జీపీఏ సాధించారు. 3 మోడల్‌ స్కూళ్ల నుంచి 299 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 293 మంది (98 శాతం) పాస్‌ అయ్యారు. 


ప్రైవేటు స్కూళ్ల జోరు

పదో తరగతి ఫలితాల్లో హనుమకొండలోని ప్రయివేటు పాఠశాలలు సత్తా చాటాయి. చాలా మంది విద్యార్థులు 10/10 సాధించారు. దీంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు సంబరాలు జరుపుకున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఉపాధ్యాయుల ఉత్తమ బోధన, పటిష్టమైన ప్రణాళికతో ఫలితాలు సాధించామని చెప్పుకొచ్చారు. ప్రధానంగా ఎస్‌ఆర్‌, షైన్‌, తేజస్వి, శ్రీనివాస్‌ గురుకుల్‌ తదితర పాఠశాలల్లో పలువురు విద్యార్థులు 10/10 సాధించారు. ఎస్‌ఆర్‌ విద్యార్థులు 228 మంది 10/10 జీపీఏ సాధించగా, తేజస్వి పాఠశాలకు చెందిన 166 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. షైన్‌ విద్యార్థులు 122 మంది 10/10 సాధించగా, ఆర్యభట్ట విద్యార్థులు 24 మంది 10/10 జీపీఏ సాధించి సత్తా చాటారు.


ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ 

ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయని డీఈవో బి. రంగయ్యనాయుడు తెలిపారు. ఇందుకోసం పరీక్ష ఫీజును జూలై 18లోపు చెల్లించాలని ఆయన కోరారు. రూ. 50 అపరాధ రుసుముతో పరీక్షకు రెండు రోజుల ముందు వరకు చెల్లించేందుకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-01T06:31:28+05:30 IST