నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తా: జడ్పీ సీఈవో

ABN , First Publish Date - 2022-05-26T06:15:24+05:30 IST

హుజూర్‌నగర్‌ ఎంపీడీవోపై అభియోగాల నేపథ్యంలో విచారణ చేశామని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని జడ్పీ సీఈవో సురేష్‌ తెలిపారు.

నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తా: జడ్పీ సీఈవో
ఎంపీడీవో అక్రమాలపై విచారణ చేస్తున్న సీఈవో సురేష్‌

హుజూర్‌నగర్‌, మే 25: హుజూర్‌నగర్‌ ఎంపీడీవోపై అభియోగాల నేపథ్యంలో విచారణ చేశామని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని జడ్పీ సీఈవో సురేష్‌ తెలిపారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌ మండలంలోని పలు గ్రామాల్లో ఎస్సీ కార్పొరేషన్‌ నిధుల్లో అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేయడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నట్లు సీఈవో సురే్‌షబాబు తెలిపారు. లింగగిరిలో పల్లె ప్రకృతి వనంకు సంబంధించి 3,900 మొక్కలు నాటగా అందులో కనీసం 40 మొక్కలు కూడా లేవని, ఎంపీడీవో ఉపాధిహామీకి సంబంధించి కారు కిరాయికి పెట్టుకోకుండానే నెలకు రూ.33 వేల నిధులను డ్రా చేస్తున్నారని జడ్పీ సీఈవో దృష్టికి ఎంపీపీ గూడెపు శ్రీనివాస్‌ తెచ్చారు. వేపలసింగారం గ్రామానికి చెందిన పలువురు ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల కోసం దరఖాస్తు పెట్టుకోగా ఎంపీడీవో పథకానికి ఎంపిక చేసేందుకు రూ.10వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారని ఇద్దరు దరఖాస్తుదారులు సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాటుగా మెగా పల్లె ప్రకృతి వనాలలో హరితహారం మొక్కలు లేవని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పథకాలు సమర్థంగా అమలుచేయాలని కోరినా ఎంపీడీవో పట్టించుకోవడం లేదని, ఎంపీపీ సీఈవోకు వివరించారు. ఈ విషయంపై ఎంపీడీవో శాంతకుమారి మాట్లాడుతూ తాను ఎవరి వద్ద లంచాలు అడగలేదని, కావాలనే తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

Updated Date - 2022-05-26T06:15:24+05:30 IST